ETV Bharat / state

R Krishnaiah: 'బీసీ కుల గణన చేపట్టపోతే ఉద్యమిస్తాం'

author img

By

Published : Sep 29, 2021, 6:04 PM IST

Updated : Sep 29, 2021, 6:59 PM IST

బీసీల్లో కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్ చేశారు. త్వరలోనే కలెక్టరేట్, తహసీల్దార్ల కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతామని వెల్లడించారు. హైదరాబాద్ లక్డికాపూల్​లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో నిర్వహించిన అఖిలపక్ష, బీసీ కులసంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

bc welfare president r krishnaiah
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య

జనాభా లెక్కల్లో బీసీల కుల గణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కుల గణన కోసం అవసరమైతే రాష్ట్ర బంద్‌ కూడా నిర్వహిస్తామని అయన స్పష్టం చేశారు. బీసీ గణన చేపట్టాలని కోరుతూ త్వరలోనే కలెక్టరేట్, తహసీల్దార్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతామని వెల్లడించారు. హైదరాబాద్ లక్డికాపూల్​లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బీసీల కుల గణనపై సమావేశం

జన గణనలో బీసీ కులాల లెక్కలు తీయాలని ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో అఖిలపక్ష, బీసీ కులసంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాజపా బీసీల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి రాగానే బీసీ కులాల గణనను కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి ఎల్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.

బీసీల పట్ల భాజపా వ్యతిరేకత

భాజపా రెండోసారి అధికారంలోకి రాగానే బీసీ గణనను గాలికొదిలేసిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య విమర్శించారు. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖలేదని ఆయన మండిపడ్డారు. సమాజంలో ఎక్కువభాగం ఉండే బీసీలకు బడ్జెట్​లో కేవలం 1000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు. బీసీ గణన చేయాలని కేంద్రాన్ని 19 పార్టీలు కలిసినప్పటికీ వారిలో ఏమాత్రం చలనం లేదన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. తమ హక్కులను మాత్రమే అడుగుతున్నామన్నారు.

bc
ఖిలపక్ష, బీసీ కులసంఘాల సమావేశం

ఎవరికీ లేని క్రీమిలేయర్ తమకెందుకు అని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీసీలు 54శాతం ఉన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు కానీ.. ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అన్నీ ప్రైవేట్ పరం అయితే బీసీలకు ఉద్యోగాలు ఉండవని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలంతా కులాలను పక్కనపెట్టి బీసీ కులంగా ముందుకెళ్లాలని వీహెచ్ పిలుపునిచ్చారు.

బీసీ గణన కోసం ఐకమత్యంగా ఉద్యమం చేయాలని మాజీ మంత్రి ఎల్.రమణ పిలుపునిచ్చారు. అందుకోసం రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలు తిరిగేందుకు అయ్యే ఖర్చులో తనవంతుగా రూ.లక్ష అందజేస్తానన్నారు. బీసీ కులగణన కష్టమైంది కాదు.. క్లిష్టమైంది కాదని...చాలా సులభమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సామాజిక స్థాయిలో సమాజం పరిఢవిల్లాలంటే కులగణన ముఖ్యమైందన్నారు.

కేంద్రం బీసీల కులగణనపై కాలయాపన చేస్తోంది. చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వరు. బీసీల కుల గణన చేయరు. అన్ని రంగాల్లో బీసీలను దగా చేస్తున్నరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లను తీసేసే కుట్ర జరుగుతోంది. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతున్నాం. మా హక్కును మేం కాపాడుకునేందుకు దశలవారీగా ఉద్యమం చేపడుతాం. - ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

గతంలో మనం అనేక ఉద్యమాలు చేశాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కూడా. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితిని సమీక్షించాలి. బీసీల కోసం ప్రత్యేక యాక్షన్​ ప్లాన్ తయారు చేయాలి. దేశంలో ఏస్థాయిలో జరిగినా బీసీల కుల గణన తప్పనిసరి. - ఎల్.రమణ, మాజీమంత్రి

ప్రతి కులం కూడా తమ సమస్యలపై కోట్లాడుతున్నరు. కావున మీరు లెక్కించమాత్రాన ఇవేమీ ఆగవు. దేశంలో ఉన్న గుప్పెడు మందికి తప్ప ఎవరికీ ఇదీ సమస్య కాదు. బీసీల కులగణన చాలా సులభమైన ప్రక్రియ. కేంద్రం దీనిపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలన కోరుతున్నా.- కోదండ రాం. తెజస అధ్యక్షుడు

బీసీల్లో మార్పు వచ్చింది. అన్నీ ప్రైవేట్ పరం చేస్తే మనకు ఉద్యోగాలుండవు. అధిక జనాభా ఉన్న బీసీల కోసం ఉద్యమం జరగాలి. బీసీల కోసం బీసీ గర్జన జరగాలని ఇప్పటికే సూచించా. మనమందరం కలిసికట్టుగా పోరాడాలి.- వీహెచ్​, మాజీ రాజ్యసభ సభ్యుడు.

ఇదీ చూడండి: R.KRISHNAIAH: 'ఈ నెల 8న బీసీ సమర శంఖారావం'

Last Updated :Sep 29, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.