ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎసైన్డ్‌ భూములు కొల్లగొట్టి - కోట్లకు పడగలెత్తి - assigned lands purchase

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 10:03 AM IST

Irregularities in assigned lands purchase: పేదల ఎసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తామని సీఎం జగన్ ఆశ చూపారు.! ఉత్తర్వులు వస్తాయని ఎదురుచూస్తుండగానే, అన్న అనుచరులు చక్రం తిప్పారు. కోట్ల విలువైన స్థలాలపై గద్దల్లా వాలిపోయి అధికారంతో భయపెట్టి కారుచౌకగా సొంతం చేసుకున్నారు. పేద రైతుల నోట్లో మట్టికొట్టి వారి ఆశల్ని తుంచేశారు. మరికొన్నింటిని దర్జాగా ఆక్రమించుకున్నారు.

Etv Bharat
Etv Bharat

ఎసైన్డ్‌ భూములు కొల్లగొట్టి - కోట్లకు పడగలెత్తి

Irregularities in assigned lands purchase:రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఎసైన్డ్‌ భూములు పొందిన వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని వైసీపీ సర్కారు ప్రకటించింది. దీంతో, పేద రైతుల నుంచి ఎసైన్డ్‌ స్థలాలు కాజేసేందుకు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే పెద్దలు పెద్ద స్కెచ్చే వేశారు. సాగు కోసం 20 ఏళ్ల క్రితం అందజేసిన భూముల క్రయవిక్రయాలకు అవకాశం కల్పిస్తూ సర్కార్‌ చట్ట సవరణ చేసింది. ఇది జరుగుతుందనే సమాచారం ఆ పెద్దలకు ముందే లీక్‌ అయింది. యాజమాన్య హక్కులు కల్పించేందుకు వీలుగా కలెక్టర్లు డీ-నోటిఫికేషన్‌ ఇచ్చిందే తడవుగా వైసీపీ నేతలు పేద రైతుల వద్ద గద్దల్లా వాలిపోయారు. విలువైన ఆ స్థలాలను ఇతరులకు విక్రయిస్తారని వారిని బెదిరించి చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. డి-నోటిఫికేషన్‌ వెలువడగానే జబర్దస్తీ చేసి స్థలాలను బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పేదలకు 29లక్షల 62వేల 303.19 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని పంపిణీ చేశారు. ఇందులో 15లక్షల 92వేల 713.80 ఎకరాలకు సంబంధించి అసలు అనుభవదారులు గానీ, వారసులు గానీ క్షేత్రస్థాయిలో లేరు. ఈ 15 లక్షల ఎకరాల స్థలాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. మరోవైపు 2003కు ముందు పంపిణీ చేసిన 9లక్షల 94వేల 073.41 లక్షల ఎకరాలకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. 2003 తర్వాత పంపిణీ చేసిన 3లక్షల 58వేల 926.47 ఎకరాల్లో అనుభవదారులు ఉన్నట్లు తేలింది. మరో 16వేల589.51 ఎకరాలకు సంబంధించిన పరిశీలన జరుగుతోంది. అయితే, వీటిలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని ఎసైన్డ్‌ భూములు 70శాతం వరకు చేతులు మారినట్లు అంచనా.

ఉత్తరాంధ్రలో డి-పట్టా భూముల కొనుగోళ్ల కుంభకోణం భారీగా జరిగింది. పరిపాలనా రాజధాని అంటూ విశాఖ, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని డి-పట్టాలపై కన్నేశారు. భూములు ఇవ్వకుంటే మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించబోవని, విమానాశ్రయం, రాజధాని వంటి అవసరాల కోసం ప్రభుత్వ భూములను తీసుకుంటే పరిహారం రాదని, అమాయక పేద రైతులను మభ్యపెట్టారు. తమకు స్థలాలు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎలాగోలా వారిని దారికి తెచ్చుకుని ఎంతోకొంత ముట్టజెప్పి బలవంతపు ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా విశాఖ పరిధిలోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, విజయనగరం జిల్లా భోగాపురం, శ్రీకాకుళం పరిధిలో వందల ఎకరాల డి-పట్టాల భూములు చేతులు మారాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు, తీరప్రాంతానికి సమీపంలో ఎకరానికి 5 నుంచి 10 కోట్ల వరకు పలికే రైతుల భూములను ఎకరాకు గరిష్టంగా 40 నుంచి 50 లక్షల వరకు ఇచ్చి సొంతం చేసుకున్నారు.
రైతులకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో మైనింగ్‌ తవ్వకాలు

