గోల్​కీపర్​గా రాణిస్తున్న సిక్కోలు యువతి.. ఒలంపిక్స్​లో పసిడే లక్ష్యంగా

author img

By

Published : Sep 28, 2022, 12:56 PM IST

HOCKEY GOLL KEEPER

HOCKEY GOLL KEEPER : ఆటపై ఉన్న ఆసక్తితో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది ఆ యువతి. నిరుపేద కుటుంబం, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం.. ఆయన దూరమైనా పోరాడేలా చేసింది. ఫలితంగా భారత జూనియర్‌ హాకీ జట్టులో స్థానం పదిలం చేసుకుంది. తనే సిక్కోలుకు చెందిన కూర్మాపు రమ్య. రన్నర్‌గా మొదలైన యువతి ప్రస్థానం.. జాతీయ స్థాయి హాకీ గోల్‌ కీపర్‌గా ఎదిగింది. అంతర్జాతీయ వేదికపై తనదైన ప్రతిభ కనబరిచి.. దేశానికి 2 పతకాలు సాదించింది. 2024 ఒలంపిక్సే లక్ష్యంగా కసరత్తులు చేస్తోన్న హాకీ గోల్‌ కీపర్‌ రమ్య ప్రస్థానం ఇది.

GOLL KEEPER RAMYA : అవకాశాలు అందరికి వస్తాయి వాటిని అందిపుచ్చుకుంటేనే కదా అసలైన విజయం. ఈ మాటలనే నిజం చేస్తోంది ఆ యువతి. ఆటో డ్రైవర్‌ కుమార్తె ఐన ఈ అమ్మాయి.. హాకీ పోటీల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో చక్కటి ప్రతిభ కనబరిచి.. భారత జూనియర్‌ హాకీ జట్టులో గోల్‌ కీపర్‌గా రాణిస్తోంది. అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటి ఇప్పటికే దేశానికి రెండు పతకాలు తెచ్చిపెట్టింది.

కూర్మాపు రమ్య.. శ్రీకాకుళంలోని ఓ మధ్యతరగతి కుటుబంలో జన్మించిన యువతి. రమ్యకి చిన్ననాటి నుంచే ఆటలపై మక్కువ. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా కుమార్తె ఇష్టాన్ని కాదనలేని ఆ తల్లిదండ్రులు అన్నింటా అండగా నిలిచారు. తం‌డ్రి ఆటోలో ఉదయాన్నే నగరంలోని కోడి రామ్మూర్తి మైదానానికి చేరుకుని రమ్య మొదట్లో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసేది.

రన్నింగ్​ నుంచి హాకీ వైపు పయనం : మైదానంలో నిత్యం రన్నింగ్‌ చేసే యువతి.. అక్కడ హాకీ క్రీడను చూసి ఆకర్షితురాలైంది. హాకీ ఆడటానికి అమ్మాయిలు లేకపోవడంతో అబ్బాయిలతోనే సాధన చేసింది రమ్య. చదువుతో పాటు ఆటలోనూ రాణించాలనుకున్న యువతి.. కడపలోని క్రీడా పాఠశాలకు ఎంపికైంది. రమ్య చురుకుతనాన్ని గమనించిన కోచ్‌ ఖాదర్‌ బాషా.. గోల్‌ కీపింగ్‌ చేయమని సలహా ఇవ్వడంతో ఆ విధంగా అడుగులు వేసినట్లు చెబుతోంది ఈ క్రీడాకారిణి.

శ్రీకాకుళం జిల్లాకి హాకీ జట్టు లేకపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సహకారంతో.. ప్రకాశం, విశాఖ, పశ్చిమగోదావరి, నెల్లూరు జట్ల తరపున ఆడేది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేని రమ్య ఆటకు స్వస్తి చెప్పాలనుకుంది. కానీ భర్త ఆశయం, కుమార్తె లక్ష్యం కోసం రమ్య తల్లి నర్సాబాయి టైలరింగ్‌ పని చేస్తూ రమ్యకు అండగా నిలిచింది.

హాకీ జట్టుకు కెప్టెన్​తో పాటు గోల్​కీపర్​గా గుర్తింపు : నిత్యం హాకీ సాధన చేస్తున్న రమ్య దిల్లీలోని భారత అకాడమీకి ఎంపికైంది. అక్కడున్నప్పుడు తల్లికి జబ్బు చేయడంతో ఉపకార వేతనంలో కొంత మిగిల్చి ఇంటికి పంపేది. నార్త్‌జోన్‌ మహిళా, ఆలిండియా, ఖేలో ఇండియా.. ఇలా ప్రతిచోటా మెరుగైన ప్రదర్శన చేసేది.. రమ్య. ఈమె ఆంధ్రప్రదేశ్ హాకీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు గోల్‌కీపర్‌గానూ గుర్తింపు పొందింది. దీంతో మొదటగా ఐర్లాండ్‌లో జరిగే అంతర్జాతీయ అండర్-23 టోర్నీలో ఆడేందుకు భారత జట్టుకు ఎంపికైంది రమ్య.

9 జాతీయస్థాయి హాకీ పోటీల్లో ఆడిన రమ్య.. లక్నోలో రైల్వే జట్టు తరఫున ఆతిథ్య క్రీడాకారిణిగా ఆడి.. మరోసారి ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపిక అయ్యింది. నిష్ణాతులైన శిక్షకుల వద్ద రమ్య నేర్చుకున్న మెళకువలు.. వర్ధమాన క్రీడాకారులకు పంచేందుకు మొదట తాను నేర్చుకున్న శ్రీకాకుళం మైదానంలో అడుగుపెట్టి క్రీడాకారులతో అనుభవాలను పంచుకుంటుంది గోల్‌ కీపర్‌ రమ్య.

ఒలంపిక్స్​లో పసిడే లక్ష్యంగా : ఈ ఏడాది జూన్ 19-26 మధ్య జరిగిన పోటీల్లో భారత్ తరుపున‌.. నెదర్లాండ్స్, ఐర్లాండ్, అమెరికా, ఉక్రెయిన్‌లతో తలపడింది. భారత జట్టు ప్రధాన గోల్‌ కీపర్‌గా వ్యవహరించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హరియాణాలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేస్తోన్న రమ్య.. ఒలింపిక్స్‌లో దేశానికి పసిడి పతకం అందించడమే తన లక్ష్యమంటోంది. అనతికాలంలోనే లక్ష్యానికి చేరుకున్న రమ్య దానికోసం నిత్యం శ్రమించేదని శిక్షకులు చెబుతున్నారు. రమ్య కఠోర శ్రమ, ఆటపై తపనతోనే ఇవి సాధ్యమయ్యాయని హాకీ శిక్షకులు అభిప్రాయపడుతున్నారు.

రమ్య ఆటతీరు ప్రారంభం నుంచి రోజురోజుకు మెరుగుపర్చుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు తనదైన శైలిలో ఉత్తమ ఫలితాలతో రాణిస్తోంది. భారతదేశ సీనియర్ హకీ జట్టుకు ప్రధాన గోల్‌కీపర్‌గా రాణించగలిగే సత్తా తనకుందనే అందరూ విశ్వసిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.