ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu Delhi tour: రాష్ట్రంలో పరిణామాలు, అరాచకాల అజెండాగా తెదేపా దిల్లీ పర్యటన

By

Published : Oct 23, 2021, 4:43 PM IST

Updated : Oct 23, 2021, 5:07 PM IST

మాదకద్రవ్యాలు, గంజాయి సాగు కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను దిల్లీ వేదికగా ఎండగట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు(Chandrababu delhi tour news). రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్​గా మారుతున్న పరిణామాలను రాష్ట్రపతితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించాలని నిర్ణయించారు. రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రోగిపోతున్నందున ఆర్టికల్ 356ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలనే అంశంపై రామ్​నాథ్ కొవింద్​కు అందజేసేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు.

Chandrababu Naidu Delhi tour on Monday
Chandrababu Naidu Delhi tour on Monday

ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై దిల్లీ పర్యటన అజెండాపై చర్చించారు(Chandrababu delhi tour news). సోమవారం మధ్యాహ్నం 12:30గంటలకు అయిదుగురు సభ్యులతో కూడిన బృందానికి రాష్ట్రపతి సమయం ఖరారైందనే విషయాన్ని నేతలు ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సమయం కోరడంతో... ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు దిల్లీలోనే పర్యటించాలని సమావేశంలో నేతలు చర్చించారు. చంద్రబాబుతో పాటు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు, మరో 14మంది ముఖ్యనేతలు కలిసి మొత్తం 18మంది రెండు రోజుల దిల్లీ పర్యటనలో పాల్గొనాలని సమావేశంలో నిర్ణయించారు. పర్యటన వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్​కు అప్పగించారు.

పార్టీ నేతలకు, కార్యాలయానికి కేంద్ర బలగాల సాయం కోరదామా అనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర పరిణామాలు, అరాచకాల అజెండాగానే దిల్లీ పర్యటన సాగాలని, మనల్ని మనమే కాపాడుకునేలా చర్యలు తీసుకుందామని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్టీఆర్ భవన్ వేదికగా చంద్రబాబు చేపట్టిన 36గంటల దీక్ష విజయవంతమైందనే అభిప్రాయాన్ని సమావేశంలో నేతలు వ్యక్తం చేశారు. కార్యకర్తల్లో కసి పెరిగిందన్నారు.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు: పయ్యావుల కేశవ్

పయ్యావుల కేశవ్, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి వైకాపా అనుబంధ విభాగంలా మార్చేశారని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు(payyavula keshav fires on ycp govt news). చంద్రబాబుతో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ "వ్యవస్థలపై జరుగుతున్న దాడులు, అరాచక విధానాలు, అప్రజాస్వామిక చర్యలు, ఆర్థిక పతనంపై రాష్ట్రపతికి నివేదిక ఇస్తాం. ఎన్టీఆర్ భవన్​పై దాడికి సంబంధించి సీబీఐ విచారణ జరపాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ని కోరటంతో పాటు అవసరమైతే న్యాయవ్యవస్థ తలుపు తడతాం. దాడికి సంబంధించి అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేసు నమోదు చేయడానికి పోలీసులు భయపడుతున్నారు. అక్రమ వ్యాపారాలు, దందాలపై ఎలుగెత్తే నోళ్లు మూయించేందుకు పోలీసు వ్యవస్థని వాడుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా మేం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సంఘటనలూ బయటికి తీస్తాం" అని హెచ్చరించారు. తెదేపా గుర్తింపు రద్దు చేయాలనే డిమాండ్​పై వైకాపా నేతలు సైతం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు కేశవ్ స్పందిస్తూ.. "దిల్లీ కాకపోతే వారికి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రపంచంలోని అతి చిన్నదేశానికి వెళ్లి ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు" అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి

YCP Vs TDP: రాష్ట్రంలో హైవోల్టెజ్ రాజకీయం.. తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్షం

Last Updated : Oct 23, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details