ETV Bharat / city

Chandra babu: పార్టీని తుదముట్టించాలనే లక్ష్యంతో దాడులు: చంద్రబాబు

author img

By

Published : Oct 21, 2021, 11:07 AM IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​పై దాడిచేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదని.. కానీ ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామని స్పష్టం చేసారు. వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకోలేకపోతే పోలీస్‌ వ్యవస్థను మూసేయాలని డీజీపీకి హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిరసన చేపట్టారు.

Chandra babu
Chandra babu

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల దీక్ష చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబమని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ భవన్‌.. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమన్న బాబు.. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

‘‘విశాఖ, హిందూపురం, కడప పార్టీ కార్యాలయాలతోపాటు చాలా చోట్ల దాడులు జరిగాయి. తెదేపా కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. కార్యకర్తల మనోభావాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాడుల విషయంపై డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. నా ఫోన్‌ కాల్‌ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు. దాడుల గురించి వివరించేందుకు డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించరా? మనపైనే కాదు.. ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది. పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి చేశారు. పోలీసులు స్పందించకుంటే నాకేమైనా ఫరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలయ్యాయి. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు నమోదు చేస్తారా? పట్టాభి వాడిన పదజాలం తప్పు అన్నారు. జగన్‌, ఆయన మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా? విలువలతో కూడిన పార్టీ తెలుగుదేశం’’ - చంద్రబాబు

పోలీసు వ్యవస్థను మూసేయండి..
దాడిచేసిన వారిని పోలీసులు దగ్గరుండి సాగనంపడం సిగ్గుచేటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదన్న బాబు.. ఇవాళ రాష్ట్రపతి పాలన కోరుతున్నామని చెప్పారు. దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. ఎదురు కేసులు పెడతారా? అని నిలదీశారు. దాడిచేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీని ఏమనాలి? అని చంద్రబాబు ఆగ్రహం అన్నారు.

చేతగాకపోతే పోలీసు వ్యవస్థను మూసేయండని చంద్రబాబు దుయ్యబట్టారు.

స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంపై పోరాడాలనే..
'స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంపై పోరాడాలనే దీక్ష చేస్తున్నాను. మాస్కు అడిగాడని సుధాకర్‌ను పిచ్చోడిగా మార్చేశారు. రఘురామకృష్ణరాజును విచక్షణారహితంగా కొట్టారు. డ్రగ్స్‌ ఇదేమాదిరిగా వస్తే జాతి నిర్వీర్యమవుతుంది. పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే మాపైనే కేసులు పెడతారా?. భావితరాల కోసం ఆలోచిస్తే డ్రగ్స్‌ను పూర్తిగా నివారించాలి.'- చంద్రబాబు

పదవుల కోసం ఆలోచించవద్దని పోలీసులు, వైకాపా నాయకులను చంద్రబాబు కోరారు. పిల్లల భవిష్యత్తు, సమాజం కోసం ఆలోచించాలని హితవు పలికారు. చట్టం కొంతమంది చుట్టం కావడానికి వీల్లేదని..ఇప్పటికైనా మారాలని వైకాపా నాయకులను కోరారు.

ఇదీ చదవండి:

PATTABHI RAM : నేడు కోర్టుకు ముందుకు పట్టాభి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.