చమురు ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేసేందుకే తామంతా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్లినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేయడం కోసం గుర్రపు బండ్లపై వెళ్లినట్లు చెప్పారు. కానీ తమను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ గాంధీ భవన్ నుంచి గుర్రపు బండ్లల్లో అసెంబ్లీకి వెళ్లారు. అనుమతించకపోవడంతో అక్కడ బైఠాయించి ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్టు చేసి విడుదల చేసిన తర్వాత గాంధీ భవ్లో మీడియాతో మాట్లాడిన వారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
ప్రభుత్వం అప్రజస్వామిక చర్యలకు పాల్పడుతోంది. ప్రభుత్వ ఆగడాలను, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. సభకు ఎలా వెళ్లాలి అనేది సభ్యుల ఇష్టం. అరెస్టులపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు సమాధానం చెప్పాలి. రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందనే.. ప్రభుత్వానికి చెప్పడం కోసమే గుర్రపు బండ్లపై వెళ్లాం. మద్దతివ్వాల్సింది పోయి అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
నూతన సాగు చట్టాలతో రైతులకు రక్షణ ఉండదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర నిర్ణయించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. దీంతో రైతులతో పాటు వినియోగదారులకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం చెబుతున్నా.. కేంద్ర వైఖరికి నిరసనగా తెరాస భారత్ బంద్‌లో ఎందుకు పాల్గొనలేదు.? రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. చమురు, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా గుర్రపు బండిపై అసెంబ్లీ సమావేశాలకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. దీనిపై శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెడతాం. -కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సామాన్యుల నడ్డి విరిచే విధంగా కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తమను.. ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. కేవలం పెట్టుబడీదారి వ్యవస్థను బతికించడం కోసమే ప్రజలు, రైతులను కేంద్రం మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ సమయంలో విపక్షాలకు మద్దతుగా నిలవాల్సిన ప్రభుత్వం.. అడ్డుకోవడమేంటని దుయ్యబట్టారు. ఎలాంటి చర్చలు లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు తీర్మానం చేయలేదో కేసీఆర్ చెప్పాలి. చమురు ధరలు పెరిగితే మాకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకుంటోంది. కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా.. ప్రభుత్వాలు తగ్గించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను ఇంకా కష్టాల ఊబిలోకి నెడుతున్నాయి. -సీతక్క, ములుగు ఎమ్మెల్యే
ఇదీ చదవండి: Revanth Reddy Fires on modi and kcr: 'మోదీ మాయలో కేసీఆర్.. అందుకే రైతు ఉద్యమంలో యూ టర్న్'