ETV Bharat / state

Friendship Day: మాటలకందని స్నేహ బంధం... ఎంతో మధురం..!

author img

By

Published : Aug 1, 2021, 4:39 AM IST

Updated : Aug 1, 2021, 4:47 AM IST

‘స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అంత కష్టమైన పని కాదు. కానీ ప్రాణాలు అర్పించేంత గొప్ప స్నేహితులను సంపాదించుకోవడం చాలా కష్టం’ ‘నవ్వు అన్నది ఇక నా జీవితాన ఒక గతం మాత్రమే అని నమ్మిన మనసుని మళ్లీ నవ్వేలా చేయగలిగినది స్నేహం మాత్రమే’... ఇలా స్నేహం గురించి ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా తక్కువే. అందుకే అన్నాడో కవి ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని...’ (ఈ రోజు స్నేహితుల దినోత్సవం)

Friendship
స్నేహ బంధం

‘కొంతకాలం కిందట... బ్రహ్మదేవుని ముంగిట... రెండు ఆత్మలు వేడుకున్నవి ఓ వరం... రూపురేఖలు వేరట... ఊపిరొకటే చాలట... ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం...’ అంటూ స్నేహబంధానికి ప్రాణం పోసిన సిరివెన్నెల పలుకులు అక్షరసత్యాలు... అందుకే ఆ వరం అందరికీ దొరకాలనీ ఆ స్నేహ మాధుర్యాన్ని అందుకోవాలన్న ఉద్దేశంతో దాని గుర్తుగా ఓ రోజు ఉండాలను కున్నాడు పరాగ్వేకి చెందిన ఆక్టర్‌ ఆర్టెమియో బ్రాచో. 1958 జులై 30న మిత్రుల్ని పిలిచి వేడుకలు జరిపించాడట కూడా. దీనికి ఐక్యరాజ్యసమితి సైతం ఆమోదముద్ర వేసింది. అమెరికన్‌ కాంగ్రెస్‌ మాత్రం ఆగస్టు తొలి ఆదివారాన్ని ‘మైత్రీ దినోత్సవం’గా ప్రకటించడంతో అనేక దేశాల్లో ఆ రోజునే ఉత్సవాలు జరుపుకోవడం, వాడుకలోకి వచ్చింది. కానీ దక్షిణ అమెరికాలో జులై 30వ తేదీనే ఈ వేడుకలు జరుపుకుంటారు. గ్రీటింగ్‌ కార్డుల వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో హాల్‌మార్క్‌ సంస్థాపకుడైన జాయ్స్‌ హాల్‌ 1920ల్లోనే ఈ వేడుకకి శ్రీకారం చుట్టాడట. కారణమేదయితేనేం... బొకేలతో శుభాకాంక్షలు చెప్పుకోవడంతో మొదలైన ఫ్రెండ్‌షిప్‌ డే, నేడు ఎన్నో రకాల పర్సనలైజ్‌డ్‌ వస్తువుల్నీ ఫ్రెండ్‌షిప్‌ ప్లాంట్‌గా పిలిచే జేడ్‌ మొక్కనీ కానుకలుగా ఇచ్చిపుచ్చుకునే వేడుకగా మారిపోయింది.

ఫ్రెండ్ షిప్ డే గ్రీటింగ్‌ కార్డులు

అది... స్నేహితుల ఊరు!

బెస్టీ రో

స్నేహమే నా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నది ఆ నలుగురు స్నేహితులకీ బాగా అర్థమైనట్లుంది... తమ స్నేహం చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ తమకోసం ప్రత్యేకంగా ఓ చిన్న గ్రామాన్నే ఏర్పాటుచేసుకున్నారు. అమెరికాలోని ఆస్టిన్‌ శివార్లలోని లానో నది దగ్గర ‘లానో ఎగ్జిట్‌ స్ట్రాటజీ’ పేరుతో ఒకే వరసలో నాలుగు చిన్న ఇళ్లతోపాటు అందరూ కలిసి వండుకునేలా అక్కడే ఓ కమ్యూనల్‌ హోమ్‌నీ కట్టించు కున్నారట. ‘ఆస్టిన్‌ అమెరికన్‌ స్టేట్స్‌మన్‌’ పత్రికకి ఎడిటర్‌గా పనిచేసిన ఫ్రెడ్‌ జిప్‌, నగర జీవితంతో విసిగిపోయి స్నేహితులతో ప్రశాంతంగా గడపాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఇరవయ్యేళ్ల నుంచీ తనతోనే ఉన్న ప్రాణ స్నేహితులతో చెప్పగా అందరూ ఓకే అన్నారట. దాంతో వారాంతాల్లోనే కాకుండా రిటైరయ్యాక కూడా కలిసి జీవించేలా ఇళ్లను కట్టించు కోవాలనుకున్నారట. పచ్చని మొక్కల మధ్యలో నదికి దగ్గరగా ఉన్న ఓ ప్రదేశం నచ్చడంతో అక్కడ స్థలాన్ని కొని, కేవలం నాలుగు వందల చదరపు అడుగుల స్థలంలో చిన్న ఇళ్లను కట్టించుకున్నారట. వర్షం నీళ్లు ట్యాంకుల్లోకి వెళ్లేలా వీటిని డిజైన్‌ చేయించడంతో పర్యావరణప్రియుల్నీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నగా ముద్దుగా ఉన్న ఈ ఇళ్లు ‘బెస్టీ రో’గానూ ప్రాచుర్యం పొందాయి.

స్నేహంతోనే ఆరోగ్యం!

స్నేహితుల దినోత్సవం

మంచి మిత్రుల వల్ల ఆనందంగానే కాదు, ఒత్తిడిపోయి మానసికంగానూ శారీరకంగానూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి తాజా పరిశీలనలు. స్నేహితుల ఆనందాన్ని కోరుకునేవాళ్లు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటారట. 70 దాటాక కూడా స్నేహితులు ఎక్కువగా ఉండేవాళ్లు లేనివాళ్లకన్నా 22 శాతం ఎక్కువకాలం జీవిస్తున్నట్లు ఫ్లిండర్స్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

* కొందరు కొత్తవాళ్లతో త్వరగా కలిసిపోతారు. స్నేహం కుదిర్చేసుకుంటారు. కానీ ఎవరితోనైనా స్నేహం చేయడానికి కనీసం 50 గంటలైనా పడుతుందట. వాళ్లు మంచి స్నేహితులుగా మారడానికి కనీసం 200 గంటలయినా కావాలని సోషియాలజిస్టులు
చెబుతుంటారు. కానీ లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌లానే స్నేహానికీ ఓ కెమిస్ట్రీ ఉంటుంది. తొలి పరిచయంతోనే కొందరు స్నేహితులుగా మారడానికి అదే కారణమట. అంతెందుకు... పసివాళ్లు కూడా చేతులు చాచిన అందరి దగ్గరకూ వెళ్లరు. కొందర్ని చూసినప్పుడే నవ్వుతూ వెళతారు. అంటే- వాళ్లను చూడగానే కలిగిన భావమే స్నేహం. కాబట్టి స్నేహం కూడా ప్రేమ లాంటి భావోద్వేగమే అంటున్నారు చికాగో పరిశోధకులు.

* స్త్రీ-పురుషుల స్నేహం కొన్ని సందర్భాల్లో ప్రేమకీ పెళ్లికీ దారితీయడం తెలిసిందే. అయితే అది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చినదా అన్నది పక్కన పెడితే, అన్యోన్యంగా ఉండే జంటల్లో అంతర్లీనంగా ఉండేది గాఢ స్నేహమే అన్నది మరో పరిశోధన సారాంశం.

* ‘నీవు లేక నేను లేను’ అన్నట్లు ఉండే స్నేహితుల డీఎన్‌ఏ ఒక శాతం ఒకేలా ఉంటుందట. అందుకే వాళ్ల ఆలోచనలూ అభిప్రాయాలూ దగ్గరగా ఉంటుంటాయి. అంతేకాదు, కొందరు స్నేహితుల జంటల్ని చూసినప్పుడు వాళ్లు అక్కాచెల్లెళ్లో అన్నాతమ్ముళ్లో అనిపిస్తుంటుంది. డీఎన్‌ఏలో సామ్యం కారణంగానే పోలికలు కూడా కలుస్తాయని యేల్‌ యూనివర్సిటీ పరిశీలనలు చెబుతున్నాయి.

పాతికేళ్ల డ్రస్సు బంధమిది!

గొప్ప దోస్తులే!

మధ్య తల్లీకూతుళ్లూ అక్కాచెల్లెళ్లూ భార్యాభర్తలూ... ఇలా అందరూ ట్విన్నింగ్‌ పేరుతో ఏదో ఒక సందర్భంలో మ్యాచింగ్‌ దుస్తుల్ని ధరించడం తెలిసిందే. కానీ ఇవేమీ తెలియనినాటి నుంచీ వాళ్లిద్దరూ ఒకే దుస్తుల్ని ధరిస్తున్నారు. అలాగని ఒకటీ రెండు రోజులు కాదు, ఏకంగా 25 ఏళ్లుగా ఆ ఇద్దరు మిత్రులు ఒకే రకమైన డ్రస్సులు వేసుకుంటూ ‘మా స్నేహబంధం ఎంతో గొప్పది’ అంటున్నారు. కేరళలోని అలప్పుళ జిల్లాలోని కాయంకుళం పట్టణంలో ఉండే రవీంద్రన్‌ పిళ్లై, ఉదయకుమార్‌ అనే ఇద్దరు మిత్రులూ 1982లో మొదటిసారి కలిశారట. ఆనాటి పరిచయం కొద్దికాలంలోనే గాఢ స్నేహంగా మారింది. అంతే... అప్పటివరకూ వేరువేరు టైలర్‌షాప్స్‌ నడుపుకునే ఈ ఇద్దరు 1988 నుంచి ‘పీకే టైలర్స్‌’ పేరుతో ఒకే టైలరింగ్‌ షాప్‌ మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఒకే రంగున్న డ్రస్సులు వేసుకుంటూ తమ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. దాంతో వీళ్ల సంగతి ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకీ పాకి, పత్రికలకీ ఎక్కింది. గొప్ప దోస్తులే కదూ!

