ETV Bharat / state

BRS On Revanth Reddy Comments : 'అన్నదాతలు బాగుపడుతుంటే కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోంది'

author img

By

Published : Jul 13, 2023, 7:32 PM IST

BRS Protest Against Revanth Reddy : సాగుకు నిరంతర విద్యుత్‌ అవసరం లేదని...మొత్తంగా 8 గంటలు ఇస్తే చాలంటూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీఆర్‌ఎస్‌ రెండో రోజూ ఆందోళనలు చేపట్టింది. ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలతో గులాబీ శ్రేణులు హోరెత్తించారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఆందోళనల్లో పాల్గొని... రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు. అన్నదాతలు బాగుపడుతుంటే కాంగ్రెస్‌ ఓర్వలేకపోతోందని విమర్శించారు.

BRS On Revanth Reddy Comments
BRS On Revanth Reddy Comments

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రెండోరోజూ బీఆర్‌ఎస్ ఆందోళనలు

BRS Fires On Revanth Comments : వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా అంశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే భారత్ రాష్ట్ర సమితి ధర్నాను.. కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం.. అరెస్టులకు దారి తీసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతులకు నిరంతరాయ విద్యుత్ ఎందుకు అని రేవంత్‌రెడ్డి మాట్లాడడం దారుణమని ఆమె అన్నారు.

బెల్లంపల్లిలోని కన్నాల జాతీయ రహదారిపై.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లతో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని సబ్‌స్టేషన్ వద్ద రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ఆధ్వర్యంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

మహబూబాబాద్‌ జిల్లాలోని సబ్‌స్టేషన్ల ముందు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. భువనగిరి ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసనలో స్థానిక ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కష్టాలను తీర్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ధాన్యం అమ్ముకోవడానికి గతంలో అన్నదాతలు.. ఎన్నో కష్టాలు పడేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కర్షకులకు ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం, గ్రామాల్లో ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి.. వడ్లు కొనుగోళ్లు చేస్తున్నామని.. డబ్బులు కూడా వెంటనే అందుతున్నాయని శేఖర్‌రెడ్డి వివరించారు.

BRS Protest Against Revanth Reddy : సాగుకు 10 గంటలు కూడా విద్యుత్‌ ఇవ్వడం లేదన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన సవాల్‌కు.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పందించారు. ఈ క్రమంలోనే తన రాజీనామా పత్రంతో ప్రతి సవాల్‌కు దిగారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. మహబూబ్‌నగర్‌లోని విద్యుత్ భవనం ముందు బీఆర్ఎస్ ఆధ్యర్యంలో చేపట్టిన ధర్నాలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే రేవంత్‌ ఓర్వలేక పోతున్నారని ఆయన ఆరోపించారు.

BRS On Revanth Reddy Comments : కొడంగల్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో.. రేవంత్‌రెడ్డి ఫోటోను ఎత్తుకెళ్లిన అభిమానిని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్, శంకర్‌పల్లి చౌరస్తాలో బీఆర్ఎస్‌ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఇవీ చదవండి: KTR Fires on Congress : '24 గంటల వెలుగులు వదులుకొని.. కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా'

BRS on Congress Comments : 'రైతుల శత్రువు కాంగ్రెస్.. ఫ్రీ కరెంట్​పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.