ETV Bharat / state

BJP Leaders about Rosaiah: 'పార్టీలు వేరైనా కలిసి పనిచేయడం రోశయ్య నైజం'

author img

By

Published : Dec 4, 2021, 2:20 PM IST

Condolences towards Rosaiah death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల భాజపా నేతలు సంతాపం ప్రకటించారు. రోశయ్యతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, హరియాణా గవర్నర్​ దత్తాత్రేయ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​, మాజీ ఎంపీ వివేక్​.. మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న రోశయ్య.. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని కిషన్​ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రోశయ్య సంయమనంతో వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు.

Condolences towards Rosaiah death
రోశయ్య మృతి పట్ల భాజపా నేతల సంతాపం

రోశయ్య మృతి పట్ల భాజపా నేత ఈటల రాజేందర్​ సంతాపం

Condolences towards Rosaiah death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఆయనకు నివాళులర్పిస్తూ కిషన్​ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోశయ్య అజాతశత్రువుగా వ్యవహరించారని కేంద్ర మంత్రి అన్నారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. పార్టీలు వేరైనా కలిసి పనిచేయడం ఆయన నైజం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అవగాహన ఉన్న వ్యక్తి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో వివిధ హోదాల్లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా రోశయ్య పని చేశారు. పార్టీలు వేరైనా శాసన సభలో వివిధ అంశాలపై చర్చకు వచ్చినప్పుడు ఆయన హుందాగా సమాధానాలు చెప్పేవారు. ఆర్థిక పరమైన అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. చలోక్తులు విసురుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో చెబుతూ హుందాతనంతో సభను నడిపేవారు. -కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి

దత్తాత్రేయ నివాళులు

రోశయ్య మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సానుభూతి తెలియజేశారు. మంచి రాజకీయవేత్త, వక్త, గొప్ప ఆర్ధిక వేత్త, మృదు స్వభావి అని కొనియాడారు. ఒక సన్నిహితుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కీలక పాత్ర: ఈటల

Ex CM rosaiah death: డిసెంబర్‌ 9 ప్రకటన వెలువడటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రోశయ్య కీలకంగా వ్యవహరించారని హుజూరాబాద్​ ఎమ్మెల్యే, భాజపా నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందంటూ ఆశలు రేకెత్తించారని గుర్తుచేశారు. అమీర్​ పేట్​లోని రోశయ్య నివాసంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన ఈటల.. ప్రజాప్రతినిధుడిగా రోశయ్య ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎంగా ఉన్న రోశయ్య... ఉద్రిక్తతలకు దారి తీయకుండా సంయమనంతో వ్యవహరించారని ఈటల కొనియాడారు. రోశయ్య ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చారని అన్నారు. ఆయనను చూసి ఈ తరం నాయకులు ఎంతో నేర్చుకోవాలని సూచించారు. రోశయ్య అనుభవం, ఉపన్యాసాలు యువతకు మార్గదర్శకంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

హుందాతనంగా..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో విద్యార్థులు ధర్నా చేయకుండా పోలీసులు అడ్డుకుంటే.. రోశయ్య డీజీపీకి ఫోన్ చేసి అనుమతి ఇప్పించారు. డిసెంబరు 9, 2009న అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన నేపథ్యంలో రోశయ్య.. కేసీఆర్‌ చేత దీక్ష విరమింపచేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని చెప్పి ప్రజల్లో ఆశలు చిగురింపజేశారు. సీఎంగా, గవర్నర్‌గా పనిచేసినా హుందాతనం చూపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్రిక్తతలకు దారి తీయకుండా సమన్వయంతో వ్యవహరించారు. -ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

మాజీ ఎంపీ వివేక్​ నివాళులు

Rosaiah death news: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య పేరు సంపాదించారని మాజీ ఎంపీ జీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామితో రోశయ్యకు బాగా పరిచయం ఉండేదని గుర్తు చేసుకున్నారు. రోశయ్య నివాసానికి వచ్చిన వివేక్... ఆయనకు నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడమని తమను ప్రోత్సహించారని వివేక్​ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Konijeti Rosaiah passed away : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.