ETV Bharat / state

Monsoon Delayed in Telangana : ఊరించి ఉసూరుమనిపిస్తున్న వరుణదేవుడు.. ఇకనైనా కరుణించవయ్యా..!

author img

By

Published : Jul 7, 2023, 8:01 AM IST

Delay Rains in Telangana : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి తొలకరి పలకరించినా ఆ తర్వాత సరిపడా పదును వచ్చేలా వానలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలపై ఆధారపడి పత్తి విత్తనాలు విత్తితే అవి మొలకెత్తకపోవడంతో మరోసారి విత్తనాలు విత్తారు. ఇప్పుడు కూడా వర్షాలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు నష్టాన్ని తెస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు.

Etv Bharat
Etv Bharat

ఊరించి ఉసూరుమనిపిస్తున్న వరుణదేవుడు

Late Rainfall In Telangana : కాసింత ఆలస్యమైనా... రాష్ట్రంలోనే మొదటగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకే నైరుతి రుతుపవనాలు వచ్చాయన్న ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. ఊరించి ఊసురుమన్న చందంగా అడపాదడపా కురిసిన వర్షాలు విత్తనం నాటేందుకు అనువుగా లేక కర్షకులకు నిరీక్షణ తప్పడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, భూమిలో నాటిన విత్తనం మొలకెత్తకపోవడం రైతుల్ని వేదనకు గురిచేస్తోంది. దోబూచులాడుతున్న వానాకాలం సీజన్ రైతుల్ని కలవరపెడుతోంది. ఇప్పటికే కొండంత ఆశతో వేలకు వేలు పెట్టుబడులు పెట్టి విత్తనాలు నాటిన సాగుదారులు వరుణదేవుడు కరుణ చూపాలంటూ ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Delay in monsoon Rains : వానాకాలం సీజన్‌ మొదలై నెల గడుస్తున్నా... గట్టి వాన ఇప్పటికీ ఒక్కటంటే ఒకటి పడలేదు. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం సీజన్ ఇంకా గాడిన పడలేదు. రుతుపవానాల రాక ఆలస్యంతో ఆశించిన మేర పంటల సాగవలేదు. తొలకరి పలకరింపుతో దుక్కులు దున్నుకోవడం, విత్తనాలు సిద్ధంచేసుకోవడంలో రైతులు మునిగారు. ఒకటి రెండు సార్లు అడపాదడపా వానలు కురసి ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ రావడం వల్ల సాగు సందిగ్ధంలో పడింది. పంటల సాగుకు ఎన్నో ఆశలతో సిద్ధమైన కర్షకులు విత్తనాలు వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. తొలకరి వానలకు విత్తనాలు నాటిన వారి పరిస్ధితి దయనీయంగా మారింది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి నాటిన విత్తనాలు మొలకెత్తక నానా అగచాట్లు పడుతున్నారు.

"లక్ష రుపాయలు పెట్టుబడి పెట్టినం. ట్రాక్టర్​ పెట్టి దున్నిచ్చాం, కూలీలకు అంతా కలిపి విత్తనాలు నాటితే మొలకలేవు. కురిసిన ఒక్క వర్షానికి రైతులు ఆగలేక మిరప గింజలు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ పెట్టుబడి పెట్టాలి. మొత్తం అప్పులు తీసుకొచ్చి వేయాలి. అప్పలిచ్చినవారి దగ్గరికి వెళ్తే పాత బాకీలు కట్టలేదని అడుగుతున్నారు." - బాధిత రైతులు

వరుణుడి రాక కోసం నింగి వైపు చూస్తున్న రైతులు : ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఖమ్మంలోని 21 మండలాల్లో 18 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురిసింది. ఉభయ జిల్లాల్లోనూ పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. భద్రాద్రి జిల్లాలో 6లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేయగా ప్రస్తుతానికి 91 వేల ఎకరాల్లోనే పంటలు వేశారు. ఖమ్మం జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని వ్యవసాయ అంచనా వేయగా లక్షన్నర ఎకరాల్లో మాత్రమే పంటలు సాగుచేశారు. మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడం వల్ల...రెండోసారి వేయడం పెట్టుబడి తడిసి మోపెడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఇన్ని నష్టాలు వచ్చినా రైతలు ఇకనైనా వానలు కురవకపోతాయా అని ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.