ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడపలో రసవత్తరంగా ఫ్యామిలీ పాలిటిక్స్ - ప్రచార హోరెత్తిస్తున్న వైఎస్ కుటుంబ సభ్యులు - YSR Family Campaign in Kadapa

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 7:54 AM IST

YSR Family Election Campaign in Kadapa: కడప గడ్డలో వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్​తో రాజకీయం వేడెక్కుతోంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో అదే కుటుంబానికి చెందిన ఇద్దరు బరిలో దిగటంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండుగా విడిపోయిన వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

YSR_Family_Election_Campaign_in_Kadapa
YSR_Family_Election_Campaign_in_Kadapa

కడపలో రసవత్తరంగా ఫ్యామిలీ పాలిటిక్స్

YSR Family Election Campaign in Kadapa:కడపలో రాజకీయం రసవత్తరంగా మారింది. రెండుగా విడిపోయిన వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఎవరికి వారే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను వైఎస్సార్సీపీకి వచ్చేలా కృషి చేసిన బ్రదర్ అనిల్ కుమార్ ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లను ప్రభావితం చేసేలా చర్చిల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భార్య షర్మిలకు మద్దతుగా నిలిచేందుకు పాస్టర్లతో భేటీ అవుతున్నారు. సునీత కూడా షర్మిలకు ఓట్లు వేయాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా సీఎం జగన్‌ సతీమణి భారతి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు.

మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమారుడు సీఎం జగన్, కుమార్తె షర్మిల రెండు వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నారు. తన తండ్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదని, అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత రంగంలోకి దిగారు. న్యాయం, ధర్మం నినాదంతో ఎన్నికల్లో తలపడటానికి వారిద్దరూ సిద్ధమయ్యారు.

పాపాలు చేసే వారిని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేస్తే సరిపోదు: బ్రదర్ అనిల్ - Brother Anil Kumar key comments

కడప ఎంపీ స్థానానికి షర్మిల కాంగ్రెస్‌ పార్టీ నుంచి తలపడుతుండగా వైఎస్సార్సీపీ నుంచి సీఎం జగన్‌ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని రంగంలోకి దింపారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని షర్మిల తన అన్న జగన్‌తో పాటు అవినాష్‌రెడ్డిని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన ఆమె పీసీసీ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రచారం పూర్తికాగానే మే నెల 1న తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్‌ పూర్తయ్యేవరకు ఇక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఊరూవాడా ప్రచారం చేస్తుండగా, తాజాగా షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ శనివారం నుంచి రంగంలోకి దిగారు.

క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరుతెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైఎస్సార్సీపీకి మద్దతుగా క్రిస్లియన్లను కూడగట్టే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఇప్పుడు ఆయనే వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్‌ ఓటర్లను ప్రభావితం చేసేలా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వైస్సార్ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో భేటీ అవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు.

కడపను స్మార్ట్‌ సిటీగా మారుస్తా - కడప-బెంగళూరు రైల్వే లైను పూర్తి చేస్తా : భూపేశ్‌ రెడ్డి - Kadapa TDP MP Candidate Interview

తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్‌ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్‌ బహిరంగంగా విమర్శలు చేశారు. సీఎం అనుమానాలు నిజం చేసేలా బ్రదర్‌ అనిల్‌కుమార్‌ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడం వినిపించింది. కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. తమ కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు.

షర్మిలకు మద్దతుగా పులివెందుల మండలంలో ఆదివారం వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద రంగాపురంలో ఆమె ప్రచారాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివేకా హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టగా వారికి ధీటుగా సునీత సమాధానం ఇచ్చారు. ఎందుకు వివేకా హత్య గురించి మాట్లాడకూడదంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో పోలీసులు స్పందించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

మరోవైపు సీఎం జగన్‌ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో ఆదివారం వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొండూరు మండలం ఇనగనూరులో ఇంటింటి ప్రచారం చేపట్టగా ఆమె వెంట అవినాష్‌రెడ్డి సతీమణి సమత ఉన్నారు. సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details