ఆనందపురం మండలం కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక తదితర గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల భూములను ఇటీవల విశాఖ జిల్లా కలెక్టర్‌ డీనోటిఫై చేశారు. ఆ భూములు రైతుల నుంచి వేరొకరి చేతులు మారుతున్నాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం మండలాల పరిధిలో డీనోటిఫై చేసిన భూముల రిజిస్ట్రేషన్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. డీనోటిఫైలో జాప్యం చేశారన్న కారణంతో విశాఖ జిల్లాలో పనిచేసిన ఓ ఐఏఎస్‌ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఏకంగా 300 ఎకరాల వరకు డి-ఫారం పట్టా భూములు ఉత్తరాంధ్ర పరిధిలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయా భూములను నిషేధిత భూముల జాబితా నుంచి మినహాయించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన ఓ నేత ఆనందపురం మండలంలో పదెకరాల వరకు కొనుగోలు చేశారు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో అవి నేత పేరున బదిలీ అయ్యాయి. భీమిలి పరిధిలోనూ ఓ అధికార పార్టీ నేత, రైతులకు ఎకరాకు 10 లక్షల చొప్పున చెల్లించి కోట్ల విలువైన 49 ఎకరాల డి-పట్టా భూములను దక్కించుకున్నట్లు తెలిసింది. తాడేపల్లిలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు బినామీ పేర్లపై వందల ఎకరాలు హస్తగతం చేసుకున్నారు. ఈ భూముల విలువ కోట్లలో ఉంటే రైతులకు మాత్రం లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. అనంతపురం, అనంతపురం గ్రామీణ, రాప్తాడు, కూడేరు మండలాల్లోని భూములు ఎకరాకు కోటి నుంచి 5 కోట్ల వరకు పలుకుతున్నాయి.

దీంతో వైసీపీనాయకులు, ఎసైన్డ్‌ రైతులకు తక్కువ మొత్తంలో చెల్లిస్తూ వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్‌ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి అక్రమాలే చోటుచేసుకున్నాయి.
Amaravati Assigned Lands Case: రాజధాని ఎసైన్డ్‌ భూముల వ్యవహారం జీవో 41పై హైకోర్టు విచారణ

హక్కుల కల్పన’కు సంబంధించి ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి భూ రికార్డుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు ప్రతి గ్రామం నుంచి, ఎసైన్డ్‌ భూములు ఎంత విస్తీర్ణంలో, ఎప్పుడు పంపిణీ అయ్యాయి, ఆ స్థలాలు అనుభవదారులు, వారసుల ఆధీనంలోనే ఉన్నాయా? ఇతరులు అనుభవిస్తున్నారా? తదితర వివరాలు సేకరించింది. కొన్నిచోట్ల ఈ భూములు ఆక్రమణకు గురయ్యాయని, పరాధీనంలో ఉన్నాయని తేలింది. మరికొన్ని గ్రామాల్లో భూముల పంపిణీ వివరాలు రిజిష్టర్లలో నమోదే కాలేదు. కొన్ని మండలాల్లో రికార్డులే గల్లంతయ్యాయి. ఇంకొన్ని గ్రామాల్లో స్థలాలను అనుభవిస్తున్నా, ప్రభుత్వం ఇచ్చిన పత్రాలు వారి వద్ద లేవు. ఇలా, పలురకాల పొరపాట్లు చోటుచేసుకుని, రికార్డులు కనిపించని, అస్తవ్యస్తంగా మారిన భూముల వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఇలాంటి పొరపాట్లు, వివరాలు అస్తవ్యస్తంగా ఉండటం వైసీపీ నేతలు, వారి అనుచరులకు వరంగా మారాయి.

ఎసైన్డ్‌ భూములు పొందిన వారిలో ఎస్సీలే కాకుండా ఎస్టీలు, బీసీలు, కొందరు ఓసీలు కూడా ఉన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ప్రకారం.. ఎసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైతే వాటిని స్వాధీనపరచుకుని తిరిగి పేదలకు గానీ, వారసులకు గానీ అప్పగించాలి. అమ్మకానికి పెట్టిన, రుణాలను చెల్లించలేనప్పుడు వేలానికి పెట్టిన పేదల భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వాటిని భూమిలేని దళితులు, పేదలకు ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది.

తేలాల్సిన ఎసైన్డ్‌ భూముల లెక్కలు - మభ్యపెట్టి బుట్టలో వేసుకున్న వైసీపీ నేతలు

ABOUT THE AUTHOR

...view details