ETV Bharat / state

బెల్లంపల్లి కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా కరాళనృత్యం

author img

By

Published : May 7, 2021, 3:56 AM IST

corona deaths
కరోనా మరణాలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇక్కడి కొవిడ్‌ ఆస్పత్రిలో 36 గంటల వ్యవధిలోనే 12 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కల్గిస్తోంది. రోగులంతా ప్రైవేటులో చికిత్స పొంది... చివరి దశలో ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

బెల్లంపల్లి కొవిడ్‌ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. 36 గంటల్లో 12 మంది వైరస్‌కు బలవ్వడం అక్కడి వారిని తీవ్రభయాందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు ఇదొక్కటే కరోనా ఆస్పత్రి. ఇక్కడ గత నెలరోజుల్లో 31 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులంతా తొలుత ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారని... అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో చివరి క్షణాల్లో తీసుకురావడంతో కాపాడలేక పోయామని ఆసుపత్రి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ అనిల్‌ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఎనిమిది మంది... ఆ తర్వాత మరో నలుగురు మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు.

మళ్లీ తిరగబెడుతున్న కరోనా

బెల్లంపల్లి కొవిడ్‌ ఆస్పత్రిలో 100 ఆక్సిజన్‌ పడకలున్నాయి. వీటిలో ప్రస్తుతం 70 మంది చికిత్స పొందుతున్నారు. అదనంగా ఐసీయూలో 20 పడకలు ఉండగా.. 12 మందికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా చనిపోయిన వారంతా గత రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఇక్కడ చేరారు. చెన్నూరుకు చెందిన పి.వీరేశం(65) ఏప్రిల్‌ 22న బెల్లంపల్లి కొవిడ్‌ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక డిశ్ఛార్జి అయి వెళ్లిపోయారు. కరోనా మళ్లీ తిరగబెట్టడంతో ఈ నెల 2న ఆస్పత్రిలో తిరిగి చేరారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయిదాటిన తర్వాత..

ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు చివరి క్షణంలో చేతులెత్తేయడంతో తమవారిని ఎలాగైనా రక్షించుకోవాలని ఇక్కడికి తీసుకొస్తున్నారు. బాధితులు వచ్చేటప్పటికే ఆక్సిజన్‌ స్థాయి 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోందని.. తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చుకుంటున్నామని డాక్టర్‌ అనిల్‌ తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు పరిస్థితి విషమించాక ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రికి పంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మూడు నుంచి నాలుగు రోజుల పాటు చికిత్స చేసిన తర్వాత బిల్లులు చెల్లించుకుని ఇలా చేస్తుండటంతో రోగుల బంధువులకూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంటోంది. కొంతమంది హోం ఐసోలేషన్‌లో ఉండి శ్వాస సమస్యలు తీవ్రమై, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయాక చివరి క్షణాల్లో వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.