ETV Bharat / state

దశాబ్దాలుగా... అసంపూర్తిగా..!

author img

By

Published : Feb 28, 2021, 3:56 PM IST

ఆ నిర్మాణాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. కొన్ని పనుల మినహా అంతా పూర్తైంది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాల్సింది పోయి గాలికొదిలేసింది. ప్రభుత్వం తీరుతో కోట్లు వెచ్చించిన నిర్మాణాలు ఉపయోగించకుండానే శిథిలావస్థకు చేరే పరిస్థితి దాపురించింది.

govt buildoing
దశాబ్దాలుగా... అసంపూర్తిగా...

ఒక ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన నిర్మాణ పనులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. దీంతో గుంటూరు నగరపాలికలో పలు ప్రజోపయోగ భవనాల పనులు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కావడం లేదు. మొండి గోడలను తలపిస్తున్నాయి. ఆ భవనాలు పూర్తికాక.. వినియోగంలోకి రాక వాటి కోసం ఇప్పటికే వెచ్చించిన రూ.కోట్ల నిధులకు సార్థకత లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..

* ఒక ఏడాది కాదు.. దశాబ్దం కాదు.. ఏకంగా 15 ఏళ్ల నుంచి బృందావన్‌ గార్డెన్స్‌లో చేపట్టిన నార్ల ఆడిటోరియం భవనం ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు. అది అసంపూర్తిగానే ఉంది. వర్షాలకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ ఆ భవనం నామరూపాలను కోల్పోతున్నా పాలకులకు పట్టడం లేదు.

* పాత గుంటూరులో బీఆర్‌ స్టేడియం ఎదురుగా ప్రారంభించిన రెడ్‌ ట్యాంక్‌ భవనాలు, ఆటోనగర్‌లో రక్షిత మంచి నీటి పథకం ట్యాంకు పనులు పూర్తి కాలేదు. వీటికి వెచ్చింపులు రూ.కోట్లలోనే ఉంటాయని నగరపాలక వర్గాల సమాచారం. త్వరలో ఏర్పడబోయే నూతన కౌన్సిల్‌ అయినా ఈ నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకుని ఆ భవనాలు ప్రజోపయోగ కార్యకలాపాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

రెడ్‌ ట్యాంకు భవనాలు.. బస్టాండ్‌ నుంచి బీఆర్‌ స్టేడియం మీదుగా జీటీ రోడ్‌లోకి వచ్చే ప్రధాన రహదారి పక్కనే రెడ్‌ట్యాంకు ప్రాంగణంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ పూలు, పండ్ల వ్యాపారులకు ఉపయోగపడేలా షాపింగ్‌ కాంప్లెక్సుతో పాటు మరో రెండు వాణిజ్య సముదాయాలు నిర్మించాలని 15 ఏళ్ల క్రితమే పనులు ప్రారంభించారు. ఈ భవనాలు గ్రౌండ్‌ఫ్లోర్‌ పూర్తి చేసుకున్నాయి. మరో భవనం మొదటి అంతస్తు నిర్మాణదశలో ఆగిపోయింది. ఇది బస్టాండ్‌కు సమీపంగా ఉండడంతో వాణిజ్య సముదాయాలు నిర్మించి అద్దెలకు ఇస్తే నగరపాలికకు ఆదాయం బాగా వస్తుందని అప్పట్లో నగరపాలక అధికారులు, నాటి స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచించి దాని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ఆ భవనాలు పూర్తి కాలేదు. ఈ అసంపూర్తి భవనాల ఆలన, పాలన పట్టించుకునేవారు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భవనాన్ని పూర్తి చేస్తే అనేక మంది పండ్ల, పూల వ్యాపారులు దీనిలో షాపులు తీసుకుని శాశ్వతంగా అక్కడ వ్యాపారాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో సంబంధిత వ్యాపారులు రోడ్ల వెంబడి ఆయా విక్రయాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారు. దీనికి సుమారు రూ. అరకోటికి పైగా వెచ్చించి నిర్మాణాలు అందుబాటులోకి తీసుకురాకుండా వదిలేయడంతో దానిపై విజిలెన్స్‌ నివేదికలు ప్రభుత్వానికి వెళ్లాయి.

నార్లఆడిటోరియం.. నగరంలో అత్యంత రద్దీగా ఉండే గార్డెన్స్‌ ప్రాంతంలో 2000లో దీని నిర్మాణ పనులకు ప్రతిపాదనలు రూపుదిద్దుకోగా ఆ తర్వాత పునాదిరాయి పడింది. నగరంలో వినోదంగా గడపడానికి ఎక్కడా ఆడిటోరియం లేదని అప్పట్లో నగర కౌన్సిల్‌ దాని నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆ ఆడిటోరియంలో కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి నగర ప్రజలకు వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో అప్పటి మేయర్‌ కొల్లి శారద దాని నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. తెదేపా తరఫున మేయర్‌గా పని చేసిన ఆమె హయాంలో పునాదులు పడిన ఈ భవనాన్ని పూర్తి చేయడానికి ఆ తర్వాత వచ్చిన వారు చర్యలు తీసుకోలేదు. దీనికి సుమారు రూ.70లక్షలు వ్యయం చేశారు. ఈ భవనం అసంపూర్తిగా ఉండడంపై మూడేళ్ల క్రితం విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదిక పంపారు. పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి దాన్ని పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అందులో పేర్కొన్నారు. ఆ నిర్మాణం అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు సాయంత్రం వేళ ఆటవిడుపుగా గడపడానికి ప్రయోజనకరంగా ఉంటుందని నగరపాలక వర్గాలు చెబుతున్నాయి. ఈ భవనాన్ని ప్రస్తుతం వినియోగంలోకి తీసుకురావడానికి ఇటీవల రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి నగరపాలిక అధికారులతో సమీక్షించారు.

అసంపూర్తిగా ట్యాంకులు.. ఆటోనగర్‌ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేవారికి.. కార్మికులకు తాగునీటి వసతి కల్పించటానికి, ఆయా పరిశ్రమల నీటి అవసరాలను తీర్చటానికి వీలుగా రక్షిత మంచినీటి పథకం పనులకు శ్రీకారం చుట్టి పుష్కరకాలం అయింది. ట్యాంకులు నిర్మించారు. అవి అనాలోచితంగా చేపట్టడంతో వాటిల్లోకి పైపుల నుంచి నీళ్లు ఎక్కడం లేదు. ఈ కారణంగా ఆ పనులు అసంపూర్తిగా నిలిచాయి. పనులకు రూ.లక్షలు వెచ్చించినా తమకు నీటి సౌకర్యం సమకూరలేదని, అవస్థలు పడుతున్నామని ఆటోనగర్‌ వాసులు చెబుతున్నారు. ఈ అసంపూర్తి నిర్మాణాలపై విజిలెన్స్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

ఇదీ చదవండి: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.