ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని రైతులకు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ.. మహా పాదయాత్రకు అనుమతి

By

Published : Sep 10, 2022, 7:42 AM IST

Updated : Sep 10, 2022, 11:43 AM IST

వేలమందితో చేసే పాదయాత్రలకు లేని శాంతిభద్రతల విఘాతం... అమరావతి పాదయాత్రకే వస్తుందా అని హైకోర్టు రాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. 600 రైతులు చేసే పాదయాత్రకు కూడా బందోబస్తు కల్పించలేరా అని నిలదీసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఎలా కాందంటారంటూ ఆక్షేపించింది. సహేతుకమైన షరతులు విధించి.. రాజధాని రైతులకు రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ...మహాపాదయాత్రకు అనుమతించింది.

amaravati
amaravati


అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. రాజకీయ నేతల పాదయాత్రలకు అనుమతిచ్చి.. రైతులకు ఇవ్వలేమంటారా అని నిలదీసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసుస్టేషన్లలోనే కూర్చుంటామంటే కుదరదన్న న్యాయస్థానం...పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. పాదయాత్రకు అనుమతిస్తూ...రాజధాని రైతులకు రక్షణ కల్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

అమరావతి రైతులు నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ఈ నెల 8న డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవని హైకోర్టు తేల్చింది. సహేతుకమైన షరతులు విధించి యాత్రకు అనుమతి ఇవ్వాలని, పాదయాత్ర సజావుగా సాగేలా రక్షణ కల్పించాలని, శాంతిభద్రతలు సమస్యలు తలెత్తితే నియంత్రించాలని డీజీపీని ఆదేశించింది. వెయ్యి రోజులుగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించే హక్కు వారికి ఉంటుందని, ఆ హక్కు రాజ్యాంగం ప్రసాదించిందన్నారు. పాదయాత్రలో 600 మంది మాత్రమే రైతులు పాల్గొనాలని, వారికి సంఘీభావం తెలపడానికి వెళ్లేవారికి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. యాత్ర ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేపట్టాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయకుండా శాంతియుతంగా నిర్వహించాలని, డీజీపీ విధించిన షరతులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. వెంకటేశ్వరస్వామి విగ్రహాలు, భక్తిగీతాలు పాడుకునేందుకు మైక్‌ సెట్‌, ఎల్‌ఈడీ స్క్రీన్‌, బయోటాయిలెట్స్‌ ఉన్న వాహనాలను వెంట తీసుకెళ్లొచ్చని పేర్కొంది. యాత్ర ముగింపు రోజు బహిరంగ సభ నిర్వహణకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకునేలా పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. యాత్ర మధ్యలో ఎలాంటి బహిరంగ సమావేశాలు నిర్వహించవద్దని సూచించింది. పాదయాత్ర నిర్వహణ సందర్భంగా ఏమైనా ఉల్లంఘనలు జరిగితే చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చని, యాత్రకు అనుమతి రద్దు చేయాలని పోలీసులు భావిస్తే తగిన కారణాలతో కోర్టును ఆశ్రయించొచ్చని పేర్కొంది.

డీజీపీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.... రాజకీయ పార్టీలను పాదయాత్రలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నారన్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ... సంఘీభావం తెలపాలని కోరితే తప్పేముందన్నారు. ఒక వర్గం ఆకాంక్షలకు భిన్నంగా మరో వర్గం వ్యవహరిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని న్యాయవాది తెలపగా..... ఓ వర్గం ఆకాంక్షలకు భిన్నంగా మరో వర్గం ఎప్పుడూ ఉంటుందని, ఆ కారణం చెప్పి నిరసన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడం సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తుచేశారు. అలాగే యాత్రలో 600 మంది రైతులు పాల్గొనున్నారని... ఆ సంఖ్య ఎక్కువని డీజీపీ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి....‘భారత్‌ జోడో యాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే అనుమతిచ్చారు.. తమ సమస్యలపై దిల్లీలో వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే అనుమతులిచ్చారు.. అక్కడ శాంతిభద్రతలు నిర్వహించగలుగుతున్నారు. ఇక్కడ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు 30 వేల మందికి పైగా ఉన్నారు.. వారిలో కేవలం 600 మంది పాదయాత్రలో పాల్గొంటుంటే మీరు బందోబస్తు కల్పించలేరా’ అని నిలదీశారు.

amaravati

ఇవి చదవండి:

Last Updated : Sep 10, 2022, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details