ETV Bharat / state

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సేంద్రీయ ఉత్పత్తులు

author img

By

Published : Mar 28, 2023, 9:39 AM IST

Demand for Organic Products in Mahabubnagar: రసాయనాలతో పండించిన పంటలకు బదులు.... సేంద్రీయ విధానంలో పండించిన ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. కరోనా వైరస్‌ తర్వాత ఈ విషయంపై జనంలో ఇపుడిపుడే అవగాహన పెరుగుతోంది. సేంద్రీయ ఉత్పత్తులకు జనం నుంచి గిరాకీ పెరుగుతోంది. సేంద్రీయ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో ప్రజలకు తెలియని పరిస్థితి. ఎవరు కొంటారో పండించే రైతులకు తెలియడం లేదు. కర్షకులను, వినియోగదారుల్ని అనుసంధానం చేస్తోంది మహబూబ్​నగర్ గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్ర సంఘం. రైతులకు లాభాలను, వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందిస్తోంది.

Organic Products
Organic Products

సేంద్రీయ పంటలకు పెరుగుతున్న గిరాకీ.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఉత్పత్తులు

Demand for Organic Products in Mahabubnagar: సేంద్రీయ విధానంలో పండించిన పంటలకు, ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. సేంద్రీయ ఉత్పత్తుల్ని పండించే రైతులు మాత్రం సరైన మార్కెటింగ్‌ లేక నష్టాలు చవిచూస్తున్నారు. ప్రకృతి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని వినియోగదారులకు ఆసక్తి ఉన్నా... అవి ఎక్కడ దొరుకుతాయో వారికి తెలియడం లేదు. రైతులకు, వినియోగదారులకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తోంది మహబూబ్‌నగర్‌లోని గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార విక్రయ కేంద్ర సంఘం.

ధర కాస్త అధికమైనా.. ఆరోగ్యానికి ఎంతో మేలు : మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ తిరుమల హోటల్‌లో నిర్వహించే విక్రయ కేంద్రంలో... బియ్యం, పప్పులు, చిరుధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బెల్లం, గో ఉత్పత్తులు ఉంటాయి. సాధారణ బియ్యం కాకుండా కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు పండ్లను అమ్ముతున్నారు. వీటితోపాటు గోమూత్రం, గోవు పిడకలు, ఘనజీవామృతం, ఆవునెయ్యి, దేశీ విత్తనాలు విక్రయిస్తున్నారు. ప్రతి ఆది, బుధవారం కేంద్రానికి వచ్చే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సాధారణ ఉత్పత్తులతో పోల్చితే ధర కాస్త అధికమైనా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు.

'మేము ఇక్కడే కూరగాయలు తీసుకుంటున్నాం. ఆ కూరగాయలు తిన్నప్పటి నుంచి ఆరోగ్యం చాలా మంచిగా ఉంటోంది. మందులు లేని పంటలు తినడం అదృష్టంగా భావించాలి. ఇలాంటి రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ముఖ్యంగా బెండకాయ, వంకాయ, మిరపకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి పంటలకు అధిక మొత్తంలో మందులు వాడతారు. ఈ అయిదు కూరగాయలను మనం మానేయగలిగితే సగం రోగాలు అక్కడే నయమవుతాయి.'-వినియోగదారులు, మహబూబ్​నగర్

సరకుల ధరలను రైతులే నిర్ణయిస్తారు : విక్రయ కేంద్రానికి తెచ్చిన సరకుల ధరలను రైతులే నిర్ణయిస్తారు. విక్రయ కేంద్రం నిర్వాహకులకు 8శాతం కమీషన్‌, 2శాతం సంఘం నిర్వహణకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. నిర్వాహకులు నెలకోసారి రైతులకు డబ్బులు చెల్లిస్తారు. ఉత్పత్తులు ఖాళీకాగానే తిరిగి వెంటనే రైతుల నుంచి తెప్పిస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు పెద్దఎత్తున కూరగాయల్లాంటి ఉత్పత్తులు కావాలంటే... వినియోగదారులు రైతులను నేరుగా సంప్రదించవచ్చు. రైతుల వద్దే కొనుగోలు చేసుకోవచ్చు. ముందస్తుగా అన్నిరకాల పరీక్షలు నిర్వహించి... గో ఆధారిత సాగు ద్వారా పండించినవని నిర్ధారించుకున్నాకే అమ్మకానికి పెడతారు.

'రైతులు సేంద్రీయ పంటలను పండిస్తున్న సందర్భంలో ఒక స్టోర్ నడిపిస్తే బాగుంటుందని భావించి సామూహికంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పండించిన పంటలన్ని ఇక్కడ ఉంచితే కొనేవాళ్లు కొంటారు... చూసే వాళ్లు చూస్తారు. వినియోగదారుడు దళారుల చేతిలో మోసపోకుండా మేమే ప్రత్యక్షంగా రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ఇక్కడ రైతులు నిర్ణయించిన ధరకే పంటలను కొంటాం. ఆయన పేరు మీదగానే సరకులను వినియోగదారులకు అందిస్తాం.'-ముకుందరెడ్డి, సంఘం అధ్యక్షుడు

ప్రతి నెలకోసారి సమావేశమయ్యే సంఘం రైతులు... సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లేలా ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని మరింత విస్తృతం చేయన్నట్లు సంఘం నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.