ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 9:11 PM IST

Gummanur Jayaram criticized CM Jagan: వైఎస్సార్సీపీని వీడిన మంత్రి గుమ్మనూరు జయరాం మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’ వేదికగా టీడీపీలో చేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి గుమ్మనూరును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు.

Gummanur Jayaram
Gummanur Jayaram

Gummanur Jayaram Criticized CM Jagan: గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జయహో బీసీ సభలో పాల్గొన్న ఆయనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ (CM Jagan) నిర్ణయాలతో పొసగలేక జయరాం కొద్దిరోజులుగా వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటున్నారు.

పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది: జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram ) టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు ఆయనను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జయరాం చేరికను పవన్ కల్యాణ్ స్వాగతించారు. టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని గుమ్మనూరు జయరాం తెలిపారు. గతంలో తెలుగుదేశంలో పని చేశానని, మళ్లీ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. బడుగులకు స్వతంత్రం రావాలని ఆకాంక్షించారు. బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పని చేస్తుందన్నారు. టిక్కెట్లు బడుగులకిచ్చి, అగ్ర కులాలకు ఇన్ఛార్జీలిస్తే స్వతంత్రం ఉంటుందా అని ప్రశ్నించారు.

'బీసీ కార్పొరేషన్లకు కుర్చీలు లేవు - ఖర్చు పెట్టడానికి నిధులు లేవు '

వైఎస్సార్సీపీ పెద్దలపై ఆరోపణలు: పార్టీ మారనున్న నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశం పెట్టిన మంత్రి గుమ్మనూరు జయరాం, తాను వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తాను టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. అన్నట్లుగానే జయహో బీసీ సభలో చంద్రబాబును కలిసిన గుమ్మనూరు, తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరే ముందు ఆయన సీఎం జగన్‌ విధానాలపై విమర్శలు గుప్పించారు.

జగన్​ను రాష్ట్రం నుంచి పంపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు: అచ్చెన్నాయుడు

గుంతకల్లు నుంచి పోటీ చేస్తా :సీఎం జగన్ తనను కర్నూలు ఎంపీ (MP) అభ్యర్థిగా పోటీ చేయాలని అడిగారని గుమ్మనూరు తెలిపారు. అయితే తనకు అది ఇష్టం లేదని, టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారని గుమ్మనూరు విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే సీఎం జనగ్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ (YSRCP) లో బీసీలకు న్యాయం జరగడం లేదని, ఒక సామాజికవర్గానికే కొమ్ముకాస్తున్నారని గుమ్మనూరు జయరాం తెలిపారు. పవర్ లేని పదవులు ఇచ్చి ఏం ఉపయోగమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి కూడా ఆలూరును అభివృద్ధి చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎక్కడా జరగలేదని, ముస్లింలు, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2019 లో మంత్రి పదవి వచ్చాక 2022వరకు జగన్ ను అల్లా, జీసస్ గా చూశానని, 2022తర్వాత సీఎం జగన్ శిల్పంలా మారారన్నారు.

వైఎస్సార్సీపీకి మరో షాక్​, మంత్రి గుమ్మనూరు రాజీనామా - "జగన్ గుడిలో విగ్రహం లాంటివారు!"

బర్తరఫ్​: రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మనూరు జయరాంను బర్తరఫ్​ చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సిఫార్సు మేరకు తక్షణమే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం, ముఖ్యమంత్రి జగన్ సిఫార్సుల మేరకు గుమ్మనూరు జయరాం ను కేబినెట్ నుంచి మంత్రిగా తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈమేరకు గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ మద్యాహ్నం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం హుటాహుటిన ఆయన్ను బర్తరఫ్ చేయాల్సిందిగా గవర్నర్ కు లేఖ పంపింది.

ABOUT THE AUTHOR

...view details