ETV Bharat / city

ఉగ్ర గోదావరి.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు

author img

By

Published : Jul 15, 2022, 4:32 AM IST

గోదావరి విశ్వరూపం దాల్చింది. ఊరూవాడా ఏకం చేస్తోంది. కాటన్‌ బ్యారేజీ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ ఉగ్రరూపాన్ని చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. ఎగువన వర్షాలు, వరద ప్రవాహం ఆధారంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరదతీవ్రత మరింత పెరగవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

జల దిగ్బంధంలో లంక గ్రామాలు
జల దిగ్బంధంలో లంక గ్రామాలు

ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీలో ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో పెరుగుతోంది. గురువారం రాత్రి 12 గంటల సమయానికి బ్యారేజీలో నీటి మట్టం 16.70 అడుగులకు చేరి.. 17,53,251 క్యూసెక్కుల జలాలు వస్తుంటే.. అదేస్థాయిలో కడలికి వదులుతున్నారు. కాళేశ్వరం నుంచి భద్రాచలానికి వరద చేరుకోవడానికి 25 నుంచి 30 గంటలు పడితే.. భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి వరద చేరుకోడానికి 15 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎగువన వర్షాలు, వరద ప్రవాహం ఆధారంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరదతీవ్రత మరింత పెరగవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రవాహం 25 లక్షల క్యూసెక్కులు దాటితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించారు. ఇప్పటికే బలహీనంగా గట్లు ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచి పర్యవేక్షణ పెంచారు.

.
.

స్తంభించిన రాకపోకలు: కోనసీమ జిల్లాలో 20, తూగో జిల్లాలో 8, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది. కోనసీమ జిల్లాలో ఇప్పటికే 37, తూర్పుగోదావరి జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 13 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. సహాయక చర్యలపై కలెక్టర్లు దృష్టిసారించారు. బ్యారేజీతోపాటు లంక గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌లోని కంట్రోల్‌రూమ్‌ నుంచి విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షిస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న పి.గన్నవరం, సఖినేటిపల్లి, అయినవిల్లి, అల్లవరం మండలాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, విపత్తుల నిర్వహణ బృందాలను పంపారు. వరద శుక్రవారానికి 23 లక్షల నుంచి 24 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేయనున్నారు. వరదల పరిస్థితిని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో శ్రీరామసాగర్‌ సహా అన్ని రిజర్వాయర్ల నుంచి భారీగా నీరు విడుదల అవుతోందని అధికారులు చెప్పారు. వచ్చే 24 గంటల నుంచి 48 గంటల్లో ప్రవాహం మరింత పెరగనున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం, ధవళేశ్వరం వద్ద పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనించాలని.. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

.
.

పశ్చిమగోదావరి జిల్లాలో 13 లంక గ్రామాల్లోని పలు ఇళ్లు నీట మునగడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏడు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. నరసాపురం పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కాలువలు, డ్రెయిన్లు పోటెత్తుతున్నాయి. పంట భూములు నీట మునిగాయి. అలల ధాటికి ఆక్వా చెరువుల గట్లు దెబ్బతింటున్నాయి.

.
.

వరరామచంద్రపురం ఉక్కిరిబిక్కిరి: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎటపాక, వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు మండలాల్లో నాలుగు రోజులుగా వరద పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. వరరామచంద్రపురం వరద నీటితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కూనవరం, చింతూరు మండల కేంద్రాల్లో వరద నీరు పారుతోంది. ఎటపాక పోలీస్‌స్టేషన్‌ నీట మునిగింది. దాదాపు 40కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 12,694 కుటుంబాలను తరలించారు. కూనవరం మండలంలో ఒక డయాలసిస్‌ రోగిని అడవిమార్గంలో భద్రాచలం తరలించాల్సి వచ్చింది.

.
.

పోలవరం స్పిల్‌వే వద్ద 35 మీటర్లకు: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద వరద గురువారం సాయంత్రానికి 35 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల నుంచి 16.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది. జల వనరుల శాఖాధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో స్పిల్‌వే వద్ద 25 లక్షల క్యూసెక్కుల పైబడి ప్రవహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి స్పిల్‌వే వద్ద గంటకు 15 సెం.మీ. చొప్పున పెరుగుతూ వచ్చిన వరద సాయంత్రానికి మరింత పెరిగి 20 సెం.మీ. దాటింది.

.
.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.