చైనాలో ప్రేమ తమిళనాడులో వివాహం- రష్యా యువతిని పెళ్లాడిన చెన్నై యువకుడు
తిరుచెందూర్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం- చైనాలో సహోద్యోగులుగా పరిచయం- ప్రేమగా మారిన స్నేహం- 'కీర్తన'గా పేరు మార్చుకున్న రష్యా యువతి
Published : September 1, 2026 at 11:16 AM IST
Chennai Man Marries Russian :తమిళనాడు చెన్నైకి చెందిన యువకుడు, రష్యా యువతి హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. చైనాలోని ఓ కార్ల తయారీ సంస్థలో సహోద్యోగులుగా పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం, క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ జంట తిరుచెందూర్ మురుగన్ స్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన 25కి పైగా వివాహాల్లో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చైనాలో పరిచయం ప్రేమగా మారి
తమిళనాడులోని చెన్నై మైలాపూర్‌కు చెందిన ఉదయశంకర్ చైనాలోని ఓ కార్ల తయారీ సంస్థలో పనిచేస్తున్నాడు. అదే సంస్థలో రష్యాకు చెందిన మారియా కూడా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహంగా మొదలైన వారి పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహానికి ఏర్పాట్లు చేశారు. తమిళనాడులోని ప్రసిద్ధ తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వివాహం జరిపించాలని నిర్ణయించారు.
హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం
కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో తిరుచెందూర్ ఆలయం ముందు ఉన్న షణ్ముగవిలాస మండపంలో ఉదయశంకర్, మారియా వివాహం జరిగింది. హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మారియా తన పేరును 'కీర్తన'గా మార్చుకున్నారు. తమిళనాడుకు చెందిన యువకుడు, రష్యాకు చెందిన యువతి సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం ఆలయానికి వచ్చిన భక్తుల దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రత్యేక వివాహాన్ని ఆసక్తిగా తిలకించిన భక్తులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రశంసలు
ఈ జంట వివాహానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. సముద్రాలు దాటి ప్రేమలో పడిన ఈ జంట, కుటుంబాల అంగీకారంతో ఒక్కటవడంపై నెటిజన్లు అభినందనలు తెలిపారు. రష్యాకు చెందిన మారియా తన పేరును మార్చుకుని, తిరుచెందూర్ మురుగన్ స్వామి సాక్షిగా హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడాన్ని పలువురు ప్రశంసించారు.
కేరళ మహిళను పెళ్లాడిన స్కాటిష్ ఎంపీ
ఇదే విధంగా కేరళలోని ఎర్నాకుళం జిల్లా పాంబక్కుడకు చెందిన నితిన్ చంద్ కూడా స్కాట్లాండ్‌కు చెందిన మార్టిన్ డేను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితిన్‌కు గతంలో వివాహమై, ఓ కుమారుడు జన్మించాడు. అయితే కొన్ని కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె, ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసేందుకు యూకే వెళ్లారు. ఆ సమయంలో బ్రిటన్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలను మార్చడంతో నితిన్ వీసా రద్దయింది. ఈ సమస్యపై పార్లమెంటరీ కమిటీల ముందు తన వాదన వినిపించే క్రమంలో అప్పటి బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడైన మార్టిన్ డేతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
2016 ఫిబ్రవరిలో వీరి పరిచయం మరింత బలపడింది. రెండు నెలల తర్వాత మార్టిన్ తన ప్రేమను నితిన్‌కు వ్యక్తం చేశారు. అనంతరం తనతో కలిసి జీవితాన్ని ప్రారంభించాలని కోరారు. అయితే తాను విడాకులు తీసుకున్నానని, 12 ఏళ్ల కుమారుడికి తల్లినని నితిన్ చెప్పారు. అయినప్పటికీ అది తనకు అడ్డుకాదని మార్టిన్ అన్నారు. ఆమెను మనస్ఫూర్తిగా అంగీకరించి జీవిత భాగస్వామిగా స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. దీంతో వీరిద్దరూ గురువాయూర్‌లో వివాహం చేసుకోవాని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే నితిన్ మలయాళీ సంప్రదాయ దుస్తుల్లో, మార్టిన్ స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భిన్న దేశాలు, సంస్కృతులకు చెందిన ఇద్దరు ప్రేమతో ఒక్కటైన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కేరళ మహిళను పెళ్లాడిన స్కాటిష్ ఎంపీ- గురువాయూర్ ఆలయంలో ఒక్కటైన జంట
ఒక్కరోజే 437పెళ్లిళ్లు- ఆ ఆలయంలో ఇదే ఆల్‌టైమ్ రికార్డ్- మళ్లీ మళ్లీ ఇది రాని రోజు!