దోస్త్‌ మేరా దోస్త్‌!

జంతువులతో స్నేహం చేయడం మాత్రం అరుదు

జంతువులు మనుషులతో స్నేహంగా మెలగడం సహజమే కానీ, వేరే జంతువులతో స్నేహం చేయడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. అదీ మనిషి ప్రమేయం లేకుండానే అవి స్నేహంగా ఉండటం వింతగానే అని పిస్తుంది. దక్షిణ కరొలినాలోని మిర్టిల్‌ బీచ్‌ సఫారీలో బబుల్‌ అనే ఏనుగూ, బెల్లా అనే కుక్కా నీళ్లలో ఆడుకోవడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. తల్లి, తండ్రి ఏనుగులు చనిపోవడంతో ఆఫ్రికా నుంచి ఈ సఫారీకి వచ్చింది బబుల్స్‌. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌ కట్టే సమయంలో ఓ కాంట్రాక్టర్‌ బెల్లాను తీసుకువచ్చి అక్కడే వదిలేశాడట. అప్పటినుంచీ ఆ రెండింటికీ ఎలాగో దోస్తీ కుదిరింది. బబుల్‌ ఎక్కడికి వెళితే అక్కడికే బెల్లా వెళుతుందట. బబుల్స్‌కి నీళ్లలో మునకలేయడం, నీళ్లతో ఆడటం ఇష్టం. దాంతో బెల్లా కూడా నీళ్లలోకి దూకేదట. అలా రెండూ కలిసి నీళ్లలో గంటల తరబడి ఆడుకుంటాయట. బబుల్స్‌ టెన్నిస్‌ బాల్‌ను తొండంతో విసిరితే బెల్లా పరిగెత్తుకు వెళ్లి తీసుకొస్తుంటుంది. నీళ్లలో ఈదేటప్పుడు బెల్లా బబుల్స్‌ మీదెక్కి నీళ్లలోకి దూకే విన్యాసాలు చూడాల్సిందే!

మిత్తరికం చేద్దామా!

మిత్తరికం

చిన్నప్పుడో పెద్దయ్యాకనో కొన్ని పరిచయాలు స్నేహానికి దారితీస్తుంటాయి. అలా అందరికీ ఒకరో ఇద్దరో ప్రాణ స్నేహితులు ఉంటారు. కానీ శ్రీకాకుళం- ఒడిశా సరిహద్దు ప్రాంతాలవాళ్లు స్నేహం చేసే తీరు విచిత్రంగా ఉంటుంది. పెళ్లి పేరుతో రెండు కుటుంబాలు చుట్టరికం కలుపుకున్నట్లే అక్కడివాళ్లు తమకు నచ్చినవాళ్లతో ‘మిత్తరికం’ కలుపుకుంటారు. అలా స్నేహం కుదుర్చుకున్న మిత్రులే కాదు, వాళ్ల కుటుంబాలూ తరతరాలకీ కలిసే ఉంటాయి. ఇంట్లో శుభమైనా అశుభమైనా మిత్తరికం కలుపుకున్నవాళ్లు నాలుగు రోజులు ముందేవచ్చి కుటుంబసభ్యులతో సమానంగా అన్ని పనుల్లోనూ పాలుపంచుకుంటారు. ఇంటికి వచ్చిన బంధువులకి ఈమె మా మిత్తమ్మ, మిత్తక్క అంటూ పరిచయం చేస్తారు. పూర్వకాలంలో వస్తుమార్పిడిలో భాగంగా- అంటే, అవసరార్థం ఈ సంప్రదాయం మొదలైందట. తమ దగ్గర పండినవి మరోప్రాంతానికి తీసుకెళ్లి, అవి ఇచ్చి అక్కడ పండినవి తెచ్చుకునే క్రమంలో నమ్మకం కుదిరినవాళ్లతో స్నేహం చేసేవారట. అలాగని నేస్తాన్ని ఎంచుకున్నాక మాటవరసకి ‘మనం మిత్రులం’ అనుకోకుండా, ఒకరి చేతిలో ఒకరు చేయ్యేసి పూలూ పండ్లూ మార్చుకుని నిశ్చితార్థంలా చేసుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవరు స్నేహం చేసినా ఇలాగే నేస్తరికం వేడుకలు జరుపుకుంటారట. కరెన్సీ వాడుకలోకి వచ్చిన ఈ రోజుల్లోనూ అక్కడ ‘మిత్తరికం’ కొనసాగుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.

ఫ్రెండ్స్

స్నేహమంటే ఆనందంగా ఉన్నప్పుడు భుజంమీద చెయ్యేసి మాట్లాడడమే కాదు, కష్టంలో ఉన్నప్పుడు భుజం తట్టి నేనున్నానని చెప్పడం కూడా.

ఇవీ చూడండి: Two Friends Story: చిన్ననాటి మిత్రుడు... చెలిమిని మరిచిపోలేదేనాడు..

Friendship: స్నేహ బంధానికి టెక్నాలజీ వేదికైతే..!

Last Updated :Aug 1, 2021, 4:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.