ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భక్తజనులకు యాదాద్రి స్వయంభువుల దర్శనాలను త్వరలోనే కల్పించేందుకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆరున్నరేళ్లుగా ఇష్ట దేవుని నిజదర్శనాలకు బదులు ప్రతిష్ఠాలయంలో కవచ మూర్తులను దర్శించుకుంటున్న భక్తులకు వీలయినంత త్వరలో గర్భాలయంలోని మూలమూర్తుల దర్శన భాగ్యం కల్పించాలన్నదే లక్ష్యంగా సీఎం యోచిస్తున్నట్లు యాడా చెబుతోంది. మార్చి 4న ఈ క్షేత్రంలో పర్యటించిన కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణంలో తుదిగా చేపట్టే పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఈ రెండు నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి ఆరా తీస్తున్నారు.
కరోనా గండం
తన కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ద్వారా ఆలయ పనులపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సీఎం తెప్పించుకోనున్నారు. ఈ నెలాఖరులో ఆలయ ఉద్ఘాటనకు రంగం సిద్ధం చేయాలన్న సీఎం యోచనకు.. కరోనా మహమ్మారి ఆటంకం కలిగించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొండపై పంచనారసింహులు స్వయంభువులుగా కొలువై ఉన్న ప్రధాన ఆలయంతో సహా అనుబంధ శివాలయాల పునర్నిర్మాణ పనుల సంపూర్తికి ఇంకెంత కాలం పడుతుందో సంబంధిత అధికారులతో సీఎంఓ చర్చించనున్నారు.
కల్యాణకట్టకు కప్పు పనులు..
క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కల్యాణకట్ట నిర్మాణంలో పైకప్పు వేసే పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆలయ ఈఈ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: మదర్స్‌డే స్పెషల్: ఈరోజు అమ్మకు ఏమిస్తున్నారు?