ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిప్యూటీ స్పీకర్‌ రఘురామపై ఫిర్యాదు - కేసు నమోదులో నిబంధనలు పాటించాలన్న హైకోర్టు

రఘురామకృష్ణరాజు నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని హైకోర్టులో మాదల శ్రీనివాసు పిటిషన్ - నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్న ధర్మాసనం

AP HC on Raghurama Threat Allegs
డిప్యూటీ స్పీకర్‌ రఘురామపై ఫిర్యాదు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 25, 2026 at 11:41 AM IST

AP HC on Raghurama Threat Allegs : శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని, 2 ప్లస్‌ 2 పోలీసు భద్రత కల్పించేలా ఆదేశించాలని కోరుతూ పారిశ్రామికవేత్త అగతా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌/ డైరెక్టర్‌ మాదల శ్రీనివాసు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. శ్రీనివాసు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే విషయంలో చట్ట నిబంధనలు పాటించాలని సూచించింది.

కాగ్నిజిబుల్‌ నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.

రఘురామకృష్ణరాజు పంపినట్లుగా చెబుతున్న కొంతమంది వ్యక్తులు గుంటూరులోని తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని మాదల శ్రీనివాసు పిటిషన్​లో తెలిపారు. అంతేకాక తనను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని చెప్పారు. ఈ ఘటనపై ఈ ఏడాది జులై 31న ఫిర్యాదు చేసినప్పటికీ గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు, ఆయన కుటుంబ సభ్యుల ఆధీనంలో తమిళనాడులో ఉన్న 189 మెగావాట్ల ఇండ్‌-భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ లిమిటెడ్‌ సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉండగా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా ప్రక్రియ ఎదుర్కొందని వివరించారు. వేలం ప్రక్రియలో తాను ఛైర్మన్‌గా ఉన్న అగతా ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.101.42 కోట్లకు దక్కించుకుందని వివరించారు.

AP HC on Madala Srinivasu Petition :దివాలా నిబంధనల ప్రకారం లభించిన డీడ్‌ ద్వారా ఇండ్‌-భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌ పూర్వ యజమానుల నుంచి సొమ్ము వసూలు చేసుకునేందుకు చట్టపరంగా తనకు హక్కులు లభించాయని మాదల శ్రీనివాస్ తెలిపారు. కంపెనీకి చెందిన ఫైళ్లు అప్పగించాలని, ఎన్‌సీఎల్‌టీ వద్ద పెండింగ్‌లో ఉన్న రికవరీ అప్పీళ్లను వెనక్కి తీసుకోవాలని తన అనుచరులతో రఘురామ బెదిరిస్తున్నారని శ్రీనివాసు పేర్కొన్నారు.

ఏడాదిగా అదృశ్యమైన చిన్నారుల వివరాలివ్వండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

పర్యావరణం, సహజ వనరుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే : హైకోర్టు