ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కీలక సవరణల కోసం తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం

By

Published : Oct 12, 2020, 9:30 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా వివిధ చట్టాల సవరణ కోసం తెలంగాణ శాసనసభ రేపు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికల దృష్ట్యా జీహెచ్ఎంసీ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ సవరణలు చేస్తోంది. ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి జవాబుదారీతనంగా పనిచేసేలా నిబంధనలు కఠినతరం చేయనున్నారు. అధికారుల విచాక్షణాధికారాలు తొలగిస్తూ... స్టాంపులు-రిజిస్ట్రేషన్ల, నాలా చట్టాలు కూడా సవరించనున్నారు.

కీలక సవరణల కోసం తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం
కీలక సవరణల కోసం తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం

వివిధ చట్టాల సవరణ కోసం మంగళవారం తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇటీవల సెషన్స్​ ప్రోరోగ్ కాకపోవడం వల్ల కొనసాగింపుగానే ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11.40 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో... ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఈ మేరకు బులెటిన్ జారీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో... అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమావేశం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు కొనసాగిస్తూ... శానిటైజేషన్ చేయించాలని కార్యదర్శి నర్సింహాచార్యులును సభాపతులు ఆదేశించారు.

చట్ట సవరణలు..!

చట్టాల సవరణలకు సంబంధించిన బిల్లులను తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి కీలక సవరణలు చేయనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్నందున కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి జవాబుదారీతనంతో బాధ్యతలు పొందుపర్చేలా చట్టంలో నిబంధనలు చేర్చనున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించేలా కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత, పదిశాతం హరిత బడ్జెట్, వార్డు కమిటీల ఏర్పాటు-పనివిధానంలో మార్పులు, సమీకృత టౌన్​షిప్​ల అభివృద్ధి, రెండు దఫాలుగా ఒకే రిజర్వేషన్ సహా పలు అంశాలను చేరుస్తూ జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలను ప్రతిపాదించనున్నారు.

జీహెచ్ఎంసీ చట్టంతో పాటు ఇతర చట్టాలకు కూడా ప్రభుత్వం సవరణలు చేయనుంది. భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా... ధరణి ద్వారానే ఆన్​లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించనున్నారు. వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు చేయనున్నారు. హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించి కూడా సీఆర్పీసీ చట్టాన్ని సవరించనున్నారు. ఈ చట్టసవరణ బిల్లులపై శాసనసభలో చర్చించి ఆమోదిస్తారు. దీని కోసం బుధవారం తెలంగాణ శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది.

ఇదీ చూడండి:కరోనా నిబంధనలతో.. శాసనసభ, మండలి సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details