ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంభిస్తోంది: మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Jul 18, 2020, 6:04 PM IST

కేంద్ర ప్రభుత్వం అవసరమైన పథకాలకు నిధులు ఇవ్వకుండా నాన్చివేత ధోరణిని అవలంభిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆరోపించారు. మిషన్​ భగీరథ పథకంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిషన్​ భగీరథకు కేంద్రం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మంత్రి అన్నారు.

minister errabelli dayakar rao review on mission bhagiratha
కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంభిస్తోంది: మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ప్రశంసిస్తోన్న కేంద్రం... ఆ పథకాలకు నిధులు మాత్రం ఇవ్వడం లేదని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మిషన్ భగీరథపై ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి, ఇంజినీర్లు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న మిష‌న్ భ‌గీర‌థ పథ‌కం అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలుస్తుంద‌న్న జాతీయ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ డైరెక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ సాహోకి మంత్రి కృతజ్ఞ‌త‌లు తెలిపారు. 30 ఏళ్ల క్రితమే సిద్దిపేట ప్రజలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించిన సీఎం కేసీఆర్... అపర భగీరథుడిలా మిషన్ భగీరథ పథకానికి అంకురార్పణ చేశారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 23వేల 968 గ్రామీణ ఆవాసాలు, 120 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కు మిష‌న్ భ‌గీర‌థ ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అవుతోందని చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు 15వేల కోట్ల రూపాయలు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని దయాకర్ రావు అన్నారు. అవ‌స‌ర‌మైన ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వ‌కుండా, అన‌వ‌స‌ర‌మైన ప‌థ‌కాలకు ఇస్తూ కేంద్రం నాన్చివేత ధోర‌ణిని అవ‌లంభిస్తోందని ఆరోపించారు. చిన్నచిన్న‌ విష‌యాల‌పై రాద్ధాంతాలు చేసే రాష్ట్ర‌ భాజపా నేత‌లు ఇలాంటి ప‌థ‌కాల‌కు కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్ట‌వ‌చ్చు క‌దా అని మంత్రి ప్రశ్నించారు. భాజపా నేతలకు తెలంగాణ ప్ర‌జ‌లు.. ప్ర‌జ‌ల్లా క‌నిపించ‌డం లేదా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి... తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఏమాత్రం ప్రేమ ఉన్నా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆత్మ విమ‌ర్శ చేసుకొని... నిజంగా తెలంగాణ బిడ్డ‌లే అయితే రాష్ట్ర అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలని దయాకర్ రావు సూచించారు.


ఇవీ చూడండి: ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.