Revanth Reddy Convoy Dhi: "హాథ్ సే హాథ్" జోడో యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు చేస్తోన్న పాదయాద్ర ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నేరెళ్ల బాధితులతో మాట్లాడిన రేవంత్ అనంతరం పాదయాత్ర కొనసాగించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. వెంటనే కార్లులోని బెలూన్లు తెరుచుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదంలో నాలుగు కార్లతో పాటు మూడు న్యూస్ ఛానళ్ల కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. అందులో ప్రయాణిస్తున్న పలు న్యూస్ రిపోర్టర్లకు స్వల్ప గాయాలయ్యాయి.
నేరెళ్ల బాధితులతో రెవంత్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేకూర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడ్డుకున్న నేరెళ్ల గ్రామస్తులను గతంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. "హాథ్ సే హాథ్" జోడో యాత్రలో భాగంగా తంగళ్లపల్లి మండలం పద్మానగర్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి బస చేసిన ప్రాంతం వద్ద బాధితులు ఆయన్ను కలిసి వారి బాధలను పంచుకున్నారు.
పోలీసులు తీవ్రంగా కొట్టడమే కాకుండా తమకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. ప్రభుత్వం దీనిపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఎలా స్పందించిందని రేవంత్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌గాని మానవ హక్కుల సంఘం ఎలాంటి నివేదికలు ఇచ్చాయో తమకు తెలియదని వారు ఆవేదన వెల్లగక్కారు. పోలీసుల చర్యల వల్ల తాము సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రేవంత్.. తప్పకుండా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
శ్రీపాద కాలువ పనులు పరిశీలన: గుత్తేదారులు సరిగా పనిచేయడం లేదని నెపంతో కడప కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్లనే శ్రీపాద కాలువ పనులు ఆలస్యమవుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ శివారులో శ్రీపాద కాలువ పనులను ఆయన పరిశీలించారు. తొమ్మిదోవ ప్యాకేజీ పనులు ఆలస్యం కావడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ పనులను కడప కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతో లాభాలు దండుకొని మిగతా పనులను గాలికి వదిలేసారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుత్తేదారులు పనులు చేయగలుగుతారా లేదా సామర్థ్యాన్ని పరిశీలించకుండా పనులు అప్పగించడం వల్లనే రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఆయన విమర్శించారు. పనులు నిర్లక్ష్యం చేయడం వల్ల అంచనా గణనీయంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసిన గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టి పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
గవర్నర్ అచ్చం రాజకీయ నాయకురాలుగా మారారు: రేవంత్‌రెడ్డి
ఇంకా చల్లారని భూపాలపల్లి.. ముదురుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ వార్
రేవంత్ పాదయాత్రతో కాంగ్రెస్‌లో నయా జోష్.. కదం కదుపుతున్న నేతలు