రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో భాగంగా తొలి, భారీ నిర్మాణం చేపట్టిన.. మేడిగడ్డ బ్యారేజిలో తొలిసారిగా నీటిమట్టం గరిష్ఠసామర్ధ్యానికి చేరింది. తొలిసారిగా ఏకకాలంలో 11 మోటార్లతో నీటిని ఎత్తిపోసే మహాఘట్టం శనివారం కనువిందు చేసింది.
ఒక్కో నీటి చుక్క ఒడిసిపట్టారు
గతేడాది నవంబర్ 21 నుంచి పూర్తిస్థాయిలో లక్ష్మీ జలాశయం గేట్లను మూసివేసి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టారు. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలు కాగా.. శనివారం సాయంత్రానికి 15.90 టీఎంసీలకు లకు నీటిమట్టం చేరుకుంది. ఈ తరుణంలో లక్ష్మీ జలాశయం నుంచి పంపులతో నీటిని ఎత్తిపోసే కార్యక్రమం మొదలుపెట్టారు.
ఏకకాలంలో 11 మోటార్లతో నీటి ఎత్తిపోత
శనివారం సాయంత్రం తొలుత ఏడు మోటార్లు నడిపించారు. క్రమంగా ఒక్కక్కటిగా పెంచుతూ వచ్చారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏకకాలంలో 11 మోటార్లను నడిపించి నీటిని ఎత్తిపోశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వరు, ఎల్‌ఈ రమణారెడ్డి, మెగా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ జలాలు అన్నారం బ్యారేజికి వచ్చి చేరుతాయని వివరించారు.
నిరంతరం ఇంజినీర్ల పర్యవేక్షణ
ఆనకట్టలు పంపుహౌజ్‌ల వద్ద శాశ్వతంగా ఇంజినీర్లు ఉండేందుకు వీలుగా వారికి వసతి, తదితర సదుపాయం కల్పించాలని ఇటీవలే లక్షీ బ్యారేజీ సందర్శనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాలకు మార్కింగ్ ఇచ్చామని ఇవాళ్టి నుంచి పనులు ప్రారంభం అవుతాయని ఈఎన్‌సీ వెల్లడించారు.
ఇవీ చూడండి: ఎంసెట్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?