దేశంలో కొవిడ్ కొత్త పుంతలు తొక్కుతోంది. వైరస్ అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందుతోంది. కొత్త ఉత్పరివర్తనాల వల్లనే వ్యాప్తి అధికంగా ఉంటోందని ఆరోగ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే డబుల్ మ్యుటెంట్ వైరస్ వ్యాప్తితో కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే కొత్తగా ట్రిపుల్ మ్యుటెంట్ వెలుగులోకి రావడం శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశమైంది. ప్రత్యేకమైన జన్యువుతో, రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే కొత్త ఉత్పరివర్తనతో బి.1.618గా రకం వైరస్ పశ్చిమ బంగాల్‌లో వ్యాప్తిలో ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న మహారాష్ట్ర, దిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్ వేరియంట్‌గా చెప్పుకొనే డబుల్ మ్యుటెంట్ బి.1.617 రకం ఎక్కువ శాతం ఉంది.
రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం ఉండడం వల్ల ఇది ఎక్కువ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వ్యాధి కారక కీలక స్పైక్ ప్రొటీన్ భాగంలో ఈ484క్యూ, ఎల్452ఆర్ రెండు ఉత్పరివర్తనాలతో కలిసి ఏర్పడటంతో డబుల్ మ్యుటెంట్ అంటున్నారు. ఈ484క్యూ మ్యుటేషన్ యూకే, దక్షిణాఫ్రికా నుంచి, ఎల్452ఆర్ మ్యుటేషన్ కాలిఫోర్నియా నుంచి వ్యాపించాయి. ఈ రెండూ కలిసి దేశీయంగా డబుల్ మ్యుటెంట్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది శరీర కణాలతో ఎక్కువగా అతుక్కుపోయే, రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉందని భావిస్తున్నారు.
తాజాగా బయటపడిన ట్రిపుల్ మ్యుటెంట్ బి.1.618 రకం వైరస్‌లో స్పైక్ ప్రొటీన్‌లో ఈ484కే, డీ614జి రకాలను కలిగి ఉండటంతో కొత్త లక్షణాలతో సంక్రమణ సామర్థ్యాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని దిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ఇది మరింత వేగంగా వ్యాపించగల రకం అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వైరస్‌పై 'కొవాగ్జిన్' 78 శాతం ప్రభావవంతం