ETV Bharat / state

Harish rao review on corona New variant: కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే.. ఏం చేద్దాం?: హరీశ్​రావు

author img

By

Published : Nov 27, 2021, 12:06 PM IST

Updated : Nov 27, 2021, 12:37 PM IST

Minister Harish Rao Review with Health Department officials about coroana New variants and third wave
కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

12:03 November 27

వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

Minister Harish rao review on corona New variants:కొత్త వేరియంట్లు, మూడో దశ వస్తే ఏర్పాట్లపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు... ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజారోగ్య బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

కరోనా కేసులు తగ్గినప్పటికీ... కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్​'(omicron)... ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో.. ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన 'బి.1.1.529' వేరియంట్‌ పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్‌ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని.. వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏంటీ కొత్త వేరియంట్‌?

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కరోనా వేరియంట్‌ను 'బి.1.1.529'గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోట్స్‌వానా, ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ కేసులు వెలుగు చూశాయి.

భారత్‌లో ఆ కేసుల్లేవు: ఇన్సాకాగ్‌

కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

అత్యంత ఆందోళనకర రకం

కొత్త వేరియంట్‌కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని 'ఆందోళనకర వేరియంట్‌ (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)'గా వర్గీకరించి, 'ఒమిక్రాన్‌' అని పేరు పెట్టింది. కొద్దిరోజుల కిందటే 'వేరియంట్‌ అండర్‌ మానిటరింగ్‌'గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు శుక్రవారం ఉన్నతాధికారులు, నిపుణులతో డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించింది.

వ్యాప్తి తీవ్రత ఎలా ఉంది?

దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్‌ ప్రావిన్సులో ఈ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్థానిక వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ నమోదవుతున్న వాటిలో 90% కేసులకు ఈ వేరియంటే కారణమని చెబుతున్నారు. మరో ఎనిమిది ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్‌ వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది.

అంత భయమెందుకు?

బి.1.1.259 చాలా అసాధారణ వైరస్‌ ఉత్పరివర్తనాల కలయికగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీర రోగనిరోధక శక్తిని ఇది ఏమార్చి, విస్తృతంగా వ్యాపించవచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌కు గనుక వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల, లేదంటే మునుపటి డెల్టా కంటే తీవ్రంగా వ్యాపించే సామర్థ్యం ఉంటే.. మరోసారి కొవిడ్‌ ఉద్ధృతి తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఎందుకు భిన్నం?

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూసిన వేరియంట్ల కంటే బి.1.1.529 అత్యంత ప్రమాదకరమైనదని సీనియర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని, డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇవి రెట్టింపు అని వారు విశ్లేషించారు.

ఆందోళనకర వైరస్‌ల కంటే బి.1.1.529 వేగంగా వ్యాపిస్తున్నట్టు లెక్క తేలింది. దక్షిణాఫ్రికాలో బీటా, డెల్టా వేరియంట్లు వెలుగుచూసిన తర్వాత పాతిక రోజుల్లోపు మొత్తం కేసుల్లో వీటి వాటా 20%లోపే. ఇదే కాలంలో బి.1.1.529 కారక కేసులు 90% నమోదవుతున్నాయి.

Last Updated : Nov 27, 2021, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.