ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ యాప్​ ఇన్​స్టాల్ చేసుకోండి.. మీ బస్ ఎక్కడుందో తెలుసుకోండి..!

By

Published : Jul 27, 2022, 1:02 PM IST

RTC Bus Tracking System: ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్​ఆర్టీసీ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగా.. బ‌స్సు ట్రాకింగ్ వ్యవ‌స్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో ప్రవేశపెట్టగా.. దశలవారీగా అన్నింటిలోనూ ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు.

RTC Bus Tracking System
RTC Bus Tracking System

RTC Bus Tracking System: ఆర్టీసీ బస్సు ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? ఇది తెలియక బస్సు కోసం వేచిచూస్తూ చాలా సమయం వృథా అవుతోంది. ఇందుకు పరిష్కార మార్గాన్ని చూపింది టీఎస్‌ఆర్టీసీ. బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా ట్రాకింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా 96 డిపోలు ఉన్నాయి. ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు. వీటిలో కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులు ఉన్నాయి. వీటిని శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిప్పనున్నట్లు యాజమాన్యం తెలిపింది. మియాపూర్‌-1 డిపోకు చెందిన మిగితా 100 బస్సులను సుదూర ప్రాంతాల‌కు తిప్పుతారు. క్రమక్రమంగా రాష్ట్రంలోని అన్ని బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

బస్ ట్రాకింగ్ యాప్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బస్‌భవన్‌లో ప్రారంభించారు. 'టీఎస్​ఆర్టీసీ బస్సు ట్రాకింగ్ పేరు'తో గూగుల్ ప్లే స్టోర్‌లో మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ప్రయాణికులు బస్టాప్‌లు, బస్‌స్టేషన్‌లలో నిరీక్షించడాన్ని నివారించవచ్చని సజ్జనార్‌ తెలిపారు. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం వంటి మార్గాల్లో నిర్వహిస్తున్న పికెట్ డిపోలో ప్రస్తుతం ట్రాకింగ్‌ న‌డుస్తుంద‌ని తెలిపారు. మరో రెండు నెలల్లో జిల్లాల‌తో పాటు హైదరాబాద్‌లో అన్ని రిజర్వేషన్లు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్‌లో చేర్చనున్నట్లు వెల్లడించారు.

ఈ యాప్‌లో హైదరాబాద్ సిటీ, డిస్ట్రిక్‌ సర్వీస్‌లలో వేర్వేరుగా బస్సుల ట్రాకింగ్ చేసే సదుపాయం ఉంది. జిల్లాలోని గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల సేవలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుత లొకేషన్, సమీప బస్‌స్టాప్‌ను వీక్షించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్టీసీ నుంచి మహిళా హెల్ప్‌లైన్, బస్సుల బ్రేక్‌డౌన్‌లతో పాటు..ప్రమాదాలు వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవ‌డానికి ఈ యాప్ దోహ‌ద‌ప‌డుతుంది. ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని, యాప్‌లో మరిన్ని మెరుగుదల కోసం విలువైన సూచనలను అందించాలని ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్ ప్రవర్తన, బస్సు పరిస్థితి , డ్రైవింగ్‌పై అభిప్రాయాన్ని అందించ‌వ‌చ్చని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్ www.tsrtc.telangana.gov.in లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details