ETV Bharat / sukhibhava

లంచ్ తర్వాత హుషారు తగ్గినట్టు అనిపిస్తుందా? అయితే ఈ టిప్స్ మీకోసమే..

author img

By

Published : May 31, 2022, 9:31 AM IST

Tips To Follow After Lunch: చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత.. కాస్త బద్ధకంగా, హుషారు తగ్గినట్టు అనిపిస్తుంటుంది. దీనికి విరుగుడుగా కాఫీ, టీ, కూల్ డ్రింకులు వంటివి తాగుతారు. అయితే ఇవేవి కాకుండా సహజంగా తిరిగి ఉత్సాహాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.

tips-to-follow-when-you-feel-lazy-and-wise-after-lunch
tips-to-follow-when-you-feel-lazy-and-wise-after-lunch

Tips To Follow After Lunch: మధ్యాహ్న భోజనం అనంతరం.. సాయంత్రం అవుతున్నకొద్దీ చాలామందికి కాస్త బడలికగా, హుషారు తగ్గినట్టుగా అనిపించటం సహజమే. ఇలాంటి సమయంలో చాలామంది చేసే పని కాఫీ, టీ, కూల్‌డ్రింకులు తాగటం. సమోసాలు, పకోడీల వంటివి లాగించటం. ఇవి కొంత ఉత్సాహాన్ని కలిగించినా అనర్థాలు లేకపోలేదు. మరి వీటితో పనిలేకుండా తిరిగి ఉత్సాహాన్ని పొందటమెలా?

ఒకింత నడక: గంటలకొద్దీ అదేపనిగా, అంతే ఉత్సాహంగా పనిచేయటానికి శరీరం సహకరించదు. ఒంట్లో కార్టిజోల్‌ హార్మోన్‌ మోతాదులు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. దీని మోతాదులు తగ్గినప్పుడు నిరుత్సాహంగానూ అనిపిస్తుంటుంది. అందువల్ల కుర్చీలోంచి లేచి నాలుగడుగులు వేయటం మంచిది. దీంతో రక్త ప్రసరణ పుంజుకొని ఉత్సాహం వస్తుంది. ఇంటి చుట్టో, ఆఫీసు చుట్టో నడిచినా చాలు. పరిసరాల దృశ్యాలూ మనసును ఉత్తేజితం చేసి, హుషారును తెచ్చిపెడతాయి.

మంచి అల్పాహారం: రోజంతా శక్తిని సమకూర్చుకోవటానికి పునాది ఉదయాన్నే వేసుకోవాలి. ఇందుకు ఉత్తమ మార్గం అల్పాహారం. మంచి పోషకాలతో కూడిన అల్పాహారంతో చురుకుదనం ఏకాగ్రత, సమస్యల పరిష్కారం, పనిలో సామర్థ్యం ఇనుమడిస్తాయి.
అల్పాహారం మానేసినా, ఏదో కొద్దిగా తిన్నా మధ్యాహ్న భోజనం ఎక్కువగా లాగించే ప్రమాదముంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు బాగా పెరుగుతుంది. ఇది కొద్ది గంటల తర్వాత అలసటకు దారితీస్తుంది.

నీరు అత్యవసరం: మన శరీరం నీటి మీదే ఆధారపడి ఉంది. గ్లాసు నీళ్లు తాగితే అలసట తగ్గినట్టు అనిపించటమే కాదు.. కణాలకు ఆక్సిజన్‌, పోషకాలు కూడా సరఫరా అవుతాయి. నీటితో రక్తపోటు, గుండె వేగం అదుపులో ఉంటాయి కూడా.

కాస్త విరామం: శరీరం తనకు అవసరమైన వాటి గురించి చెప్పటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. వీటిల్లో అలసట ఒకటి. పనిలోంచి కాసేపు విరామం తీసుకోవటం మంచిదని చెప్పటమూ దీని ఉద్దేశం కావొచ్చు. కొద్దిసేపు చేస్తున్న పని నుంచి ధ్యాస మళ్లిస్తే ఆ తర్వాత ఏకాగ్రత, చురుకుదనమూ పెరుగుతాయి.

పరదాలు తొలగాలి: కాంతి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. నిజానికి మన శరీరం నిద్ర, మెలకువల సంకేతాలను కాంతి నుంచే గ్రహిస్తుంది. పని చేస్తున్నప్పుడు అలసటగా అనిపిస్తే కిటికీల పరదాలు తొలగించి చూడండి. లోపల వెలుతురు బాగా ఉంటే హుషారు దానంతటదే వస్తుంది.

వీలైతే నిల్చొని పని: డెస్క్‌ ముందు కూర్చొని పనులు చేసేటప్పుడు చేతులు బాగానే ఆడుతుంటాయి గానీ నడుం స్థిరంగా ఉంటుంది. ఇది హుషారు తగ్గేలా చేస్తుంది. కాబట్టి వీలుంటే నిల్చొని పనిచేసే డెస్క్‌లు వాడుకోవచ్చు. కాసేపు కూర్చొని, కాసేపు నిల్చొని పని చేస్తే శరీరం కదులుతుంది. రక్త ప్రసరణా పుంజుకుంటుంది.

కొద్దిగా చిరుతిండి: చిరుతిండి అనగానే సమోసాలు, పకోడీల వంటివే గుర్తుకొస్తుంటాయి. వీటి కన్నా బాదం, అక్రోట్ల వంట గింజపప్పులు.. పండ్లు, కూరగాయల ముక్కలు తీసుకోవటం మంచిది. ఇవి తక్షణ శక్తితో పాటు పోషకాలనూ అందిస్తాయి.

చక్కెర వద్దు: సాయంత్రం అవగానే కాఫీ, టీ, కూల్‌డ్రింకుల వైపు చూస్తుంటారు. కెఫీన్‌, చక్కెరతో సత్వరం హుషారు రావచ్చు గానీ అంతే త్వరగా రక్తంలో గ్లూకోజు పడిపోతుంది. దీంతో ఉత్సాహమూ సన్నగిల్లుతుంది. అందువల్ల సహజ చక్కెరలతో కూడిన పండ్లు, పండ్ల రసాలు తీసుకోవటం మంచిది.

చిన్న కునుకు: పగటిపూట కొద్దిసేపు కునుకు తీసినా శరీరం తిరిగి ఉత్తేజితమవుతుంది. అలాగని ఎక్కువసేపు పడుకోకూడదు. కునుకు 15 నిమిషాల కన్నా మించకుండా చూసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలోపే కునుకు తీయాలి. లేకపోతే రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడొచ్చు.

మంచి సంగీతం: ఇష్టమైన, శ్రావ్యమైన సంగీతం వింటే మూడ్‌ మెరుగవుతుంది. ఉత్సాహం చేకూరుతుంది. సంగీతంతో మెదడులో డోపమైన్‌ మరింత ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. రక్త ప్రసరణ కూడా సాఫీగా సాగుతుంది.

ఇవీ చదవండి: రోజూ కాఫీ తాగితే అన్ని ప్రయోజనాలా..!

తెలుసా మీకు...! ఉరకలేసే మనసుకు.. వయసు తెలియదంతే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.