గొంతుతో రకరకాల బీట్లు.. వింటే ఔరా అనాల్సిందే!

author img

By

Published : Jan 20, 2021, 12:24 PM IST

beat boxer

మనసుల్ని తాకే సుస్వరాల సంగీతమేదైనా.. వాయిద్య పరికరం తప్పనిసరి. ఎంతటి మధురమైన పాటకైనా.. ఆకట్టుకునే బాణీ కావాలి. ఇవేమి లేకుండా నోటితోనే వినేవాళ్లను మంత్ర ముగ్ధుల్ని చేయటం, కేవలం గొంతుతో.. అద్భుత ధ్వనులను అందించటమే.. బీట్ బాక్సింగ్. ఈ విద్యలో ఆరితేరాడు.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు. గొంతుతో.. రకరకాల బీట్లు వినిపిస్తూ ప్రముఖ బీట్ బాక్సర్​గా పేరు తెచ్చుకుంటున్నాడు.

ప్రముఖ బీట్ బాక్సర్​ దీక్షిత్​పై ప్రత్యేక కథనం

రోజూ ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటాం. వాటి నుంచి కొన్ని సందర్భాల్లో ప్రేరణ పొందుతాం. మనమూ ఇలా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాం. కొన్ని రోజులకు ఆ సంగతే మరచిపోతాం. హైదరాబాద్‌కు చెందిన దీక్షిత్ బండారి మాత్రం ఆ పని చేయలేదు. స్ఫూర్తినిచ్చిన కళలో ఏళ్ల తరబడి సాధనతో ప్రత్యేకకళలో తనదైన ముద్ర వేస్తూ ప్రతిభ చూపుతున్నాడు.

సత్తా చాటాడు​

ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న దీక్షిత్ బండారి... పరికరాలు అవసరం లేకుండానే సంగీతాన్ని సృష్టించే బీట్ ‌బాక్సింగ్‌లో రాణిస్తున్నాడు. నోటితోనే రకరకాలుగా ధ్వనులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. గొంతుతో అద్భుత శబ్ధాలు పుట్టిస్తూ.. ఆకట్టుకునే పాటలతో సత్తా చాటుతున్నాడు.

పలు ప్రదర్శనలు

బీట్‌ బాక్సింగ్‌ నేర్పేందుకు ప్రత్యేకంగా గురువులు, శిక్షణ సంస్థలేవి అందుబాటులో లేవు. టీవీలో..స్నేహితుడి ద్వారా ఈ కళపై ఆసక్తి పెంచుకున్నాడు దీక్షిత్‌. అంతర్జాలంలో సూచనలు పాటిస్తూ.. సాధన చేసి ప్రావీణ్యం సాధించాడు. పలు ప్రదర్శనలిచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. అరుదైన ఈ ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు దీక్షిత్‌.

బీట్​ బాక్సర్​గా

స్వతహాగా డ్యాన్సర్‌ అయిన దీక్షిత్‌కు సంగీతమంటే అంటే ప్రాణం. ఆ అభిరుచే.. బీట్‌ బాక్సింగ్ వైపు నడిపింది. సమయం దొరికినపుడల్లా సాధనపై దృష్టి పెట్టేవాడు. పాశ్చాత్య పాప్ గీతాలు మెుదలు భారతీయ జానపదాల వరకూ అన్నిరకాల బాణీలు తన గొంతులో పలికిస్తూ..బీట్ బాక్సర్‌గా మెప్పిస్తున్నాడు.

బుల్లితెరకు పరిచయం

పటాస్.. స్టాండప్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయమయ్యాడు దీక్షిత్. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత వరస అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడు. టీవీ షోలతో పాటుగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు చేరువయ్యాడు. సరికొత్త బాణీలతో సంగీతాభిమానుల్ని అలరిస్తూ బీట్‌బాక్సింగ్‌కు గుర్తింపు తెస్తున్నాడు.

బీట్‌ బాక్సర్‌గా తనకంటూ ప్రత్యేకశైలి సృష్టించుకుని ముందుకు సాగుతున్న దీక్షిత్‌ .. సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్రతో ప్రతిభ చూపాలని తపిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, అధునాతన సంగీతాన్ని అందించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.