ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరుణాగ్రహానికి పంటలు వర్షార్పణం.. రైతుల పరిస్థితి అగమ్యగోచరం

By

Published : Jul 15, 2022, 9:20 AM IST

Rain Effect on Crops: వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతికూల ప్రభావం చూపాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. పత్తి, కంది, మొక్కజొన్న సహా పలు పంటలు దిబ్బతినే ప్రమాదం ఏర్పడింది. పెట్టుబడి నష్టపోయామంటున్న రైతులు.. పరిహారం అందించాలని కోరుతున్నారు.

వరుణాగ్రహానికి పంటలు వర్షార్పణం..
వరుణాగ్రహానికి పంటలు వర్షార్పణం..

Rain Effect on Crops : కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలు.. పంటలపై పెనుప్రభావం చూపుతున్నాయి. జూన్ నెలఖారు వరకు ముఖం చాటేసిన వరుణుడు.. ఒక్కసారిగా ప్రతాంపం చూపించడంతో తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికవర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాధారణంకంటే ఎక్కువగా వర్షాలుపడ్డాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో 142.8 మిల్లీ మీటర్లకుగాను 292.6, నారాయణపేట జిల్లాలో 123 మిల్లీ మీటర్లకుగాను.. 217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 129 మిల్లీమీటర్లకు 251, వనపర్తి జిల్లాలో 126 మిల్లీ మీటర్లకు 228, జోగులాంబ గద్వాల జిల్లాలో 104 మిల్లీమీటర్లకు 150.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి కురిసిన వర్షపాతంతో పోల్చుకున్నా జోగులాంబ గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షాలు నమోదయ్యాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో.. ఈ వానాకాలంలో 18లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా.. జూలై నాటికి ఏడున్నర లక్షల ఎకరాల్లో వేశారు. అత్యధికంగా పత్తి.. 6లక్షల 26వేల ఎకరాల్లో సాగైంది. పత్తి విత్తనాలు వేసి మొలకెత్తే దశలో ఉండగా.. కురిసిన వర్షాలతో విత్తనం కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే పత్తి రైతులు.. ఎకరాకు 10వేల నుంచి 20వేల వరకు పెట్టుబడిపెట్టారు. ఈ వానల వల్ల విత్తులు మొలకెత్తుతాయో.., లేదోనని అందోళన చెందుతున్నారు.

లక్ష ఎకరాల్లో కంది, 50వేల ఎకరాల్లో మొక్కజొన్న సహా జొన్న, పెసర ఇతర పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు కాస్త మేలు చేసినా... ఎడతెరపి లేకుండా కురవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటే రైతులుపంటనష్టం నుంచి బయటపడవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటపొలాల్లో నిలిచిన నీటిని కాల్వలు తీసి వెంటనే బయటకు పంపాలని చెబుతున్నారు. వరిసాగు చేసిన రైతులకు మాత్రం ఈ వర్షాలు అనుకూలంగా మారాయి. ప్రస్తుతం వానలు సంమృద్ధిగా కురవడంతో అంతా వరి వేయడానికి సన్నద్ధమవున్నారు.

వరుణాగ్రహానికి పంటలు వర్షార్పణం..

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details