ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వతంత్రులకు జనసేన గాజు గ్లాసు గుర్తు - వైఎస్సార్సీపీ కుట్ర అంటున్న ప్రతిపక్షాలు - janasena glass symbol

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 7:30 AM IST

Janasena Glass Symbol: జనసేన పోటీలో లేనిచోట గాజుగ్లాసును ఫ్రీ సింబల్స్‌లో జాబితాలో పెట్టి, స్వతంత్రులకు కేటాయించడంపై కూటమిలోని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓట్లు చీల్చేందుకు వైఎస్సార్సీపీయే ఈ కుట్రకు తెర తీసిందని ఆరోపించాయి. కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నచోటే స్వతంత్రులకు గ్లాసు గుర్తును కేటాయించారని మండిపడ్డాయి.

Janasena_Glass_Symbol
Janasena_Glass_Symbol

స్వతంత్రులకు జనసేన గాజు గ్లాసు గుర్తు - వైఎస్సార్సీపీ కుట్రకు తెర లేపిందంటున్న ప్రతిపక్షాలు

Janasena Glass Symbol: జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. తెలుగుదేశం, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది.

ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైఎస్సార్సీపీయే ఈ కుట్రకు తెర లేపిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా, వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్‌ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈమె మొరసన్నపల్లి వైఎస్సార్సీపీ సర్పంచ్‌ జగదీష్‌ భార్య. జగదీష్‌ వైఎస్సార్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు.

వైఎస్సార్సీపీకి ఓటమి ఖాయం - కూటమిదే అధికారం : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Election campaign

తెలుగుదేశానికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఆమదాలవలస, విశాఖపట్నం తూర్పు, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. 2019లో చీరాలలోనూ తెలుగుదేశం విజయం సాధించింది. ఇప్పుడు అక్కడా స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

విజయనగరం శాసనసభ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు, జగ్గంపేట నుంచి జనసేన రెబల్‌ అభ్యర్థిగా ఉన్న పి.సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈ రెండుచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు బలంగా ఉన్నారు. పెదకూరపాడులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి నంబూరు శంకరరావు తనయుడు కల్యాణచక్రవర్తి స్వతంత్రునిగా నామినేషన్‌ వేయగా, ఆయనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

వైఎస్సార్సీపీ పాలనలో అరాచక రాజ్యంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుకు, చంద్రగిరి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు. తెలుగుదేశం బలంగా ఉన్న రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్‌కు, పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్‌ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాసు గుర్తును అధికారులు కేటాయించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు రాజోలి వీరనారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులే ఆయనతో నామినేషన్‌ వేయించి గాజు గ్లాసు గుర్తును పొందినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. మైదుకూరులో ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున పోటీచేస్తున్న పి.ఆనందరావు వైఎస్సార్సీపీలో కీలక నేత. ఈయనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న పెంచలయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

ఈయన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్‌కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా షాజహాన్‌ బాషా ఉండగా, అదే పేరుతో స్వతంత్ర అభ్యర్థి రంగంలోకి దిగారు. ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, గుంటూరు, బాపట్ల, విజయవాడ తదితర లోక్‌సభ సీట్లలో పోటీచేస్తున్న పలువురు స్వతంత్ర అభ్యర్థులకు సైతం గాజు గ్లాసు గుర్తు కేటాయించారు.

జనసేనకు గ్లాసు సింబల్‌ కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు - Janasena Glass Symbol

ABOUT THE AUTHOR

...view details