High Court on Fee Reimbursement Issue :ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్ వాగ్దేవి కాలేజీల్లో ఎంబీఏ చేస్తున్న బి.వాసంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. ఎస్సీ వర్గానికి చెందిన పిటిషనర్ 10వ తరగతి వరకు తెలంగాణలో, ఇంటర్ & డిగ్రీ ఏపీలో చదివారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు.
ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అటెండర్‌గా పనిచేస్తున్న పిటిషనర్ తల్లి రాష్ట్ర విభజన(State Division) సమయంలో తెలంగాణలో ఖాళీలు లేక ఏపీకి వెళ్లారన్నారు. దీంతో పిటిషనర్ అక్కడే ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారన్నారు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతుండగా తల్లి మృతి చెందడంతో తిరిగి తెలంగాణలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఎంబీయేలో చేరారన్నారు. ఏపీలో డిగ్రీ పూర్తి చేసిన కారణంగా ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని, అంతేకాకుండా పరీక్ష ఫీజు కూడా తీసుకోవడంలేదన్నారు.
దుర్గం చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి : హైకోర్టు
వాదనలను విన్న న్యాయమూర్తి విద్యార్థిని నుంచి పరీక్ష ఫీజు తీసుకొని పరీక్షలకు అనుమతించాలని కాలేజీకి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో డిగ్రీ చదివిందన్న కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించకపోవడంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ(Social Welfare Department) ముఖ్యకార్యదర్శులు, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, వాగ్దేవి కాలేజీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
HC on Consumer Forum :మరో కేసులో హైదరాబాద్‌లోని మూడు జిల్లాల వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను పక్కనపెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్‌ఛార్జి అధ్యక్షురాలు ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో హైదరాబాదద్‌లోని జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చని, అయితే అది పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది.