ETV Bharat / state

hyderabad paper girls: హైదరాబాదీ పేపర్‌ గర్ల్స్‌ కథ విన్నారా..!

author img

By

Published : Dec 1, 2021, 12:11 PM IST

hyderabad paper girls: కోడికూతకు ముందే మేల్కొంటారు. సూరీడు పలుకరించే కంటే ముందు... వార్తా సమాచారం గడప గడపకు చేరవేస్తారు. సాధారణంగా ఈ పని ఎవరు చేస్తుంటారు.. పేపర్‌ బాయ్స్‌ కదా..! బోరబండలో మాత్రం ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేస్తున్నారు. తండ్రి కష్టాన్ని తాము తీసుకుని ముందుకుసాగుతున్నారు. పేపర్‌ వేస్తునే చదువులోను ప్రతిభ చాటుతున్నారు. ఉదయాన్నే గల్లీ గల్లీ తిరుగుతూ దినపత్రికలు వేస్తూ హైదరాబాదీ పేపర్‌ గర్ల్స్‌గా గుర్తింపు పొందుతున్నారు...పవిత్ర, ప్రమీల.

తండ్రితో పేపర్​ గర్ల్స్​ పవిత్ర, ప్రమీల
తండ్రితో పేపర్​ గర్ల్స్​ పవిత్ర, ప్రమీల

తండ్రి బాటలో పేపర్‌ వేస్తున్న అక్కాచెల్లెళ్లు

hyderabad paper girls: మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాందాస్‌ కుటుంబం 20ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. బోరబండలో నివాసముండే ఆయన... మొదట పేపర్‌బాయ్‌గా పని చేసేవారు. తర్వాత.. ఓ పేపర్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది పేపర్‌బాయ్‌లను నియమించుకుని దిన పత్రికలు పాఠకులకు అందేలా చేసేవాడు. సెలవు దినాల్లో కుమార్తెలు పవిత్ర, ప్రమీలలు పేపర్‌ వేసేవారు. క్రమంగా పేపర్‌బాయ్‌ల సంఖ్య తగ్గటం... తండ్రి ఆర్థిక పరిస్థితి కూడా మునుపటిలా లేక పోవడంతో అక్కచెల్లెళ్లు ఓ ఆలోచనకు వచ్చారు. రోజూ తామే పేపర్ వేయడానికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యుల్ని ఒప్పించి... ఇలా పేపర్లు వేయడం మెుదలుపెట్టారు.

లాక్​డౌన్​ సమయంలో పేపర్​ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఆదాయం తగ్గిపోవడం వల్ల పేపర్​ బాయ్స్​ను పెట్టుకోకుండా మేమే పేపర్​ వేసుకుంటున్నాం. కాలేజీకి వెళ్లినప్పుడు స్టడీ అవర్స్​లోను, సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత చదువుకుంటాం. ప్రతిరోజు ఉదయాన్నే పేవర్​ వేయడానికి వెళ్తాం. పేపర్​బాయ్స్​ను పెట్టుకునే అవసరం లేకపోవడం వల్ల మా నాన్న.. సంతోషంగా ఉన్నారు. -ప్రమీల, పేపర్​ గర్ల్​

ఓ పక్క చదువు.. మరో పక్క తండ్రికి సాయంగా

రోజూ ఉదయం 4గంటలకే నిద్ర లేచే అక్కచెల్లెళ్లు...గంటపాటు చదువుకుని 5గంటల నుంచి తండ్రితో కలిసి బోరబండ నుంచి మోతీనగర్​కి స్కూటీపై వెళ్తారు. పేపర్ పాయింట్ నుంచి పేపర్లను తెచ్చి వాటిని క్రమపద్ధతిలో పెట్టి.. ఆయా కాలనీల్లో పేపర్లు వేస్తారు. మొదట సైకిల్​పై వెళ్లి పేపర్ వేసేవారు. అది కొంచెం కష్టంగా ఉండటంతో.. తండ్రి రామ్‌దాస్‌ స్కూటీ ఇప్పించారు.

ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో డాడీతో పాటు సెలవురోజుల్లో పేపర్​ వేయడానికి వెళ్లేవాళ్లం. కొవిడ్​ సమయంలో పేపర్​ బాయ్స్​ రాకపోవడం వల్ల మేము పేపర్​ వేయడం మొదలు పెట్టా. చదువు కొనసాగిస్తూనే పేపర్​ వేస్తున్నాం. ఉదయం మాత్రమే పేపర్​ పని ఉండడం వల్ల.. మిగిలిన టైంలో చదువుకుంటున్నాం. పవిత్ర, పేపర్​ గర్ల్​

నాన్న నడిచిన బాటలోనే..

paper girls Pavitra and Pamela: కొన్నాళ్లుగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతగా బాగాలేవు. ఈ నేపథ్యంలో తమ వంతు సాయం చేద్దామని ఈ పనికి సిద్ధమయ్యాం. ఈ పనిని అబ్బాయిలే ఎక్కువగా చేస్తుంటారు. అంతే కానీ, వారు మాత్రమే చేయాలని ఏం లేదు. అందుకే, నాన్న నడిచిన బాటలోనే సంతోషంగా ముందుకెళ్తున్నాం అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. ఈ పనిలో ఒకప్పుడు బాగా డబ్బులు మిగిలేవని....ఇప్పుడు ఆదాయం తగ్గిందని రాందాస్ చెబుతున్నారు. తక్కువ వస్తున్నాయని బాధపడి ఈ పని వదిలేయలేనన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని నా కుమార్తెలు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని...వాళ్లు ఏం కావాలంటే అది చదివిస్తానని తెలిపారు.

మా అమ్మాయిలు పేపర్లు వేస్తుంటే.. అమ్మాయిలను ఏమి చదివిస్తావు.. హాస్టల్స్​ ఉన్నాయి కదా అక్కడ చేర్పించు అని చెప్పేవారు. నా పిల్లలను నేను హాస్టల్స్​లో చేర్పించదలచుకోలేదు. - రాందాస్​ నాయక్​, పేపర్​ గర్స్ల్​ తండ్రి

borabanda paper girls: అంత ఉదయాన్నే బయటకు పంపాలంటే ఓ తల్లిగా భయంగా ఉంటుంది. వారిని నిద్ర లేపాలంటేనే బాధగా ఉంటోందని తల్లి లక్ష్మీ చెబుతున్నారు. అయినప్పటికీ... వారి ధైర్యం చూసి కాదనలేకపోతున్నాని అంటున్నారు.

పిల్లలను తెల్లవారే లేపాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ల కష్టం చూసి బాధ కలుగుతుంది. ఆడపిల్లలు కాబట్టి ఏదో భయం వేస్తోంది. - లక్ష్మి, పేపర్​ గర్స్ల్​ తల్లి

ఎందులోను తక్కువకాదంటూ..

ప్రమీల అక్కాచెల్లెళ్ల కష్టాన్ని చూసి పలువురు మెచ్చుకుంటున్నారు. దినపత్రికలు వేయించుకునే పాఠకులు సైతం అభినందిస్తున్నారు.

వర్షం పడుతున్నా ఎప్పుడూ పేపర్​ వేస్తుంటారు. పదేళ్లుగా వాళ్లను చూస్తున్నాము. మగపిల్లలతో పోటీపడి ఇవాళ అమ్మాయిలు కష్టపడుతున్నారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆడపిల్లలు ఎందులోను తీసిపోరు. -స్థానికులు

అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు... ఈ అక్కాచెల్లెళ్లు. ఇంత కష్టపడుతున్న వీరికి ప్రభుత్వం, దాతలు నుంచి ఆర్థిక సహకారం అందిస్తే బాగుంటుందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: symphony in stone exhibition: 'తెలంగాణ చరిత్ర, సాహిత్యంపై అవగాహన కల్పించేందుకు కృషి'

young writer: రవళిక అక్షర సేద్యానికి సాహిత్యమే మురిసిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.