వీధి వ్యాపారులను ఈ-కామర్స్ సంస్థలో అనుసంధానం చేయాలనే కార్యక్రమానికి ఆదరణ కరవవుతోంది. వ్యాపారులకు అధిక ఆదాయ మార్గం చూపడంతో పాటు నగరవాసులకు నచ్చిన స్ట్రీట్‌ఫుడ్ అందించే కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ జనవరిలో శ్రీకారం చుట్టింది. అయితే వీధి వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకంలో భాగంగా వీధి వ్యాపారులను, ఫుడ్ సర్వీస్ కంపెనీలను అనుసంధానం చేసేందుకు సాంకేతిక వినియోగం, ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా వ్యాపారం జరిపేలా చైతన్యం కల్పించాలని భావించారు. నగరంలో సుమారు 70వేల మంది ఆహార విక్రేతలు ఉండగా ఇందులో కేవలం 2శాతం మంది మాత్రమే ఆసక్తి చూపడం గమనార్హం. దిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, వారణాసి, ఇండోర్ నగరాల తర్వాత హైదరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
నైపుణ్యం కొరత...
నగరంలోని ఆహార విక్రేతలు పలు కంపెనీల్లో నమోదు చేసుకోవాలంటే అందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలి.రిజిస్ట్రేషన్, ఫుడ్ క్వాలిటీ, ప్రభుత్వ విభాగాల అనుమతి సమర్పించాలి. వీటితో పాటు హోటల్ కేటగిరీలో 18శాతం జీఎస్టీని యాప్స్ పరిధిలో కస్టమర్లు చెల్లించాలి. ఇందుకు అమ్మకందారులు జీఎస్టీ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఆధారంగా ఆర్డర్లు తీసుకోవడం, డెలివరీ చేయడం, జీఎస్టీ, లెక్కలు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యం లేక చాలామంది వెనకడుగు వేశారు.
చిరునామా మారిపోతుంది..
గోషామహల్ సర్కిల్లో 200 మంది ఆహార విక్రేతలు ఉండగా..కేవలం 15 మంది మాత్రమే చేరారు. మలక్‌పేట్, చాంద్రాయణగుట్టలోను వందలాదిమంది ఉండగా పదిలోపే చేరారు. కొత్త ఇన్‌స్పెక్టర్ వచ్చి దుకాణం తీసేయమని చెబితే చిరునామానే మారిపోతోంది. కాగా లైసెన్సులు అందజేసి, వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తే ఇలాంటి పథకాల్లో చేరతామని వీధి వ్యాపారుల సంఘం ప్రతినిధులు అంటున్నారు.
నిర్ధిష్ట వెండింగ్ జోన్లు కరవు
వీధి వ్యాపారులకు నిర్దిష్టమైన వెండింగ్ జోన్ ఏర్పాటు చేసి వెండింగ్ సర్టిఫికేట్ జారీ చేయాలి. అప్పుడే మైబి డిజిటల్ తదితర పథకాలు విజయవంతం అవుతాయి. పీఎం స్వనిధి పథకంలో రుణాలు సరిగా అందడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.
- ఎస్.వెంకట్‌మోహన్, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: సాగర్‌లో గెలుపే లక్ష్యం... ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం