ETV Bharat / state

కుటుంబ పోషణ కోసం కూలి పనులకు విద్యావంతులు

author img

By

Published : May 11, 2020, 12:29 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూసివేయడం వల్ల అందులో పనిచేసే వారు ఉపాధి కోల్పోయారు. కుటుంబపోషణ కష్టంగా మారడం వల్ల సొంతూళ్లకు వెళ్లి అక్కడ ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్నారు. వీరిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం గమనార్హం. బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు మొదలుకొని బీటెక్‌, పీజీ చేసిన వారు సైతం ఉపాధి హామీ పనులకు అధిక సంఖ్యలో వస్తున్నారు.

Educated persons going to Wage working for family nutrition in telangana
కుటుంబ పోషణ కోసం కూలి పనులకు విద్యావంతులు

ప్రైవేట్‌ కళాశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని నర్సులు, పెద్ద రెస్టారెంట్లలో పనిచేసేవారు.. ఇలా అనేక వర్గాల వారు ఊళ్లకు వెళ్లి ఉపాధి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఉపాధి హామీ కూలిని రోజుకు రూ.211 నుంచి రూ. 237కు పెంచింది. దీనికి వేసవి భత్యం కలిపితే ఇంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జాబ్‌కార్డులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేస్తుండడం వల్ల ఉపాధి కూలీలుగా నమోదవడం సులువుగా మారింది. ఏప్రిల్‌ 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీల సంఖ్య 3.36 లక్షలు కాగా, మే 7న చూస్తే ఏకంగా 22.50 లక్షల మంది ఉండడం గమనార్హం.

ఆచార్యుడు.. హమాలీగా

కరీంనగర్‌ జిలా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ గ్రామం రాములపల్లెకు చెందిన తోడేటి అనిల్‌ ఎంటెక్‌ పూర్తి చేశారు. ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో సహాయ ఆచార్యునిగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనికి కుదిరారు.

రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి.. రెండు నెలల కిందట వరకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకునిగా పని చేశారు. రూ.20 వేల వరకు వేతనం వచ్చేది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కమలాపూర్‌ మండలంలోని తన సొంతూరు గునిపర్తిలో ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు.

హోటల్‌ మేనేజ్‌మెంటు పూర్తి చేసిన భిక్షపతి హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంటులో పనిచేసేవారు. నెలకు పాతిక వేల జీతం. లాక్‌డౌన్‌ వల్ల హోటళ్లు మూతపడడంతో ఉపాధి కరవైంది. దీంతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని తన సొంతూరు రత్నగిరికి వచ్చారు. విధి లేక ఉపాధి కూలీగా పని చేస్తున్నారు.

రమేశ్‌ ఎంకాం, ఆంగోతు సురేశ్‌ బీఈడీ, వసంత బీకాం, బీఈడీ, కోటేశ్వరరావు బీఏ, బీఈడీ, శైలజ బీకాం, బీఈడీ పూర్తి చేశారు. వీరంతా ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మండలం పోలవరం విజయలక్ష్మినగర్‌ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు.

ఇవీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.