తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్‌లో పడుకుని రాష్ట్రాన్ని పోలీసులకు అప్పగించారని ఆయన దుయ్యబట్టారు. కరోనాను అరికట్టడం చేతకాని ప్రభుత్వం.. ఉద్యమకారులను పోలీసులతో గృహ నిర్బంధం చేస్తోందని మండిపడ్డారు. సచివాలయం కూల్చివేత కోసం హైదరాబాద్ సగం నాఖాబంది విధించిందని వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి టిమ్స్‌ను కరోనా రోగుల కోసం వెంటనే వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆందోళనకు పిలుపునిస్తే తమను పోలీసులు గృహ నిర్బంధించడం సరికాదని మండిపడ్డారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం వల్ల గవర్నరే జోక్యం చేసుకుని అధికారులతో చర్చిస్తున్నారని నారాయణ అన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకంటే మరొక అవమానకరం లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు