ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎంకు దగ్గరోడు దోపిడీల్లో తగ్గనోడు - సొంత పార్టీ నేతలూ అతని బాధితులే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 7:17 AM IST

CM Jagan Family Member Irregularities in YSR District: అక్రమాలయందు వైసీపీ మార్క్‌ అక్రమాలే వేరయా అనేలా ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. అలాంటిది పాలన పగ్గాలు తన రక్త సంబంధీకుడి చేతుల్లోనే ఉంటే ఇక ఆయన దోపిడీలకు అడ్డుతగిలేదెవరు. వైఎస్సార్​ జిల్లాలో ప్రభుత్వ స్థలాలైనా ప్రైవేటు భూములైనా ఆయన కన్ను పడితే కబ్జానే. పరిశ్రమల యజమానులు కప్పం చెల్లించుకోవాల్సిందే కాంట్రాక్టుల్లో వాటాలు ఇచ్చి తీరాల్సిందే కాదూ కూడదూ అంటే వారి భూములను నిషేధిత జాబితాలో పెట్టిస్తూ పంచాయితీలు చేస్తూ రూపాయి పెట్టుబడి లేకుండా వందల కోట్లు వెనకేసుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే సొంత పార్టీ నేతలూ ఆయన బాధితులుగా మారుతున్నారు.

ycp_leaders_irregularities
ycp_leaders_irregularities

సీఎంకు దగ్గరోడు దోపిడీల్లో తగ్గనోడు - సొంత పార్టీ నేతలూ అతని బాధితులే

CM Jagan Family Member Irregularities in YSR District:వైఎస్సార్ జిల్లాను తమకు రాసిచ్చామనుకున్నారో లేక అది తమ సొంతమనుకున్నారో కానీ అక్కడి వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము ఎంత చేస్తే అంత అడిగే వారూ ఎదురు చెప్పేవారూ లేరనే ధీమాతో పాల్పడని అక్రమాలు లేవు చేయని కబ్జా లేదు. కడప సమీపాన ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే తాతముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిగా, దగ్గరి బంధువైన పెద్దల అండతో జిల్లాలో దందా సాగిస్తున్నారు. ఆయన కబ్జా చేసిన భూములే వేల కోట్ల విలువ చేస్తాయంటారు. ఆక్రమించిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే స్థిరాస్తి వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు.

చిన్నాచితకా పనులైనా సరే వాళ్లే చేయాలి. కార్యకర్తల్నీ దగ్గరకు రానివ్వరు. సర్వారాయ ప్రాజెక్టుపై సర్వహక్కులూ తమవే అన్నట్లుగా ఆ నీటిని ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ చేపల పెంపకం సాగిస్తున్నారు. ఏదైనా భూమిపై ఆయన కన్నుపడితే ఇక అంతే దానికి వివాదాలు సృష్టించి మరీ పంచాయితీ నిర్వహిస్తారు. ఆ పేరిట భారీగా ముడుపులు తీసుకుంటారు. వైసీపీ నేతలే ఆ ప్రజాప్రతినిధికి భయపడి పార్టీని వీడుతున్నారంటే ఆయన అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వేలకోట్ల భుములు కబ్జా:

  • బినామీ పేర్లతో కడప నగరంలో బుద్ధా టౌన్‌షిప్‌ పేరిట అనధికారిక వెంచర్లును ఆ ప్రజాప్రతినిధి వేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకుని దందా సాగించారు.
  • కడప నగర శివారులో ఓ విద్యాసంస్థకు ఇచ్చిన 200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. తన అనుచరుడ్ని బినామీగా పెట్టి అందులో సెంటు 13లక్షల చొప్పున విక్రయించారు. ఇలా మొత్తం 400 కోట్లకు పైగా దోచుకున్నారు.
  • సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు.
  • వల్లూరు మండలం గోటూరు వద్ద 100 కోట్ల విలువైన పీర్లమాణ్యం భూములతో పాటు కడప నగరంలోని మామిళ్లపల్లె రెవెన్యూ సర్వే నంబరు 39, 60లో సుమారు 130 కోట్లు విలువ చేసే 18 ఎకరాలను కబ్జా చేశారు.
  • వల్లూరు రెవెన్యూ కార్యాలయం సమీపంలో 7 కోట్లు విలువ చేసే భూములు, కడప నగరంలోని జయరాజ్‌ గార్డెన్‌ వద్ద పేదలను బెదిరించి 130 కోట్ల విలువ చేసే 18 ఎకరాలను ఆ ప్రజాప్రతినిధి స్వాహా చేశారు.
  • పెండ్లిమర్రి మండలం పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో బినామీల పేర్లతో 200 ఎకరాలను ఆక్రమించారు. బుగ్గవంకను చెరబట్టి అందులో సినిమా హాలు నిర్మించారు. కడప, కమలాపురంలో చుక్కల భూముల పేరిట రైతుల్ని వేధించి కబ్జా చేసేస్తున్నారు.

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

కొడుకు పేరుతో భుములకు ఎసరు: ఆ ప్రజాప్రతినిధి తన కుమారుడి పేరిట సత్యసాయి జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములకు ఎసరు పెట్టారు. తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసేందుకు యత్నించగా ఈ తతంగం వెలుగులోకి రావడంతో మిన్నకుండిపోయారు. వల్లూరు మండలం గోటూరు వంతెన వద్ద 9 ఎకరాల వక్ఫ్‌ భూమిని తమ పార్టీకి చెందిన ఎంపీ బంధువుకు విక్రయించే ప్రయత్నం చేయగా రిజిస్ట్రేషన్‌ సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. అయినా ఆ ప్రజాప్రతినిధి మాత్రం తాను తీసుకున్న 2కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వలేదు. కడపలోని మెడికల్‌ కళాశాల వద్ద మైనార్టీ భూములను ఆయన పేరిట అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకుని టౌన్‌షిప్‌ పేరిట లేఅవుట్‌ వేశారు.

ఏదైనా భూమిపై తన కన్ను పడిందంటే ముందు వాటిని 22A నిషేధిత జాబితాలో పెట్టించడం ఆ ప్రజాప్రతినిధి ఎత్తుగడ. ఆ తర్వాత రెవెన్యూ అధికారుల్ని అడ్డంపెట్టుకుని కథ నడిపిస్తారు. పంచాయితీ పేరుతో వాటిని తనకు విక్రయించాలని నిబంధన పెడతారు. అసలు విలువలో 20 శాతానికి ఎక్కువకాకుండా ధర నిర్ణయించి సంతకాలు పెట్టించుకుంటారు. ఇటీవల జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. సీకేదిన్నె మండలం పబ్బాపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు 9 కోట్ల విలువైన పొలాలున్నాయి. వాటిపై కన్నేసిన ప్రజాప్రతినిధి కావాలనే వివాదాలు సృష్టించారు. ఆ భూమి తనదేనంటూ మరో వ్యక్తితో నకిలీ పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేశారు.

ఒప్పుకోకుంటే నిషేధిత జాబితాకి: సమస్య పరిష్కారం కావాలంటే పొలాన్ని తనకు అమ్మేయడమే మార్గమనే పరిస్థితి కల్పించారు. అదే మండలం తాడిగొట్ల వద్ద 600 ఎకరాలపై కన్నేసి వాటిని తనకే అమ్మాలంటూ యజమానుల్ని బెదిరించారు. వారు ససేమిరా అనడంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని 22A జాబితాలో పెట్టించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లెలోనూ భూముల్ని కాజేయడానికి మంత్రాంగం నడిపారు. ఆయనకు భూములమ్మినా సొమ్ము రాబట్టుకోవడం అంత సులభం కాదు. మొదట అడ్వాన్స్‌ ఇచ్చి అగ్రిమెంట్‌ రాయించుకుని భూముల్ని స్వాధీనం చేసుకుంటారు. మళ్లీ వాటిని ఇతరులకు విక్రయించే వరకు తాను కొన్న వారికి డబ్బివ్వకుండా తిప్పుకుంటారు. సొంతపార్టీలోనే ఇలాంటి బాధితులున్నారు.

