ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్సీపీకి వంత పాడేలా జవహర్‌రెడ్డి జగన్నాటకం - బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం - CS Jawahar Reddy Plan on Pensions

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 6:57 AM IST

CS Jawahar Reddy plan on AP Pension Distribution Through Bank Accounts: రాష్ట్రంలో పింఛన్ పంపిణీ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల పింఛన్లను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్కారు దారుణమైన నిర్ణయాన్ని సీఎస్ జవహర్ రెడ్డి అమలు చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP_Pension_Distribution_Through_Bank_Accounts
AP_Pension_Distribution_Through_Bank_Accounts

CS Jawahar Reddy plan onAP Pension Distribution Through Bank Accounts:ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలు చేసినా అంతిమంగా వైఎస్సార్సీపీకి మేలు చేయడమే లక్ష్యం. ఇది పింఛను పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆడుతున్న 'జగన్నా​'టకం. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ ఆయన అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 1న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు.

అయినా మే 1నపింఛను పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి ఠారెత్తిస్తున్న పరిస్థితుల్లో ఇది వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా అని సీఎస్‌ను ప్రజలు నిలదీస్తున్నారు. అయినా వారిని ఇళ్ల నుంచి బయటకు రప్పించేలా నిర్ణయం తీసుకోవడమేంటని అడుగుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేము మహాప్రభో ఇంటి దగ్గరే ఇవ్వాలని పింఛనుదారులు వేడుకుంటుంటే గతనెల కంటే మరిన్ని ఇక్కట్లకు గురి చేసే నిర్ణయాన్ని తీసుకుని వైఎస్సార్సీపీ సేవలో తరించేందుకే ఆయన మొగ్గు చూపారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడేశారు. ఈ కుతంత్రం అమలుకు తెరముందు జవహర్‌రెడ్డి కనిపిస్తున్నా వెనుక నుంచి నడిపిస్తున్నదంతా సీఎం జగన్‌, ధనుంజయరెడ్డిలే. పింఛనుదారులకు ఇబ్బంది లేకుండా నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

బ్యాంకుల ద్వారా పింఛన్ పంపిణీ- ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు - Aasara Pension through banks

తగినంత మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పంపిణీ చేయడానికి ఉన్న ఇబ్బందేమిటి? నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఇతర పథకాలు వేరు, పింఛన్ల పంపిణీ వేరు. గత ఐదేళ్లుగా పింఛనుదారుల ఇళ్ల వద్దనే నగదు అందిస్తూ వారికి అలవాటు చేశారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ విధానంలో ఏ మాత్రం మార్పులు చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయం సీఎస్‌కు తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది వైఎస్సార్సీపీకు వంతపాడటమే అవుతుంది. పింఛనుదారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని టీడీపీపై వేసే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకే పింఛను అందించవచ్చని కలెక్టర్లందరూ ముక్తకంఠంతో చెప్పారు. అయినా అలా పంపిణీ చేయడానికి మాత్రం మనసు రావట్లేదు. మీరు ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాల్సిన ఐఏఎస్‌ అధికారి కదా మరి ఎందుకు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని సీఎస్‌ జవహర్‌ రెడ్డిని పింఛనుదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా రెండు, మూడు రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా ఇలాంటి వికృత నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 8,047 బ్యాంకులున్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛను పంపిణీ కోసమే ఉండరు. చాలామంది పింఛనుదారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ లేకుండా మైనస్‌లోకి వెళ్లినవి కూడా ఎక్కువగానే ఉంటాయి. పింఛను డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పటినుంచో ఉన్న పెండింగ్‌ ఛార్జీలన్నీ వాటిలోంచే కోత వేస్తారు. పైగా పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లినరోజే నగదు ఇవ్వకుండా గంటల తరబడి వేచి ఉన్న తర్వాత మర్నాడో, ఆ మర్నాడో రమ్మని తిప్పుతారు. 2019లో టీడీపీ ప్రభుత్వం పసుపు-కుంకుమ కింద బ్యాంకుల్లో నగదు జమ చేసినప్పుడు క్యూలైన్లలో మహిళలు నిల్చుని ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్ధిదారులందరికీ గుర్తుండే ఉంటుంది.

