Bandi Sanjay On Junior Panchayat Secretaries : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమ్మె చేస్తున్న జేపీఎస్, ఓపీఎస్‌ల ఇండ్ల వద్దకు, సమ్మె చేస్తున్న ప్రాంతాలకు వెళ్లి పూర్తిస్థాయిలో సంఘీభావం తెలపాలని కోరారు. జేపీఎస్‌ల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పక్షాన క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వారి సమ్మెకు మద్దతుగా ఇతర శాఖల ఉద్యోగులను భాగస్వాములను చేసి జేపీఎస్‌లు ఒంటరి కాదనే సంకేతాలను పంపాలని సూచించారు.
ప్రభుత్వం మోసం చేస్తోంది: పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో బండి సంజయ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపే అంశంతోపాటు ఈనెల 11న సంగారెడ్డిలో నిర్వహించే నిరుద్యోగ మార్చ్, 14న కరీంనగర్లో నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర అంశాలపైనా దిశానిర్దేశం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నారని.. వారు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదేనన్నారు. కష్టపడి పరీక్ష రాసి సెలెక్టై ఉద్యోగాల్లో చేరిన జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు.
4 ఏళ్ల ప్రొబేషనరీ పూర్తయ్యాక కూడా ఇలా: ఏ ఉద్యోగానికైనా రెండేళ్ల ప్రొబెషనరీ పీరియడ్ ఉంటే వీరికి మూడేళ్ల ప్రొబెషనరీ పీరియడ్ నిర్ణయించారని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఆ తరువాత మరో ఏడాది పెంచారని.. అయినప్పటికీ జూనియర్ కార్యదర్శులు అన్నీ భరించి 4 ఏళ్ల ప్రొబెషనరీ పీరియడ్‌ను పూర్తి చేసినా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం అన్నారు. గ్రామాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే... గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయంటే కారణం జూనియర్ పంచాయతీ కార్యదర్శులేనని తెలిపారు. అయినా వారిపై ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ రోజు సాయంత్రంలోపు విధుల్లో చేరకుంటే సమ్మె చేస్తున్న జేపీఎస్‌లను తొలగిస్తామని హెచ్చరించడం దుర్మార్గమని బండి ఫైర్ అయ్యారు.
విధుల్లో చేరని వాళ్ల ఉద్యోగాలు తొలగిస్తాం: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) తమను క్రమబద్ధీకరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు చేస్తున్న సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. జేపీఎస్‌లు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మెను విరమించి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో చేరకుంటే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేసింది.
ఇవీ చదవండి: