ETV Bharat / state

అందమైన మాటలు తప్ప.. కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

author img

By

Published : Feb 1, 2023, 7:12 PM IST

Updated : Feb 1, 2023, 8:07 PM IST

Harishrao fires on Union Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డొల్లతనం కనిపిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందమైన మాటలు తప్ప కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్‌లో ఏడు ప్రాధాన్యత రంగాలను కేంద్రం గాలికొదిలేసిందని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Harishrao
Harishrao

Harishrao fires on Union Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అందమైన మాటలు తప్ప... నిధుల కేటాయింపులో డొల్లే అన్న ఆయన... ఏడు ప్రాధాన్యత రంగాలను గాలికి వదిలివేశారని ఆక్షేపించారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే బడ్జెట్‌ అన్న మంత్రి... రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్‌ అని ఆరోపించారు. విభజన హామీల అమలు ప్రస్తావనే లేదని.. 9 ఏళ్లుగా అడుగుతుంటే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసేలేదని అసహనం వ్యక్తం చేశారు.

మళ్లీ మొండిచేయి చూపారు: రాష్ట్రంలో ఒక్కప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, నేతన్నలకు జీఎస్టీ రాయితీలు, ప్రోత్సాహకాలు లేవన్నారు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరినా ఫలితం లేదన్న ఆయన... పారిశ్రామిక వాడలకు సంబంధించి తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా ఇవ్వలేదని అన్నారు. ఎరువులకు రాయితీలు భారీగా తగ్గించారన్న హరీశ్‌రావు... గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లోనూ కోత పెట్టి, ఆహార సబ్సిడీలు తగ్గించారని మండి పడ్డారు. నర్సింగ్‌, వైద్య కళాశాలల విషయంలో తెలంగాణకు మళ్లీ మొండిచేయి చూపారని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కేంద్రం పాటించటం లేదని ఆరోపించారు.

కర్ణాటకకు ప్రాధాన్యం కల్పించడం పక్షపాత చర్యే: విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతాల నిధిగా మూడేళ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ.1350 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిన కేంద్రం... ప్రస్తుత బడ్జెట్​లో కర్ణాటకలోని కరువు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.5300 కోట్లు కేటాయించిందని... పార్లమెంట్ చట్టంతో హక్కుగా రావాల్సిన నిధులను తెలంగాణకు ఇవ్వకుండా, మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు మాత్రం కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించడం పూర్తి పక్షపాత వైఖరని హరీశ్​రావు మండి పడ్డారు.

అలా ప్రతిపాదించడం ఆర్థిక వ్యవస్థకు చేటు: స్థానికసంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఖచ్చితంగా విడుదల చేయాల్సిన నిధుల్లోనూ కోత విధించి, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేసిందిని మంత్రి ఆక్షేపించారు. ఆర్థిక సంఘం నుంచి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపులోనూ 4297 కోట్ల కోత విధించారని తెలిపారు. 2023-24లో నికర అప్పులు 17,86,816 కోట్లు ప్రతిపాదించి అందులో సింహభాగం 8,69,855 కోట్లను రెవెన్యూ లోటును భర్తీ చేయడానికే ప్రతిపాదించారని... అప్పులను మూలధన వ్యయం కోసం కాకుండా... 48.7శాతాన్ని రోజువారీ ఖర్చుల కోసం ప్రతిపాదించడం ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని హరీశ్​రావు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ ఛార్జీల వల్ల రాష్ట్రాలు పన్నుల వాటా కోల్పోతున్నాయి: సెస్సులు, సర్ ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతోందని... రాష్ట్రాలకు ఇస్తోంది 41శాతమని చెబుతున్నా నిజంగా అందుతున్నది 30శాతమే అని హరీశ్​రావు అన్నారు. పన్నుల్లో వాటా పెంచామని.. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం జరిగిందని... ఈ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాలుగా నష్టపోతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు.

అందమైన మాటలు తప్ప.. కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

ఇవీ చదవండి:

Last Updated : Feb 1, 2023, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.