ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

'ఎన్నికల కోడ్ ఎఫెక్ట్' - ఐదేళ్లుగా ఊరించి హడావుడిగా ప్రారంభిస్తున్న వైసీపీ నేతలు

Election Code Fear in YSRCP Leaders : ఇంకా పనులే పూర్తి కాలేదు. కనీస మౌలిక సదుపాయాలు సమకూరలేదు. అయితే ఏం? కోడ్ కూస్తుంది ప్రారంభించేయ్! ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధికార పార్టీ నేతల తీరిది. ఇన్నాళ్లూ తీరికగా ఊరుకుని ఇప్పుడు ఎన్నికల కోడ్ వస్తుందని పనులు పూర్తి కాని భవనాలను ప్రారంభిస్తున్నారు వైఎస్సార్సీపీ నేతలు. దీనిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

election_code_fear_in_ysrcp_leaders
election_code_fear_in_ysrcp_leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 7:29 PM IST

Election Code Fear in YSRCP Leaders : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఆనసభద్రలో ఏకలవ్య పాఠశాలను ఫిబ్రవరి 14న గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభించారు. ఇక్కడ పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. మంచినీటి సౌకర్యం లేదు. రోడ్లు, రక్షణ గోడలు పూర్తి కాలేదు. కానీ, రంగులేసి ప్రారంభోత్సవం చేశారు. కురుపాం మండలం శివన్నపేటలో రూ.12 కోట్లతో చేపట్టిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (Ekalavya Model Residential School)ను ఉపముఖ్యమంత్రి రాజన్నదొర, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఈ నెల 5న ప్రారంభించారు. ఇందులో తాగునీటి సదుపాయం లేదు. రక్షణ గోడ, పైఅంతస్తు స్లాబు పనులూ పూర్తి కాలేదు. ఈ పాఠశాల విద్యార్ధులు పార్వతీపురంలోని కొత్త బెలగాంలోన గిరిజన పాఠశాల ఆవరణలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుల వ్యవహారంపై స్థానికులు మండిపడుతున్నారు.

పేదల ఇళ్లపై పగబట్టిన జగన్‌ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం

ఇల్లంటే పేదల కలల స్వప్నం. ప్రభుత్వం సకల వసతులు కల్పిస్తుంది. హాయిగా జీవించవచ్చని ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఊరుకుని ఎన్నికల సమయంలో ఇంటి తాళం చేతిలో పెట్టి ఓటు పొందాలనే ఆలోచనలో ఉంది. మన్యం జిల్లా సాలూరు టిడ్కో గృహాల పంపిణీ ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది. సాలూరులో టిడ్కో గృహాలను 1048 మంది లబ్ధిదారులకు గత నెల 20న అందజేశారు. నీరు, విద్యుత్తు, రోడ్లు, కాలువ సౌకర్యాలు లేవు. రోడ్లు నిర్మాణానికి నెల కిందట ఎర్త్ వర్క్ చేసేందుకు యంత్రాలతో గోతులు తవ్వారు. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేసినా ఇళ్లకు మీటర్లు అమర్చలేదు. తాగునీరు అందించే నీటి పథకం, పైపులైన్ పనులు 50శాతం కూడా చేయలేదు. ఇవన్నీ సమకూర్చకుండనే టిడ్కో (Tidco) గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లు పొందిన లబ్ధిదారులు సమస్యల మధ్య సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

'వామ్మో టిడ్కో ఇళ్లా? మాకొద్దు' - సీఆర్​డీఏ నోటీసులతో ఉలిక్కిపడుతున్న లబ్ధిదారులు

విజయనగరం నగరపాలక సంస్థ (Vizianagaram Municipal Corporation) పరిధిలోని సోనియానగర్, సారిపల్లిలోనూ మౌలిక సదుపాయల పనులు పూర్తి కాకుండానే లబ్ధిదారులకు టిడ్కో గృహాల తాళాలు, రిజిస్టేషన్ పత్రాలు అందజేశారు. సోనియానగర్ లో ఆదివారం 21బ్లాకుల్లో 672 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక్కడ రోడ్లు, కాలువలు, విద్యుత్తు సౌకర్యం లేకుండానే రిజిస్ర్టేషన్ పత్రాలిచ్చేశారు. మొత్తం 35 బ్లాకుల్లో 1120 ఇళ్ల నిర్మాణం జరిగింది. గత నెలలో 448 మందికి కేటాయించారు. ఇప్పుడు మిగిలిన వారికి ఇచ్చారు. ప్రస్తుతం విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. విద్యుద్దీకరణ పనులకు రూ.4.17కోట్లు కేటాయించారు. నేటికీ ఉప కేంద్రం నిర్మాణం పూర్తి కాలేదు. స్థలం కేటాయించి వదిలేశారు. 35 విద్యుత్తు నియంత్రికలకు గాను 12 మాత్రమే అమర్చారు. ప్రధాన రహదారి పనులూ ఇక్కడ పూర్తి కాలేదు. ఇక సారిపల్లి 1024 మందికి టిడ్కో గృహాలు ఇచ్చారు. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం 19.54కోట్ల నిధులు కేటాయించారు. ఇక్కడ ఇంకా రోడ్లు పూర్త్తిస్థాయిలో వేయలేదు. ప్రధాన, ఇతర లింకు రహదారులను 2.35 కిలోమీటర్ల పరిధిలో వేయాల్సి ఉండగా కిలోమీటరు మేర పనులు జరిగాయి. గృహ సముదాయానికి వెళ్లే మార్గం ఎత్తుగా ఉండటంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ కల్పించాలి.

దశాబ్దాలుగా... అసంపూర్తిగా..!

పట్టణ పేదలకు సొంత గూడు కల్పించేందుకు టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సకల వసతులతో ఇళ్లు అప్పగిస్తామని చెప్పింది. కానీ, మౌలిక సదుపాయాలు మాత్రం పూర్తిస్థాయిలో కల్పించలేదు. అయినా, ఎన్నికలు రానున్న దృష్ట్యా ఆ పార్టీ నేతలు హడావుడిగా పంపిణీ చేస్తుండటం విడ్డూరం. కనీసం ప్రతిపాదించిన పనులైనా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

టిడ్కో ఇళ్లపై హద్దుల్లేని మడమ తిప్పడాలు- మూడేళ్లుగా అదిగో ఇదిగో అంటూ ప్రగల్భాలు

ABOUT THE AUTHOR

...view details