ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాసర ఆర్జీయూకేటీలో మళ్లీ విద్యార్థుల ఆందోళన..మోహరించిన పోలీసులు

By

Published : Jul 31, 2022, 1:09 PM IST

RGUKT

BASARA RGUKT: కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణలోని బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజనం చేయకుండా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు.. ఉదయం అల్పాహారమూ తినకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ట్రిపుల్​ ఐటీ ప్రాంగణం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

BASARA RGUKT: తెలంగాణలోని నిర్మల్​ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపట్టారు. కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఆర్జీయూకేటీలోని మెస్‌లు ఇ1, ఇ2 ముందు విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి భోజనం చేయని విద్యార్థులు.. ఉదయం అల్పాహారం కూడా చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు.

కలుషిత ఆహారం ఘటన తర్వాత.. మూడు మెస్‌ల కాంట్రాక్టులను రద్దు చేస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్‌కు చెందిన సిబ్బంది త్వరలో రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ వారు రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు. కలుషిత ఆహారానికి సంబంధించిన పదార్థాల నమూనాలను పరీక్షలకు పంపించారు.. కానీ ఆ నివేదికలోని విషయాలను ఎందుకు బహిరంగ పరచడం లేదో చెప్పాలన్నారు. జులై 24 నాటికి మెస్‌ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పినా.. ఈ విషయంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు.

విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని సందర్శించనున్నారు. విద్యార్థులతో సమస్యను గురించి మాట్లాడనున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ట్రిపుల్​ ఐటీ ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్​-బైంసా ప్రధాన రహదారిపై పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details