ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telangana Inter Exams : 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. హాల్ టికెట్లపై కీలక నిర్ణయం

By

Published : Oct 21, 2021, 5:27 PM IST

తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy ) ప్రకటించారు. పరీక్షా కేంద్రాలను 1,750కి పెంచామన్న మంత్రి.. హాల్ టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) తెలిపారు. ఇంటర్ పరీక్షలపై జిల్లా విద్యాధికారులతో మంత్రి సబిత టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. గతేడాది ప్రమోట్ చేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 25 నుంచి మొదలు కానున్న పరీక్షలు.. నవంబరు 3 వరకు కొనసాగనున్నాయి.

మొత్తం 4.50 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని మంత్రి చెప్పారు. పరీక్షా కేంద్రాలను 1,750కి పెంచామని, 25 వేలమంది ఇన్విజిలేటర్లను నియమించామని మంత్రి తెలిపారు. గంట ముందుగా వచ్చినా.. పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యాలు సహకరించాలని సూచించారు.

ఇక, పరీక్షల హాల్ టికెట్లు నేటినుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. వెబ్ సైట్​లో అప్​లోడ్ చేశామని.. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. హాల్ టికెట్​లో వివరాలు తప్పు ఉంటే.. కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హాల్ టికెట్‌ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హాల్ టికెట్‌ పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా.. పరీక్షకు అనుమతి ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు.

కాగా.. ఇప్పుడు ఈ విద్యార్థులంతా సెకండియర్ చదువుతున్నారు. గతేడాది ప్రమోట్ చేసిన ఫస్టియర్ విద్యార్థులకు.. ఇప్పుడు పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సెకండియర్ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన సమయంలో.. మొదటి సంవత్సరం పరీక్షలకు చదవాల్సి రావడంతో అయోమయానికి గురవుతున్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details