తెరాస, భాజపావి కొనుగోలు రాజకీయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC president Revanth Reddy) ఆరోపించారు. ఎస్సీలకు ఇచ్చిన హామీని కేసీఆర్ అమలు చేయలేదని.. ఎస్సీలకు ఆయన ఎంత సేవ చేసినా తక్కువేనని చెప్పారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మంచి అధికారి అని.. కేసీఆర్ అరాచకాలతోనే ఆయన బయటకు వచ్చారన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి గురించి హడావుడి చేసిన సీఎం కేసీఆర్... ఆయన భాజపాలో చేరగానే దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విచారణ నివేదికలు ఎటుపోయాయని నిలదీశారు. గాంధీభవన్‌లో మీడియాతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక, అక్కడ ప్రచారం తదితరవి అన్నీ కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ చూసుకుంటారని రేవంత్ రెడ్డి వివరించారు.
గజ్వేల్‌కు వెళ్లితీరుతా..
తాను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వస్తానని అడగలేదని వెల్లడించారు. అంతకు ముందు జరిగిన విషయాలు తనకు తెలియదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను గజ్వేల్ వెళ్లి తీరతానని, మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టడం ఖాయమని వెల్లడించారు. గజ్వేల్‌లో ఉపఎన్నిక రావాలంటే కేసీఆర్ రాజీనామా చేయాలి కదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. అక్కడ తాను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
వారికి ఎంత చేసినా తక్కువే..
దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయలేదని రేవంత్ ఆరోపించారు. దళితులకు పది లక్షలు ఇవ్వడం కాదు... ఎంత చేసినా తక్కువేనని అన్నారు. దళిత బందు పథకం అద్బుతం అంటూ.... వంద మంది తెరాస ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో తిరిగి చెప్పగలరా అని నిలదీశారు. రాహుల్ బొజ్జా సమర్థవంతమైన అధికారని... ఆయనకు ఏదో పెద్ద అవకాశం ఇచ్చానని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు.
దానికి ఇంకా టైం ఉంది..
పీసీసీ పూర్తిస్థాయి కమిటీకి ఇంకా సమయం పడుతుందని... ఇప్పుడు కేవలం ప్రజా సమస్యలపై పోరాటాలేనని రేవంత్ వివరించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ యాత్రలు భాజపాలో కేసీఆర్ అనుకూల వ్యతిరేక వర్గాల పోరాటమేనని పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాసిన ఏ లేఖ కూడా తన దృష్టికి రాలేదని... ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గురించి నేను మాట్లాడింది రాజకీయాల గురించి కాదు.. కేవలం అధికారిగా ఆయన పనితనం గురించేనని వివరించారు. బీఎస్పీ పార్టీతో కలిసి పనిచేయాలా వద్దా అనే చర్చ మా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చ జరగలేదని వివరించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని విమర్శించిన రేవంత్ రెడ్డి... కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతల పల్లిలోనే దళిత, గిరిజన దీక్ష చేపడుతున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ దాదాపు ఖరారు!