ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగన్వాడీలపై పోలీసుల ఉక్కుపాదం - ఎక్కడికక్కడ అరెస్టులు, ఉద్రిక్తత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 3:25 PM IST

Updated : Jan 22, 2024, 4:24 PM IST

Police Arrested Anganwadi Workers: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేశారు.

Police_Arrested_Anganwadi_Workers
Police_Arrested_Anganwadi_Workers

అంగన్వాడీలపై పోలీసుల ఉక్కుపాదం- ఎక్కడికక్కడ అరెస్టులు

Police Arrested Anganwadi Workers:న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. 42రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తుందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి నుంచి అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు గాంధీవిగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. 'చలో విజయవాడ' కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.

అంగన్వాడీల అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనం: లోకేశ్

వివిధ జిల్లాలకు చెందిన పలువురు అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా బస్సుల్లో తీసుకొచ్చి ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో నిర్బంధించారు. అర్ధరాత్రి దీక్ష భగ్నం చేసి బలవంతంగా తరలించారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం 216 జాతీయ రహదారిపై అంగన్వాడీలను చేబ్రోలు పోలీసులు అడ్డుకున్నారు. 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతులు లేవంటూ అంగన్వాడీ కార్యకర్తలను స్టేషన్‌కు తరలించారు.

విజయవాడ నగరంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టిన అంగన్వాడీలను నగర పోలీసులు అదుపులోకి తీసుకొని ఆరు బస్సులలో నూజివీడు సారథి కళాశాలకు తరలించారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయడం దారుణమని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం - స్పష్టం చేసిన అంగన్వాడీలు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను మార్గమధ్యలో పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి, అవనిగడ్డ అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను స్టేషన్లకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావును ఆదివారం రాత్రి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అనంతపురంలో ఓ అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. 42 రోజులుగా అంగన్వాడీలు రోడ్డుపై సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని బాధితురాలు సరిత ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, గ్రాట్యూటీ తదితర సమస్యలు పరిష్కరించకపోగా విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.

డిమాండ్ల సాధన కోసం విశ్రమించని అంగన్వాడీలు - మొద్దు నిద్రను నటిస్తున్న ప్రభుత్వం

గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాజా టోల్గేట్, తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే అన్ని మార్గాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. కాజా టోల్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్న 120 మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గుంటూరులోని పోలీస్ కల్యాణ మండపానికి తరలించారు.

ముఖ్యమంత్రి నివాస సమీపంలో ఆందోళన చేసేందుకు వచ్చిన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరు వచ్చినా అరెస్టులు తప్పవని జిల్లా ఎస్పీ అరిఫ్‌ హఫీజ్‌ హెచ్చరించారు.

అంగన్వాడీ కార్మికులకు మద్దతుగా ఈనెల 24వ తేదిన అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు టీఎన్టీయూసి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామ రాజు తెలిపారు. 'జగన్ ప్రభుత్వం- కార్మిక సమస్యలు' అనే అంశంపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై నేతలు చర్చించారు.

న్యాయపరమైన డిమాండ్లలను కోరుతున్నామే తప్పా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : అంగన్వాడీలు

ఈనెల 24వ తేదిన అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు టీఎన్​టీయూసీ (TNTUC) నేతలు తెలిపారు. ఈ బంద్​కు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్స్ ఆందోళనలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీతాల కోసం ఆందోళలను చేస్తున్నారంటే వైఎస్సార్సీపీ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకొచ్చని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఇసుకను నిలిపివేసి భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. ఉపాధి లేక అనేక మంది నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు.

తాము అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే 1,000 రుపాయలు అదనంగా జీతం పెంచుతామని హమీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హమీని అమలు చేయమని అడుగుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తుంటే వారిని అరెస్టులు చేస్తున్నారని, ఇదేక్కడి న్యాయమని అన్నారు.

విధులకు హాజరు కాని అంగన్వాడీ కార్మికులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలను ఇంటికి పంపాలని చూస్తే అంగన్వాడీలే జగన్​ను ఇంటికి పంపిస్తారని పేర్కొన్నారు. కార్మిక సమస్యలపై ట్రేడ్ యూనియన్లు ఇస్తున్న బంద్​కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు.

Last Updated : Jan 22, 2024, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details