వృద్ధులను అటూ ఇటూ తిప్పడమే:మొత్తం 65.95 లక్షల మంది పింఛనుదారుల్లో 34 లక్షల మంది వృద్ధులే. ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేనివారు లక్షల్లోనే ఉంటారు. ఇలాంటి వృద్ధులందరూ మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. ఒక్కొక్కరు రూ.200-400 రవాణా ఖర్చు భరించాలి. తిండి ఖర్చు అదనం. అక్కడికి వెళ్లిన తర్వాత విత్‌డ్రా ఫాం రాయడమూ ఒక ఇబ్బందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్‌ సేవాకేంద్రాల నుంచి నగదు తీసుకోడానికి వేలిముద్రలు వేయాలి. చాలామంది వృద్ధులకు వేలిముద్రలు పడవు. అప్పుడు అక్కడి నుంచి మండల కేంద్రానికో, బ్యాంకు ఉన్న ఇంకోచోటుకో వెళ్లాలి. ఒకరకంగా చూస్తే ఇదంతా వారిలో ఆందోళన నింపే ప్రయత్నమే అవుతుంది.

ఈసీ ఆదేశాలు అంటే సీఎస్​కు లెక్కలేదా? - పింఛన్ల పంపిణీపై చర్యలేవి? - AP CS NOT FOLLOWING EC ORDERS

గత నెల కంటే మరింత నరకయాతన:బ్యాంకుల్లో నగదు జమచేస్తే ఆధార్‌ కార్డు లింక్‌ అయిన బ్యాంకుకే నగదు వెళ్తుంది. కొందరికి రెండు, మూడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. ఏ ఖాతాకు ఆధార్‌ లింక్‌ అయిందో చాలామందికి తెలియదు. ఎందులో డబ్బు జమవుతుందో అర్థం కాదు. కొందరు ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న ఖాతాల నుంచి లావాదేవీలు జరపరు. దీనివల్ల ఆ ఖాతాలు మనుగడలో ఉండవు. ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ అయిందనే వివరాలు సచివాలయాలకు పంపుతామని చెప్పారు. అంటే మళ్లీ దీనికోసం వారు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాల్సిందే. అది తెలుసుకున్న తర్వాత బ్యాంకులకు వెళ్లాలి. ఇప్పటికే ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించి నానాకష్టాలకు గురిచేశారు. ఇప్పుడు సచివాలయానికి, ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లేలా దారుణమైన నిర్ణయం తీసుకుని, పింఛనుదారులను మరింత నరకయాతన పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సచివాలయ ఉద్యోగులకు 2-3 రోజులే:రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేమీ లేవు. ఉన్న ఏకైక పని లబ్ధిదారులకు పింఛన్లు అందించడమే. అందుబాటులో కావలసినంత మానవ వనరులున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందే 1.35 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సిన పింఛన్లు 49 మాత్రమే. ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి పట్టే సమయం మహా అయితే 2-3 రోజులు. ఇంత సాధారణమైన లెక్కను ఐదో తరగతి పిల్లలు కూడా చేసేస్తారు. ఇలాంటి మామూలు విషయం అత్యంత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జవహర్‌రెడ్డికి తెలియకుండా ఉండదని, తెలిసినా ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

వైఎస్సార్సీపీ శ్రేణుల అఘాయిత్యాలకు ఊతమివ్వడమే:అత్యంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సీఎస్‌ ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా ఎలా వ్యవహరిస్తారని పలువురు నిలదీస్తున్నారు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా, వృద్ధుల్ని మండుటెండలో ఊరేగించిన వైఎస్సార్సీపీ నాయకుల్లో ఒక్కరిపైనా ఆయన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు బ్యాంకుల వద్ద పింఛనుదారుల్ని పడిగాపులు కాసేలా నిర్ణయం తీసుకోవడం వారికి మరింత ఊతమివ్వడమే అవుతుంది. పోలింగ్‌ తేదీ అత్యంత సమీపంలో ఉండగా వారు చెలరేగిపోతే దానికి బాధ్యులెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి.

సర్వాధికారాలు సీఎస్‌ వద్దే కదా:ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే సర్వాధికారి. ఎన్నికల కమిషన్‌ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చెప్పిందే తప్ప, ఇంటింటికీ పంపిణీ చేయొద్దని చెప్పలేదు. బ్యాంకుల్లో నగదు జమచేస్తే ఎదురయ్యే ఇబ్బందులేంటనేది ప్రభుత్వాధిపతిగా ఆయన సులభంగా గుర్తించగలరు. ఇన్నాళ్లూ ఆయనకంటే జూనియర్‌ అయిన ధనుంజయరెడ్డి చెప్పిందే వేదంగా పాటిస్తూ వచ్చారు. కొన్ని లక్షల మంది అభాగ్యుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న పింఛన్ల పంపిణీ వ్యవహారంలోనైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ ప్రయోజనాలు ఆయనను వెనక్కు లాగుతున్నాయోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details