ETV Bharat / state

Disha case: దిశ ఎన్‌కౌంటర్‌ బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించండి: త్రిసభ్య కమిషన్‌

author img

By

Published : Aug 26, 2021, 1:19 AM IST

'దిశ' నిందితుల ఎన్​కౌంటర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు ఏమవుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కొంతకాలం తర్వాత ఆ కుటుంబంలో ఒకరు మరణించడంతో 'దిశ' మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. బాధిత కుటుంబాలు త్రిసభ్య కమిషన్(సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ)ను ఆశ్రయించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పోలీసులే తమను హతమార్చేందుకు యత్నించారనే ఆరోపణతో... 'దిశ' కేసులో అసలేం జరుగుతోందనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది.

disha-encounter-victims-in-front-of-sirpurkar-commission
disha-encounter-victims-in-front-of-sirpurkar-commission

DISHA: మృతుల కుటుంబాలకు భద్రత కల్పించాలి: సిర్పూర్కర్‌ కమిషన్

'దిశ' ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని సిర్పూర్కర్‌ కమిషన్ ఆదేశించింది. 2019లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ఎదుట హాజరుకావద్దని పలు రకాల బెదిరింపులు వస్తున్నాయని బాధితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది పీవీ కృష్ణమాచారి కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఆవరణలో ఉన్న కమిషన్ ఎదుట రేపట్నుంచి దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరిగాయి. తమపై పోలీసులు హత్యా ప్రయత్నం, వేధింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నాలుగు బాధిత కుటుంబాలు వాపోయాయి. 25 లక్షల రూపాయలు ఇస్తామంటూ... కేసు ఉపసంహరించుకోవడమే కాకుండా త్రిసభ్య కమిషన్ ఎదుట విచారణ హాజరుకాకుండా ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.

సాక్ష్యం చెబితే చంపేస్తామంటూ తరచూ బెదిరింపులు వస్తున్నాయని, వారంతా షాద్‌నగర్‌ పోలీసులుగా తాము అనుమానిస్తున్నామని కమిషన్ ఎదుట బాధితులు వివరించారు. ఈ నెల 21న దేవరకద్ర ఆసుపత్రి వద్ద రాజయ్యపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. సాక్షి కుర్మప్పకు పట్టిన గతే మీకూ పడుతుందంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దిశ ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలతో పాటు కేసు వాదిస్తున్న న్యాయవాదులకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరగా... స్పందించిన సిర్పూర్కర్ త్రిసభ్య కమిషన్.. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించిందని న్యాయవాది కృష్ణమాచారి తెలిపారు.

రక్షణ కల్పించాలి..

రక్షణ కల్పించాలి..

ఈ నెల 21వ తేదీన ఆసుపత్రి నుంచి నేను బయటకు వెళ్తున్నా. వెళ్తుంటే వెనుక బండి వచ్చింది. ఏదో చూడక వస్తున్నడులే అనుకున్నా. అలా జరిగినా కూడా మళ్లీ తిప్పుకుని నా వెనుక వచ్చాడు. వచ్చి కుర్మప్పకు ఏ గతి పట్టిందో.. నీకు కూడా అదే గతి పడుతది అన్నడు. అలా అనగానే నేను అక్కడి నుంచి జనాల్లోకి వెళ్లిపోయా. అక్కడ చాలా మంది జమ అయ్యారు. కొందరు ఆ బండి నంబర్​ రాసుకోండి అన్నారు. కానీ ఆ బండికి నంబర్​ ప్లేట్​ లేదు. మాకు ప్రాణరక్షణ కావాలి. షాద్​నగర్​ పోలీసులే అని మాకు అనుమానం కలుగుతున్నది. మా కుటుంబాలతో పాటు లాయర్లకు కూడా రక్షణ కల్పించాలి. -రాజయ్య, దిశ ఎన్‌కౌంటర్ మృతుడు శివ తండ్రి

ఇదీ చదవండి: Disha Case: తొలిరోజు ముగిసిన విచారణ.. 26 నుంచి మరోసారి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.