కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ - విచారణ జరిపించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
Published : Dec 16, 2023, 12:39 PM IST
MLC Jeevan Reddy Fires on BRS : శాసనమండలిలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీటి వినియోగంపై దృష్టి పెట్టకుండా, పర్యాటకంపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలన్న ఆయన, ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని కోరారు.
మిషన్ భగీరథ పథకం కూడా కమీషన్ల ప్రాజెక్టే అని జీవన్‌రెడ్డి ఆరోపించారు. అన్ని వసతులు ఉన్నా, రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారని విమర్శించారు. విద్యుత్ విభాగంలో రూ.80,000ల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాలని కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోందని జీవన్‌రెడ్డి తెలిపారు.
MLC Jeevan Reddy Comments on KCR : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని, కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలని కోరారు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత తగదని అన్నారు. సాగు నీరు హక్కులు కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారని, కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు. మిషన్ భగీరథ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని జీవన్‌రెడ్డి కోరారు.