Bansilalpet StepWell Inauguration Today: భాగ్యనగర చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాలను.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రత్యేక చొరవతో పునరుద్ధరిస్తున్నాయి. బన్సీలాల్‌పేట్‌లో 3శతాబ్దాల క్రితం నిర్మించిన నాగన్నకుంట మెట్లబావికి కొత్త అందాలను అద్దారు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో అప్పట్లో ఈ కట్టడాన్ని నిర్మించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన మెట్లబావిని పునరుద్ధరించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా: సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మెట్లబావి పూర్వవైభవానికి చర్యలు చేపట్టింది. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8నెలలపాటు శ్రమించి.. రూపురేఖలు మార్చివేశారు. బావుల వద్ద ఆక్రమణల తొలగింపు, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు.
మన్ కీ బాత్‌లో మెట్లబావి ప్రస్తావన: బన్సీలాల్‌పేట్ మెట్లబావితోపాటు బాపూఘాట్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్, శివంబాగ్‌లోని మెట్ల బావులు మరమ్మతులు దాదాపుగా పూర్తయ్యాయి. భూగర్భజలాల సంరక్షణపై మన్ కీ బాత్‌లో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ ఈ బన్సీలాల్‌పేట మెట్లబావి గురించి ప్రస్తావించారు. చారిత్రక మెట్లబావికి పునర్వైభవం తీసుకొచ్చారని, కాలక్రమేణా మట్టి, చెత్తతో నిండిన ఆ బావి నేడు అలనాటి వైభవాన్ని చాటుతోందన్నారు.
"బన్సీలాల్ మెట్ల బావి పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇది ఒక టూరిజం స్థలం కింద బ్రహ్మడంగా తీర్చిదిద్దడం జరిగింది. దేశంతో పాటు ప్రపంచం మెచ్చేలా దీని పునరుద్దరించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్ మెట్ల బావిని ప్రారంభిస్తారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు." -తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి
ఇవీ చదవండి: బన్సీలాల్‌పెట్ మెట్ల బావి ప్రారంభానికి సిద్ధం.. ఓసారి రండి చూసొద్దాం
'కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం.. కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు'
సోమవారమే గుజరాత్ రెండో దశ పోలింగ్ తేలనున్న ప్రముఖుల భవితవ్యం