ETV Bharat / state

KTR Comments: రాజకీయాలకు అతీతంగా పరిశ్రమలు నెలకొల్పాలి: కేటీఆర్

author img

By

Published : Jun 22, 2022, 12:49 PM IST

Updated : Jun 22, 2022, 7:45 PM IST

KTR at NIMZ: దినదినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. రాజకీయాలకు అతీతంగా అనుకూలమైన ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరముందని కేటీఆర్ ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వెయ్యి కోట్లతో వెమ్ టెక్నాలజీ సంస్థ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

KTR at NIMZ
KTR at NIMZ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ప్రతిష్టాత్మక "నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్స్‌” నిమ్జ్‌లో మొట్టమొదటి పరిశ్రమకు పునాది రాయి పడింది. నిమ్జ్‌లో రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ "వెమ్" సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో 511 ఎకరాల్లో 3 దశల్లో పరిశ్రమను నిర్మించనుంది. ఈ పరిశ్రమలో మానవరహిత యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, రాడార్ల వంటి రక్షణ పరికరాలు తయారు చేయనున్నారు. నిమ్జ్‌లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు పరికరాలు తయారు చేసి ఎగుమతి చేయనున్నారు. ఈ పరిశ్రమ ద్వారా 2వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.

రాజకీయాలకు అతీతంగా అనుకూలమైన ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. పర్యావరణానికి అనుకూలంగా పరిశ్రమలు రావాలన్న మంత్రి... ధరలకు అనుగుణంగా భూముల విలువ పెంచి... రైతులకు పరిహారం అందించాలన్నారు. నిమ్జ్‌లో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలన్న ఆయన.... వారి పిల్లలకు ఇక్కడే ఉపాధి కల్పించాలని అవసరమైతే నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా స్థానిక గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

'భూముల విలువ బాగా పెరిగిపోయింది. అలాంటి విలువైన భూములు ఇచ్చిన వారికి ఉపాధి అవకాశం కల్పించండి. నిర్వాసితులకు భరోసా కల్పిస్తే.. వారు భూములు ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. అభివృద్ధికి వారి వంతు సాయం చేస్తారు. నిమ్జ్‌లో స్కిల్ సెంటర్ పెట్టి.. నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం. పరిశ్రమలు వేళ్లూనుకొని ఉందో అక్కడ కాకుండా.. ఉత్తరప్రదేశ్‌లో ఓట్లు, సీట్లున్నాయని.. అక్కడే అన్ని అభివృద్ధి పనులు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం తమ చేతిలో ఉంది కదా అని.. ఎలాంటి వసతులు, సదుపాయాలు లేని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటే అది సరైన నిర్ణయం కాదు.' -- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

"వాయు" ఈవీ పరిశ్రమకూ మంత్రి కేటీఆర్ భూమిపూజా చేశారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 50 కోట్ల సీఎం-ఎస్‌డీఎఫ్‌ నిధులతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలకు 52 కోట్ల 40 లక్షల రుణాలను పంపిణీ చేశారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్ర పురోగమిస్తోందని... కానీ విపక్షాలు మాత్రం కుల, మత చిచ్చులు పెడుతున్నాయని విమర్శించారు.

అనంతరం మహీంద్ర పరిశ్రమలో కేటీఆర్ స్మారకాన్ని ప్రారంభించారు. 3 లక్షల ట్రాక్టర్ల ఉత్పత్తి పూర్తి చేసుకున్న సందర్భంగా మహీంద్రా పరిశ్రమలో ప్రత్యేక స్మారకాన్ని ఏర్పాటు చేయగా... దానిని మంత్రి ఆవిష్కరించారు.

Last Updated :Jun 22, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.