తెలంగాణ

telangana

పెళ్లైన 10ఏళ్లకు కవలలు జననం- ఇజ్రాయెల్ దాడిలో పిల్లలు సహా 14మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన మహిళ

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 9:40 AM IST

Israel Strike Rafah : రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 14మంది మరణించారు. మృతుల్లో 5నెలల కవలలు ఉన్నారు. దీంతో చిన్నారుల తల్లి తీవ్రంగా విలపించింది. పెళ్లైన పదేళ్ల తర్వాత పుట్టిన చిన్నారులు దూరం కావడం వల్ల ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

israel attack rafah
israel attack rafah

Israel Strike Rafah :ఓ మహిళ గర్భం దాల్చాలనే కోరిక 10 ఏళ్లకు నెరవేరింది. కానీ కవలలకు జన్మనిచ్చిన ఆ మహిళకు 5 నెలలకే కడుపు శోకం మిగిలింది. సెకన్ల వ్యవధిలోనే తన ఇద్దరు చిన్నారులు, భర్త సహా 14మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఆ మహిళ గర్భశోకానికి కారణమేంటి? అనే విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

క్షణాల్లో ఆవిరైన పదేళ్ల నిరీక్షణ
రఫాకు చెందిన రనియా అబు అన్జాకు కొన్నేళ్ల క్రితం విస్సామ్​తో పెళ్లైంది. కానీ పెళ్లైన తర్వాత చాలా ఏళ్ల వరకు ఈ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో ఆమె ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల్ని కనాలనుకుంది రనియా. ఐవీఎఫ్ విధానం ద్వారా రెండు సార్లు గర్భం దాల్చడంలో ఫెయిలైంది. మూడో సారి గర్భం దాల్చి పండంటి కవలలకు(ఒక పాప, ఒక బాబు) గతేడాది అక్టోబరు 13న జన్మనిచ్చింది. అయితే దక్షిణ గాజాలోని రఫాపై శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్​ దాడులు చేయడం వల్ల తన ఇద్దరు చిన్నారులు, భర్త సహా 14 మందిని కోల్పోయింది. మరో 9మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అప్పుడు రనియా కన్నీరుమున్నీరుగా విలపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, భర్త, కుటుంబ సభ్యులు మరణించడం వల్ల ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

"శనివారం రాత్రి మా ఇంటిపై జరిగిన దాడిలో నా పిల్లలు, భర్త, కుటుంబ సభ్యులు మరణించారు. నా భర్త, పిల్లల కోసం అరిచాను. నా భర్త పిల్లలను తనతో తీసుకెళ్లిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. నా భర్త దినసరి కూలీ. మాకు ఎలాంటి హక్కులు లేవు. నాకు ఇష్టమైనవారందర్నీ కోల్పోయాను. నాకు ఇక్కడ నివసించడం ఇష్టం లేదు. నేను ఈ దేశం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను. నేను ఈ యుద్ధంతో అలసిపోయాను." అని రనియా ఆవేదన వ్యక్తం చేసింది.

'మా ఇంట్లో దాదాపు 35 మంది ఉంటున్నారు. వీరిలో కొందరు వేరే ప్రదేశాల నుంచి రఫాలోని మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో మిలిటెంట్లు ఎవరూ లేరు. అందరూ సాధారణపౌరులే.' అని రనియా బంధువు ఫరూఖ్ చెప్పారు. మరోవైపు, రనియా ఇంట్లో మరణించిన 14 మందిలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారని రఫా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మార్వాన్ అల్ హమ్స్ తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో రనియా తన భర్త, పిల్లలు, సోదరి, మేనల్లుడు, గర్భవతైన ఒక బంధువు సహా మరికొందరిని కోల్పోయిందని చెప్పారు.

ఇప్పటివరకు ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో 30,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో ఉన్న 2.3 మిలియన్ల జనాభాలో 80శాతం మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారు.

గాజాలో ఆకలి కేకలు- విమానాల ద్వారా ఆహారం జారవిడిచిన అమెరికా

గాజాలో మారణహోమం- సాయం కోసం ఎదురుచూస్తున్నవారిపై ఇజ్రాయెల్ దాడి- 70మంది మృతి

ABOUT THE AUTHOR

...view details