'అందిన కాడికి దోచుకో పుష్పా' ఇది మన జగనన్న ప్రభుత్వం

జెండా ఎత్తేస్తున్న పారిశ్రామికవేత్తలు: కొప్పర్తి పారిశ్రామికవాడ అంతా సవ్యంగా జరిగితే ఇప్పటికే అక్కడ పదివేల మందికి ఉద్యోగాలొచ్చేవి. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేవి. అయితే ప్రజాప్రతినిధి వసూళ్ల ధాటికి పనులు చేయాలంటేనే గుత్తేదారులు వణికిపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 730 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపట్టగా 10 శాతం చొప్పున గుత్తేదారుల నుంచి పిండేశారు. ఎన్నికలు వస్తున్నాయంటూ ఇటీవల కమీషన్‌ను 15 శాతానికి పెంచేశారు. ఆయనకు వాటాలిచ్చుకోలేక చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు రకరకాల కారణాలు చూపిస్తూ అక్కడి నుంచి జెండా ఎత్తేస్తున్నారు. దీంతో అంతా మాదే అన్నట్లు, మండలస్థాయి ప్రజాప్రతినిధి అయిన ఆయన కుమారుడే అక్కడ గుత్తేదారు అవతారం ఎత్తారు. కొప్పర్తికి బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు నీటిని తీసుకురావడానికి 150 కోట్లతో చేపట్టిన తాగునీటి పైపులైన్ల పనుల్లోనూ కమీషన్లు దండుకున్నారు.

ఏపనిలోనైనా ముందే కమీషన్:

  • నియోజకవర్గంలో జరిగే ఏ పనిలోనైనా ఆ ప్రజాప్రతినిధికి ముందే కమీషన్‌ సమర్పించుకోవాలి. కమలాపురంలో పెద్ద పుత్తా గ్రామం మీదుగా కడప-పులివెందుల రహదారిని కలిపేలా 15 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో 10 శాతం కమీషన్‌ పుచ్చుకున్నారని తెలుస్తోంది.
  • అలంఖాన్‌పల్లి-ఎయిర్‌పోర్టు రోడ్డు, చీపల్లి-వీరపునాయునిపల్లె రహదారి పనుల్లోనూ చేతివాటం చూపారు.
  • 450 కోట్లతో చేపట్టిన గాలేరు- నగరి ప్రాజెక్టు పనుల్లోనూ వసూళ్లకు తెగబడ్డారు.
  • కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై చేపట్టిన వంతెన పనుల్లోనూ 50 లక్షలు తీసుకున్నట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
  • పనులను నాసిరకంగా చేపట్టడంతో సర్వారాయ సాగర్‌ ప్రాజెక్టు కింద నీటి లీకేజీతో పంట పొలాలు నాశనమయ్యాయి. ఆ నీరు తన చేపల చెరువులకు, భారతి సిమెంట్‌ కంపెనీకి మాత్రమే ఉపయోగపడుతోంది.

జగనన్న ఇళ్ల స్థలాలపై వైసీపీ డేగల కన్ను- పేదరికాన్ని సొమ్ము చేసుకుంటున్న దళారులు

విభేదాలు వస్తే హత్యే: ఈ ప్రజాప్రతినిధి వేధింపుల్ని తట్టుకోలేక కమలాపురం పురపాలక కౌన్సిలర్‌ ప్రమీల, ఆమె భర్త నరేంద్ర ఇటీవల టీడీపీలో చేరారు. ఆమె రాజీనామా చేసినట్లు ఫోర్జరీ సంతకం చేయించి మరీ ఆమోదింపజేశారు. బినామీ పేర్లతో ఆ ప్రజాప్రతినిధి వేసిన వెంచర్లలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిపై రుణాలు కూడా పొందే అవకాశం లేకపోయింది. అనుమతులు లేకపోవడమే దీనికి కారణం. వాటాల్లో తలెత్తిన విభేదాలతో వైసీపీ కార్యకర్త ఒకరు కడప నగరంలో పట్టపగలే హత్యకు గురవ్వడం సంచలనం కలిగించింది. నియోజకవర్గ పరిధిలోని ఓ కౌన్సిలర్‌ టీడీపీలో చేరగా ఆమె గెలుపునకు 20 లక్షలు ఖర్చయిందనీ, ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని ఆ ప్రజాప్రతినిధి డిమాండ్‌ చేశారు. ఆమె భర్తపై తప్పుడు హత్య కేసు బనాయించి నెలరోజుల పాటు జైల్లో పెట్టించారు. కల్తీ ఎరువుల విక్రయాలు, భూదందాలు, నగదు లావాదేవీల్లో మోసాలపై కడప, చెన్నూరు, హైదరాబాద్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో ఆయనపై మూడు 420 కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details